ప్రపంచవ్యాప్తంగా పలు విమానయాన సంస్థలు సుదూర ప్రయాణాలకు ఎక్కువగా వినియోగిస్తున్న అత్యాధునిక ‘బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్’ విమానాల్లో ఆక్సిజన్ వ్యవస్థ సంబంధిత లోపాలున్నాయని ప్రజావేగు ఒకరు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఆ వ్యవస్థలు మొరాయించే అవకాశముందని పేర్కొన్నారు. 32 ఏళ్లపాటు బోయింగ్‌లో పనిచేసి పదవీ విరమణ చేసిన జాన్ బార్నెట్ తాజాగా ‘బీబీసీ’తో మాట్లాడుతూ.. ‘787 డ్రీమ్‌లైనర్’లలో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ వ్యవస్థల్లో పాతిక శాతం లోపభూయిష్టమైనవేనన్నారు. 2016లో దక్షిణ కరోలినాలోని ఉత్తర చార్లెస్టన్లో ఉన్న బోయింగ్ కర్మాగారంలో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు అత్యవసర ఆక్సిజన్ వ్యవస్థల్లో సమస్యలను తాను గుర్తించినట్లు చెప్పారు. 300 ఆక్సిజన్ వ్యవస్థలను పరీక్షించగా.. వాటిలో 75 అత్యవసర పరిస్థితుల్లో సరిగా పనిచేయలేదని పేర్కొన్నారు. లోపాలను విస్తృతంగా పరిశీలించేందుకు తాను చేసిన ప్రయత్నాలను బోయింగ్ మేనేజర్లు అడ్డుకున్నారని ఆరోపించారు. ‘787 డ్రీమ్‌లైనర్’ల ఉత్పత్తిని నిర్దేశిత సమయంలో పూర్తిచేసే హడావుడిలో ప్రయాణికుల భద్రతను సిబ్బంది గాలికొదిలేశారని ఆరోపించారు. మరోవైపు, బార్నెట్ ఆరోపణలను బోయింగ్ ఖండించింది. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో తాము విమానాలను తయారుచేశామని స్పష్టం చేసింది.
బోయింగ్ 787లో ఊపిరి ఆగవచ్చు
Related tags :