Business

దూకుడు పెంచమని ఉచిత సలహా పారేసిన టెలికాం మంత్రి

దూకుడు పెంచమని ఉచిత సలహా పారేసిన టెలికాం మంత్రి - Indian Telecom Minister Ravishankar Prasad Tries To Inspire BSNL

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పలు సూచనలు చేశారు. టెలికాం మార్కెట్‌లో రెండు కంపెనీలూ దూకుడు పెంచాలని సూచించారు. వీఆర్‌ఎస్‌ మార్గదర్శకాల అమలుతో పాటు ఆస్తుల మానిటైజ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవల ఆయా టెలికాం కంపెనీ బోర్డులతో సమావేశమైన ఆయన.. ఈ మేరకు కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పునరుద్ధరణ ప్యాకేజీని వినియోగించుకుని పోటీతత్వాన్ని మరింత పెంచుకోవాలని రవిశంకర్‌ ప్రసాద్‌ రెండు టెలికాం కంపెనీలకు సూచించారు. గతనెల ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ భేటీలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ కంపెనీలు విలీనం చేయడంతో పాటు పునరుద్ధరణ ప్యాకేజీ కింద రూ.69వేల కోట్లు ప్రకటించింది. ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ అమలు, ఆస్తుల మానిటైజేషన్‌కు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వీఆర్‌ఎస్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని తాజా భేటీలో కంపెనీలకు రవిశంకర్‌ ప్రసాద్‌ సూచించారు. పురోగతిని తాను స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. అధికారులు, ఉద్యోగులతో కూడా భేటీ కావాలని బోర్డు సభ్యులకు సూచించారు. ఆస్తుల మానిటైజ్‌ ప్రక్రియను చేపట్టి తనకు తెలియజేయాలని సూచించారు.