Sports

అదరగొట్టిన భారత మహిళా జట్టు

Indian Womens Cricket Team Wins Against West Indies

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా మహిళా జట్టు రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. 53 పరుగుల తేడాతో మిథాలీ సేన గెలుపొందింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 50 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియా పునియా(5), జమిమా రోడ్రిగ్స్‌(0) ఆదిలోనే నిరాశపరిచినా.. పూనమ్‌ రౌత్‌ (77), మిథాలి రాజ్‌ (40), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(46) ఆదుకున్నారు. దీంతో టీమిండియా మోస్తారు స్కోర్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. కెప్టెన్‌ క్యాంప్‌బెల్‌ (39) రాణించడంతో విండీస్‌ జట్టు తొమ్మిది వికెట్లకు 138 పరుగులు చేసి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో రాజేశ్వరి, పూనమ్‌, దీప్తిశర్మ తలో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి వన్డేలో విండీస్‌ గెలుపొందగా.. సిరీస్‌ 1-1తో రసవత్తరంగా మారింది. మూడో వన్డే (ఫైనల్‌ మ్యాచ్‌) బుధవారం జరగనుంది.