Agriculture

తెలంగాణాలో భారీగా పెరిగిన భూగర్భ జలాలు

Telugu Agricultural News-Ground Water Levels Increased In Telangana

రాష్ట్రంలో సాధారణ స్థాయికి మించి కురిసిన వర్షాలతో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండల్లా మారగా.. మరోవైపు భూగర్భ జలమట్టం పైపైకి ఉబికివస్తున్నది. గత కొన్నేండ్లుగా ఆందోళనకరస్థాయిలో భూగర్భ జలాలు పడిపోతున్న సమయంలో ఈసారి కురిసిన వర్షాలతో మళ్లీ జీవం పోసినట్టయింది. ఐదు నెలల్లోనే 6.64 మీటర్ల మేర భూగర్భ జలాలు పైకి వచ్చాయి. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు భూగర్భ జలమట్టం స్థాయిపై తెలంగాణ భూగర్భజలశాఖ సర్వే నిర్వహించింది. మేలో రాష్ట్రంలో సరాసరి భూగర్భ జలమట్టం స్థాయి 14.556 మీటర్లుగా ఉన్నది.

అక్టోబర్ 31 నాటికి సరాసరి 7.92 మీటర్లకు చేరుకున్నాయి. గతేడాది అక్టోబర్‌లో 10.35 మీటర్ల లోతులో అందుబాటులో ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో స్వల్పంగా 0.13 మీటర్లు మాత్రమే భూగర్భజలాలు పైకిరాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7.75 మీటర్లు పైకి ఎగబాకాయి. జూన్, జూలైలో వర్షాలు కొంతమేర నిరాశపరిచినా.. సెప్టెంబర్, అక్టోబర్‌లో దంచికొట్టాయి. దీంతో మేలో 14.56 మీటర్లలో ఉన్న భూగర్భజలాలు సెప్టెంబర్‌లో 9.85 మీటర్లకు, అక్టోబర్ చివరి నాటికి 7.92 మీటర్ల వరకు వచ్చాయి. అతితక్కువ లోతులో కేవలం 3.34 మీటర్లలోనే భూగర్భజలాలు అందుబాటులో ఉన్న జిల్లాగా ఖమ్మం నమోదుకాగా, అతి ఎక్కువ లోతులో ఉన్న జిల్లాగా మెదక్ నమోదయింది. ఈ జిల్లాలో ఏకంగా 18.37 మీటర్ల లోతుకు జలాలు పడిపోయాయి.

ఐదుశాతం ప్రాంతాల్లో ఆందోళనకరం
రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో భూగర్భ జలమట్టం స్థాయిపై వివరాలు సేకరించిన అధికారులు అవి విస్తరించిన స్థాయినిబట్టి జోన్లుగా నిర్ధారించారు. 38 శాతం ప్రాంతా ల్లో భూగర్భజలాలు ఐదుమీటర్ల కంటే తక్కువ లోతులోనే అందుబాటులో ఉన్నట్టుగా తేలింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతోపాటు ఖమ్మం జిల్లాలో అత్యధిక భాగంలో జలాల స్థాయి మెరుగైన రీతిలో ఉన్నది. 32 శాతం ప్రాంతాల్లో 5 నుంచి 10 మీటర్ల లోతులో.. 17 శాతం ప్రాంతాల్లో 10 నుంచి 15 మీటర్ల లోతులో ఉన్నట్టు తేలింది. ఎనిమిది శాతం ప్రాంతాల్లో 15 నుంచి 20 మీటర్ల స్థాయికి పడిపోయాయి. ఐదుశాతం ప్రాంతాల్లో ఆందోళకరంగా 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. సంగారెడ్డి మధ్య, తూర్పు, మెదక్ పశ్చిమ, వికారాబాద్ ఆగ్నేయ, సిద్దిపేట పశ్చిమ, నాగర్‌కర్నూల్ ఉత్తర, నల్లగొండ జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో ఈ విధమైన పరిస్థితి ఉన్నది. దశాబ్దకాలం పెరుగుదల-తగ్గుదలను పరిశీలిస్తే.. 372 మండలాల్లో (63 శాతం) పెరుగుదల, 217 మండలాలు (37 శాతం) తగ్గుదల కనిపించింది.

17 శాతం అధిక వర్షపాతం
భూగర్భ జలాలు పైకి ఎగబాకడానికి ప్రధాన కారణం ఈసారి అధికవర్షపాతం నమోదుకావడమేనని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన 964 పీజో మీటర్ల ద్వారా వర్షపాతం వివరాలను సేకరించారు. జూన్ ఒకటో తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు సాధారణ వర్షపాతం 816 మిల్లీమీటర్లు కాగా.. 953.4 మిల్లీమీటర్లు కురిసింది. సాధారణం కంటే 17 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో కనిష్ఠంగా 516.6 మిల్లీమీటర్లు.. ములుగు జిల్లాలో గరిష్ఠంగా 1559.8 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. హైదరాబాద్, కరీంనగర జయశంకర్ భూపాలపల్లి, జనగాం, కామారెడ్డి, ములుగు, పెద్దపల్లి, వరంగల్ రూరల్, వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, సిద్దిపేట, మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో సాధారణం కంటే 21 శాతం నుంచి 47 శాతం వరకు ఎక్కువ వర్షపాతం నమోదయింది.