అంపైర్, లెగ్ అంపైర్, థర్డ్ అంపైర్, ఫోర్త్ అంపైర్.. ఇన్నాళ్లుగా క్రికెట్‌లో మనకు తెలిసిన అంపైర్లు..! అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో ఈ లిస్ట్‌లో నోబాల్ అంపైర్ కూడా చేరతాడు. అంపైరింగ్ తప్పులు తగ్గించేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. అంపైర్ల తప్పుడు నిర్ణయాలు కొన్నిసార్లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తున్నాయి. ఉదాహరణకు గత ఐపీఎల్‌లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పేసర్ మలింగ వేసిన నోబాల్‌ను అంపైర్ రవి గుర్తించకపోవడంతో రిజల్ట్ మారిపోయింది. దీంతో రవిపై బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పట్లో ఈ విషయం చాలా చర్చ రేపింది. ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలకు చెక్ పెట్టేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ‘నోబాల్ అంపైర్’ను తెరపైకి తెచ్చింది. బ్రిజేశ్ పటేల్ నేతృత్వంలో మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కౌన్సిల్‌లోని ఓ కీలక సభ్యుడు మాట్లాడుతూ..‘ఫ్రంట్ ఫుట్ నోబాల్స్‌ను గుర్తించడానికి ప్రత్యేకంగా ఓ అంపైర్‌ను పెట్టాలని అనుకుంటున్నాం. ఓ డెలివరీ.. నో బాలా కాదా అని కనిపెట్టడమే అతని పని. ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్‌ను సమన్వయం చేసుకుంటూ అతను పని చేస్తాడు. ఈ నిర్ణయం వింతగా అనిపించవచ్చు. కానీ మేము ఈ అంశంపై లోతుగా చర్చించాం. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే సీజన్‌లో ఈ విధానాన్ని అమలు చేస్తాం. అంతకంటే ముందు డొమెస్టిక్ టోర్నీల్లో పరీక్షిస్తాం. అంపైరింగ్ తప్పులు తగ్గించాలనే మేము ప్రయత్నిస్తున్నాం అని’ అన్నారు.
నోబాల్‌కు కూడా ఒక అంపైర్
Related tags :