కార్మికుల్లో ఎంత ఆవేదన ఉందో రోడ్లపైకి వచ్చిన వారినే చూస్తే తెలుస్తుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో లాంగ్‌మార్చ్ నిర్వహించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ప్రభుత్వం సరిగా పనిచేయనందునే ఇంతమందిలో ఆవేదన పెరిగిందన్నారు. ఇప్పటి వరకు 36 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారన్నారు. వైకాపా నేతల ఆరోపణలపై స్పందిస్తూ.. ప్రజలకు మాత్రమే తాను దత్తపుత్రుడినని, చంద్రబాబుకుకాదని స్పష్టం చేశారు. తన ప్రసంగంలో వైకాపా ప్రభుత్వం, ఆ పార్టీ నేతల తీరుపై పవన్ నిప్పులు చెరిగారు. ‘‘అధికారం కోసం అర్రుల చాచే వ్యక్తిని కాదు. రాజకీయాలు అంటే అందరికీ సంపాదనేమో.. నాకు మాత్రం బాధ్యత. ప్రజల ఆవేదనే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. నాయకులంతా బాధ్యతగా ఉండుంటే జనసేన పెట్టే అవసరమే లేకపోయేది. సీఎం జగన్ అద్భుత పాలన అందిస్తే నేను మళ్లీ సినిమాలు చేసుకుంటా. ఇసుక కొరత వల్లే అభివృద్ధి ఆగిపోయింది. భవన నిర్మాణ కార్మికుల కష్టం చాలా బలంగా నా మనసును తాకింది. ఆ కార్మికుల కష్టాల్లో నాకు దేవుడు కనిపించాడు. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోపే ప్రజలు ఎందుకు రోడ్ల మీదకు వస్తున్నారో ఆలోచించాలి’’ అని పవన్ అన్నారు.
నేను చంద్రబాబు దత్తపుత్రుడిని కాను
Related tags :