1. నిబంధనల మేరకు ఆర్టీసీ విభజన జరగలేదు
నగరంలోని భాజపా కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద క్రిష్ణమాదిగ కలిశారు. సమ్మె భవిష్యత్ కార్యాచరణ, దిల్లీ పరిణామాలు తదితర అంశాలపై వారు చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నిబంధనల మేరకు ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. విధుల్లో చేరకుండా సమ్మెకు సహకరించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.
2. అవాస్తవాలు మాట్లాడటం సరికాదు: అచ్చెన్న
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై తప్పుగా మాట్లాడినట్లు మంత్రి బొత్స ఒప్పుకోవాలని ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. రాజధానిలో ఒక్కరాయి కూడా వేయలేదంటూ అవాస్తవాలు మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో తెదేపా నేతల బృందం అమరావతి రాజధాని ప్రాంతంలో ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు.
3. కార్మిక నేతలతో చర్చలు జరపాలి: సంజయ్
ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో చేరాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన గడువును కార్మికులు లెక్కచేయలేదని ఎంపీ బండి సంజయ్ అన్నారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే కార్మిక నేతలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుడు కరీంఖాన్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఆయన మృతి చాలా బాధాకరమన్నారు.
4. ఏపీ ఇన్‌ఛార్జి సీఎస్‌గా నీరబ్‌కుమార్ ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జి సీఎస్‌గా నీరబ్‌కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆయనకు బాధ్యతలు అప్పగించారు. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సుబ్రమణ్యంను మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
5. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష
ఉద్యోగాల్లో తిరిగి చేరేందుకు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన గడువు మంగళవారం అర్ధరాత్రితో పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ, రవాణా శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఆర్టీసీ సమ్మె ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు ముందుంచాల్సిన అంశాలపై సమీక్షిస్తున్నారు. అంతేకాకుండా ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
6. పోలవరంలో పూడికతీత పనులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. కాంక్రీటు పనులు ప్రారంభించే ముందు నీరు, పూడిక మట్టి తొలగింపు పనులను మేఘా సంస్థ చేపట్టింది. దీంతో స్పిల్‌వేతో పాటు ఇతర నిర్మాణ ప్రాంతంలో క్రమక్రమంగా నిల్వనీరు తగ్గుతోంది. నీటి నిల్వలను వేగంగా తగ్గించేందుకు కాళేశ్వరం నుంచి నిపుణుల బృందాన్ని మేఘా తెప్పించింది. ఇంకా నిల్వ ఉన్న నీటిని మరింత వేగంగా తోడేందుకు మోటార్లను ఏర్పాటు చేశారు.
7. ‘భారత్ వ్యూహాలతో పాక్ భయాందోళన’
అఫ్గానిస్థాన్‌తో భారత్‌కున్న మెరుగైన సంబంధాల వల్ల పాకిస్థాన్ ఆందోళన చెందుతోందని అమెరికా అభిప్రాయపడింది. అందుకే తాలిబన్లతో పాక్ సత్సంబంధాలను కోరుకుంటోందన్నారు. భారత్‌కు తాలిబన్లైతేనే వ్యతిరేకంగా వ్యవహరిస్తారని పాక్ భావిస్తోందన్నారు. ‘‘అఫ్గానిస్థాన్‌లో భారత్ బలమైన దౌత్య, వాణిజ్యపరమైన ఉనికిని కలిగి ఉంది. దీనికి అమెరికా మద్దతు కూడా తోడైంది. దీంతో తమ దేశాన్ని భారత్ వ్యూహాత్మకంగా చుట్టుముట్టేందుకు యత్నిస్తోందని పాకిస్థాన్ భయాందోళనకు గురవుతోంది’’ అని అమెరికా ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్(సీఆర్‌ఎస్)’ అందించిన స్వతంత్ర నివేదికలో వెల్లడించారు.
8. ‘దేశంలోకి పాక్ విషవాయువులు వదులుతోంది’
దిల్లీలో కాలుష్యానికి చైనా, పాకిస్థాన్‌లే కారణమంటూ ఉత్తర్‌ప్రదేశ్ భాజపా నేత వినీత్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్లీలోకి పాక్, చైనా దేశాలు విష వాయువులను వదిలి ఉంటాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. భారత్‌కు భయపడే పొరుగు దేశాలు ఈ దారుణానికి ఒడిగడుతున్నట్లు తాను భావిస్తున్నానన్నారు. దీనిపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌తో ప్రత్యక్షంగా తలపడలేకే ఆ దేశాలు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నాయన్నారు.
9. సైనా ఇంటికి.. కశ్యప్ ముందుకు
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. చైనా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సైనా తొలిరౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. మరోవైపు భారత స్టార్ ఆటగాడు, సైనా భర్త పారుపల్లి కశ్యప్ ఈ టోర్నీలో రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో థాయ్‌లాండ్ క్రీడాకారుడు సిత్తికోమ్ థమ్మాసిన్‌పై 21-14, 21-3తో వరుస గేమ్‌లలో విజయం సాధించాడు
10.విశాఖ- సింగపూర్ స్కూట్ విమాన సర్వీసు
సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన చవక విమానయాన సంస్థ స్కూట్.. విశాఖపట్నం నుంచి సింగపూర్‌కు విమాన సేవలు ప్రారంభించింది. వారానికి ఐదు సార్లు ఈ సర్వీసును నిర్వహించనుంది. సోమ, బుధ, శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 11 గంటలకు వైజాగ్ నుంచి బయలుదేరే ఈ విమానం, ఉదయం 5.40కి సింగపూర్ చేరుకుంటుంది. మళ్లీ అవే రోజుల్లో సింగపూర్‌లో సాయంత్రం 8.45కి బయలుదేరి, రాత్రి 10 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. వైజాగ్‌తో పాటు కోయంబత్తూరు నుంచి కూడా విమాన సేవల్ని స్కూట్ ప్రారంభించింది.
నేటి పది ప్రధాన వార్తలు-11/06
Related tags :