Devotional

5వ తేదీ నుండి త్రైమాసిక మెట్లోత్సవం

Metlotsavam In Tirumala By TTD 2019

నవంబరు 5 నుండి 7వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నవంబరు 5 నుండి 7వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది.

తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల టిటిడి మూడో సత్ర ప్రాంగణంలో ప్ర‌తిరోజూ ఉదయం 5 నుండి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు చేపడతారు.

ఉదయం 8.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల భజన మండళ్ల‌తో సంకీర్తనలు నేర్పిస్తారు. మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు ధార్మిక సందేశాలు, హరిదాసులు మానవాళికి అందించిన ఉపదేశాలు తెలియజేస్తారు.

సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

న‌వంబ‌రు 5న శోభాయాత్ర‌

నవంబరు 5న సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి మూడో సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు.

సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అధికార ప్రముఖులు సందేశమిస్తారు.

నవంబరు 7వ తేదీ ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహిస్తారు.

అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.

ఎంద‌రో మ‌హ‌నీయుల అడుగుజాడ‌ల్లో…

గతంలో ఎందరో మహర్షులు, రాజర్షులు శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీక ష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని కాలినడక అధిరోహించి మరింత పవిత్రమయం చేశారు.

అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపట్టింది.

ఇలా సప్తగిరులను అధిరోహించి సప్తగిరీశుని దర్శిస్తే, వారికి సకల అరిష్టములు తొలగి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి.