DailyDose

నేటి పది ప్రధాన వార్తలు-11/07

Telugu Top 10 News Roundup - Telugu Breaking News Of The Day-నేటి పది ప్రధాన వార్తలు-11/07

1.ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ధర్మాసనం ఆదేశాలతో ఇవాళ్టి విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు. నిన్న హైకోర్టులో అధికారులు సమర్పించిన నివేదికలపై స్వయంగా వివరణ ఇవ్వాలని సీఎస్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సమర్పించిన రెండు నివేదికలూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని తెలుసా? అని గుర్తు చేసింది.
2. మంత్రి అనిల్‌ కాన్వాయ్‌ అడ్డగింత
కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలో శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగ బాధితులు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు గత 60 రోజుల నుంచి తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ నిరసన దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని వారన్నారు. కర్నూలులో జరుగుతున్న జిల్లా సమావేశానికి వెళ్తుండగా.. నిరసన దీక్షలు చేస్తున్న బాధితులు కర్నూలు-గుంటూరు రహదారిపై ఆయన కాన్వాయ్‌కు అడ్డుపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టులో తాము సర్వస్వం కోల్పోయామని 40 ఏళ్లనుంచి ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నామని వారు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
3. నౌహీరా షేక్‌కు ముంబయిలో బినామీలు
హీరాగోల్డ్‌ కేసులో సీసీఎస్‌ పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్‌కు ముంబయిలో బినామీలు ఉన్నట్లు తాజాగా గుర్తించారు. వారిలో ఓ వైద్యురాలితోపాటు, వ్యాపారి కూడా ఉన్నట్లు తెలిపారు. హీరాగోల్డ్ కంపెనీ నుంచి ఆ ఇద్దరి ఖాతాలకు రూ.450 కోట్లు మళ్లించినట్లు అధికారులు నిర్ధరించారు. నౌహీరా షేక్‌కు సంబంధించిన మరో మూడు కేసుల్లో తాజాగా నాంపల్లి కోర్టులో సీసీఎస్‌ పోలీసులు అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇప్పటి వరకు నౌహీరా షేక్‌కు చెందిన 124 ఆస్తులను గుర్తించారు.
4. అమరావతి నిర్వీర్యం దుర్మార్గం: సోమిరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరం అమరావతిలో భవనాలను కళ్లకు కట్టినట్టు ప్రజల ముందుంచిన మీడియాపైనా ప్రభుత్వం జీఓ 2430 ప్రయోగించినా ఆశ్చర్యపోనక్కరలేదని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. వేలాది కోట్లతో అద్భుతమైన కట్టడాలు రూపు దిద్దుకుంటున్నాయని, ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయని ఇప్పటి వరకు బహుశా వైకాపా శ్రేణులకు కూడా తెలియదేమోనని విమర్శించారు. ప్రజల కలల రాజధానిలో భారీ భవంతుల నిర్మాణాన్ని ఓర్చుకోలేక వాటిని నిర్వీర్యం చేయాలనుకోవడం దుర్మార్గమని సోమిరెడ్డి మండిపడ్డారు.
5. అయోధ్యపై అనవసర వ్యాఖ్యలు వద్దు
అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం కేసులో సుప్రీంకోర్టు కొద్దిరోజుల్లో తీర్పు వెలువరించనున్న నేపధ్యంలో ఈ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు హితవు పలికారు. మోదీ అధ్యక్షతన బుధవారం కేబినెట్‌ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరికీ శాంతి, సామరస్యాలను కాపాడవలసిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు.
6. కర్తార్‌పుర్‌ సందర్శనకు పాస్‌పోర్టు ఉండాల్సిందే
కర్తార్‌పుర్‌ సందర్శనకు వచ్చే భారత యాత్రికులకు పాస్‌పోర్టు తప్పనిసరి అని పాకిస్థాన్‌ స్పష్టం చేసింది. కర్తార్‌పుర్‌ నడవా మీదుగా గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ను దర్శించుకునే భారత సిక్కు యాత్రికులకు పాస్‌పోర్టు అవసరం లేదని, కేవలం గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుందని ఇటీవల ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారత సిక్కు యాత్రికులకు పాస్‌పోర్టు ఉండాల్సిందేనని తాజాగా పాక్‌ ఆర్మీ స్పష్టం చేసినట్లు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించాయి.
7. బ్రేక్‌ తీసుకోనున్న మహేశ్‌
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదలయ్యాక మహేశ్‌ కొంత కాలంపాటు సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌ తెలిపారు. తాజాగా ఆమె ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. ‘నిజమే.. ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలయ్యాక మహేశ్‌ మూడు నెలలపాటు బ్రేక్‌ తీసుకోనున్నారు. ఈ బ్రేక్‌లో గౌతమ్‌, సితారతో సరదాగా గడపాలని ఆయన అనుకుంటున్నారు.
8. థర్డ్‌ అంపైరే నోబాల్స్‌ను గుర్తుపట్టాలి
ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్లో నోబాల్స్ వివాదం తీవ్ర చర్చలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వాటిని గుర్తించేందుకు ‘నోబాల్‌ అంపైర్‌’ను తీసుకురావాలని ఐపీఎల్‌ పాలక మండలి తాజాగా ప్రతిపాదన చేసింది. ఈ సందర్భంగా ఆసీస్‌ దిగ్గజం, మాజీ క్రికెటర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌ స్పందిస్తూ.. ఐపీఎల్‌లో సరైన నిర్ణయాలు తీసుకొనేందుకు థర్డ్‌ అంపైరే నో బాల్స్‌ను గుర్తించాల్సిన అవసరముందన్నాడు. నాలుగో అంపైర్‌ అవసరం ఉన్నా లేకున్నా.. థర్డ్‌ అంపైర్‌ వెంటనే రీప్లే చూసి బ్యాట్స్‌మన్‌ను నాటౌట్‌గా ప్రకటించాలని అన్నాడు.
\9. సురేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమం
తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యకేసులో నిందితుడు సురేశ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ఉస్మానియా ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్‌ రఫి తెలిపారు. దాదాపు 65 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేశ్‌కు నిన్న రాత్రి ఏడు గంటల నుంచి శ్వాసతీసుకోవడం ఇబ్బంది అవుతోందని డాక్టర్‌ రఫి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
10.మహా’ సీఎం ఆయనే… తేల్చిచెప్పిన గడ్కరీ…
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు చేపట్టబోతున్నట్టు వస్తున్న వార్తలను కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తోసిపుచ్చారు. మహారాష్ట్ర తిరిగి వచ్చే ప్రసక్తే లేదనీ… తాను ఢిల్లీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ కొనసాగుతారని స్పష్టం చేశారు. ‘‘మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుంది. దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆరెస్సెస్‌కిగానీ, మోహన్ భగవత్‌కి గానీ దీంతో సంబంధం లేదు. మాకు శివసేన మద్దతు ఉంటుంది. వాళ్లతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి…’’ అని ఆయన పేర్కొన్నారు. సీఎం పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకుందామని శివసేన ప్రతిపాదించడం… అందుకు బీజేపీ ససేమిరా అనడంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో్ మెజారిటీ మార్కు 145గా ఉంది. బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది.