* దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ వినియోగదారులకు ఒక నెల పాటు ఉచితంగా బ్రాడ్ బ్యాండ్, వైఫై సేవలు అందించనున్నట్లు సంస్థ సీఎఫ్‌ఏ (కన్జ్యూమర్ ఫిక్స్‌డ్ యాక్సిస్) ఎండీ (దిల్లీ) వివేక్ బాంజల్ తెలిపారు. ల్యాండ్ లైన్ వినియోగదారులు అయిదు నిమిషాలకు పైబడి అవుట్‌గోయింగ్ కాల్(ఏ ఫోన్‌కు చేసినా) మాట్లాడితే తామే 6 పైసలు ఎదురిస్తామని..అలా ఎన్నికాల్స్ 5 నిమిషాలు మించి మాట్లాడినా ఇస్తామని పేర్కొన్నారు. గురువారం ఏపీ సర్కిల్ కార్యాలయంలో సమీక్ష అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉచిత బ్రాడ్ బ్యాండ్ ప్లాన్‌లో నెల రోజుల పాటు 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రోజుకు 5 జీబీ వరకు ఉచితంగా ఇంటర్‌నెట్ వినియోగించుకోవచ్చని అన్నారు. ఆ తరువాత కనీస ప్లాన్ నెలకి రూ.349 (రోజుకి 2 జీబీ, 8 ఎంబీపీఎస్ స్పీడ్) నుంచి మొదలవుతుందన్నారు. గుంటూరు, విజయవాడ నగరాల్లో 4జీ సేవలు ఇప్పటికే మొదలయ్యాయని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఫైబర్ కనెక్టివిటీతో కేబుల్, ఇతర డేటా సేవలందించే సంస్థల భాగస్వామ్యంతో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్, హోం వైఫై కనెక్షన్లు అందిస్తున్నామని, రాష్ట్రంలో తొలి ప్రయత్నంగా విశాఖపట్నంలో వీటిని ప్రారంభించామని అన్నారు.
*మూడీస్ ఇన్వెస్టర్స్ సర్సీస్’ భారత్ రేటింగ్ అవుట్‌లుక్‌ను తగ్గించింది. ఇప్పటి వరకు ‘స్టేబుల్’గా ఉన్న ఆర్థిక వ్యవస్థని ప్రస్తుతం ‘నెగటివ్’కి చేర్చింది. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి మరింత క్షీణించే ప్రమాదం ఉందని తెలిపింది. ఆర్థిక, సంస్థాగత బలహీనతల్ని పరిష్కరించడంలో మూడీస్ అంచనా వేసిన దానికంటే ప్రభుత్వం నెమ్మదిగా స్పందిస్తోందని సంస్థ అభిప్రాయపడింది.
*గత నెల చివరిలో రూ. 40 వేలను తాకిన 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర, ఇప్పుడు భారీగా దిగివచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులతో పాటు స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో, పెట్టుబడిదారులు బులియన్ మార్కెట్ నుంచి వైదొలగుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. నిన్న ఒక్కరోజులో బంగారం ధర ఇండియాలో 10 గ్రాములకు రూ. 672 తగ్గి, రూ. 37,575కు చేరింది. బుధవారంతో పోలిస్తే, ఇది 1.75 శాతం తక్కువ. ఇదే సమయంలో వెండి ధర కిలోకు ఏకంగా రూ. 1,490 పడిపోయి, రూ. 44,168కి చేరుకుంది.అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే, ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్ ఉనైమెక్స్ లో ఔన్స్ బంగారం ధర 30 డాలర్లకు పైగా పతనమై, 1,462 డాలర్ల వద్దకు చేరింది. తమ మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలుకుతున్నట్టు అమెరికా, చైనా ప్రకటించడంతో చాలామంది ఇన్వెస్టర్లు బులియన్ మార్కెట్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. ఇక నేడు కూడా బంగారం ధర దిగివస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
*అనిల్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్థిక స్థితి బలహీనంగా ఉన్న కారణంగా ఆ కంపెనీ మార్కెట్లో పాలసీలు విక్రయించడాన్ని ఐఆర్డీఏఐ నిషేధించింది.
*తెలుగు రాష్ట్రాల్లో ఐసీఐసీఐ బ్యాంకు రిటైల్ నెట్వర్క్ను విస్తరిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు రాష్ట్రాల్లో 57 కొత్త శాఖలను ప్రారంభిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుప్ బగ్చి తెలిపారు.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి జీఓసీఎల్ కార్పొరేషన్ ఏకీకృత నికర లాభం తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సెప్టెంబరుతో ముగిసిన మూడు నెలలకు లాభం రూ.5.98 కోట్ల నుంచి రూ.5.06 కోట్లకు పరిమితమైందని కంపెనీ వెల్లడించింది.
*మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి ఆంధ్రా బ్యాంకు రూ.70 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.434 కోట్ల నష్టాన్ని చవిచూసినట్లు బ్యాంకు తెలిపింది. సమీక్ష త్రైమాసికంలో కేటాయింపులు 24 శాతం తగ్గి రూ.1,732 కోట్ల నుంచి రూ.1,316 కోట్లకు పరిమితమయ్యా యి.
*మెర్సిడెస్ బెంజ్ మార్కెట్లోకి వి-క్లాస్ ఎలైట్ను తీసుకువచ్చింది. ఈ కారు ధర రూ.1.10 కోట్లు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మార్టిన్ షువెంక్ ఈ కారును విడుదల చేశారు.
*పరిశ్రమల ఏర్పాటు కోసం దరఖాస్తుల పరిశీలన రుసుమును విద్యుత్తు హార్స్పవర్ ఆధారంగా నిర్ణయించారు.
బీఎస్ఎన్ఎల్ ఉచిత సేవలు-వాణిజ్యం-11/08
Related tags :