Health

గాఢ నిద్రతో ఆదుర్దా దూరం

Deep Sleep Alleviates Anxiety Disorders

మానసిక ఆదుర్దా, ఆందోళనకు నిద్రతో చాలావరకూ విరుగుడు లభిస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. కంటి నిండా నిద్ర లేకుంటే ఈ సమస్య 30 శాతం మేర పెరుగుతుందని వారు పేర్కొన్నారు. ఆందోళనకు సంబంధించిన రుగ్మతలకు ఔషధాలు అవసరంలేని పరిష్కార మార్గంగా గాఢ నిద్రను సూచించవచ్చని తెలిపారు. మానసిక రుగ్మతలతో బాధపడేవారిలో ఆందోళన, భయం, ఆదుర్దా వంటి భావనలు తలెత్తుతుంటాయి. ఈ సమస్యపై నిద్ర ఎంత మేర ప్రభావం చూపుతుందన్నది పరిశీలించేందుకు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. రాత్రంతా పూర్తిస్థాయి నిద్రించిన దశలో ఒకసారి, నిద్రే లేని సమయంలో మరోసారి వారికి భావోద్వేగాలతో ముడిపడిన వీడియో క్లిప్‌లను చూపారు. రాత్రంతా నిద్ర లేనప్పుడు వాలంటీర్ల మెదళ్లలో ‘మీడియల్‌ ప్రీఫ్రాంటల్‌ కార్టెక్స్‌’ అనే భాగం మూసుకుపోతున్నట్లు గుర్తించారు. ఆదుర్దాను అదుపులో ఉంచడం దీని విధి. మెదడులో లోతైన భావోద్వేగాలకు సంబంధించిన భాగాలు కూడా ఈ వాలంటీర్లలో అతిగా క్రియాశీలమైనట్లు గమనించారు. అందుకు విరుద్ధంగా.. పూర్తిస్థాయిలో నిద్ర పోయిన తర్వాత వీడియోలను వీక్షించినప్పుడు ఈ వాలంటీర్లలో ఆదుర్దా స్థాయి చాలా తక్కువగా ఉండటం విశేషం.