Business

సరసం…కొంప ముంచింది

McDonalds CEOs Affair Costed Him His Job

ఒక ఉద్యోగినితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నట్లు తేలడంతో, మెక్‌ డొనాల్డ్స్‌ సంస్థ తమ ప్రెసిడెంట్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) స్టీవ్‌ ఈస్టర్‌బ్రూక్‌ను పదవి నుంచి తొలగించింది. మెక్‌ డొనాల్డ్స్‌ యూఎస్‌ఏ ప్రెసిడెంట్‌గా ఉన్న క్రిస్‌ కెంప్‌జింకీని సీఈఓగా నియమించడంతో పాటు డైరెక్టర్ల బోర్డులోకీ ఎన్నుకుంది. కంపెనీ అంతర్జాతీయ మార్కెట్ల ప్రెసిడెంట్‌ అయిన జో ఎర్లింగర్‌ ఇకపై మెక్‌ డొనాల్డ్స్‌ అమెరికా అధిపతిగా వ్యవహరించనున్నారు.‘కంపెనీ నిబంధనావళిని అతిక్రమించినందుకు ఈస్టర్‌బ్రూక్‌ను కంపెనీ నుంచి తొలగించాం. ఒక ఉద్యోగినితో సంబంధం విషయంలో ఆయన నిర్ణయం పేలవంగా ఉంది. నాయకత్వ మార్పు వల్ల కంపెనీ నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలపై ప్రభావం పడదు’ అని తమ ఉద్యోగులకు పంపిన ఇ మెయిల్‌లో సంస్థ పేర్కొంది. కంపెనీ విధానాలను అతిక్రమిస్తూ, ఉద్యోగినితో సంబంధం పెట్టుకోవడం తప్పేనని ఈస్టర్‌ బ్రూక్‌ కూడా ప్రకటించారు. ‘కంపెనీ విలువలను అనుసరించి, బోర్డు నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా. నేను కంపెనీని వీడుతున్నా’ అని బ్రూక్‌ మెయిల్‌ చేశారు. 2015 నుంచి సంస్థ సీఈఓగా బ్రూక్‌ ఉన్నారు. ఈయన హయంలోనే మెక్‌ డొనాల్డ్స్‌ షేరు విలువ రెట్టింపైనా, విక్రయాలు మాత్రం తగ్గుతున్నాయి.