తమ దేశంలో మైనర్లు వీడియో గేమ్స్ ఆడటంపై చైనా పలు ఆంక్షలు విధించింది. దేశంలోని యువకులు, చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కీలక విధివిధానాలు రూపొందించింది. వీడియో గేమ్స్ ఆడటం ఓ వ్యసనంగా మారడంతో దాన్ని అరికట్టడమే లక్ష్యంగా వీడియో గేమ్స్‌పై ఆంక్షల కళ్లెం వేసింది. దేశ పౌరులు ఆన్‌లైన్ వీడియో గేమ్స్‌కు బానిసలవుతుండటంతో వారిలో మానసికపరమైన సమస్యలు తలెత్తున్నాయని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో డ్రాగన్ పలు పరిమితులు విధించినట్టు సమాచారం. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు 90 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఆడకూడదని నిబంధనలు విధించింది. అలాగే, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8గంటల లోపు వీడియో గేమ్స్ ఆడకూడదని స్పష్టం చేసింది. వారాంతపు రోజులు, ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం మూడు గంటల పాటు ఆడుకొనే వెసులుబాటు కల్పిస్తున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొంది. చైనా ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ ఆంక్షలు దేశంలోని గేమింగ్ సంస్థల ద్వారా నేరుగా అమలు చేయబడతాయి. తమ దేశంలోని యువకుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త మార్గదర్శకాలు రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు. అలాగే, వీడియో గేమ్‌లపై పిల్లలు పెట్టే ఖర్చుపైనా ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. 16 ఏళ్ల లోపు వయస్సున్నవారైతే రూ.2,033 (200 యువాన్)లు, 16 నుంచి 18 ఏళ్ల లోపు వారైతే రూ.4,067 (400 యువాన్లు) మేర ఖర్చు చేయవచ్చని తెలిపింది. అతిపెద్ద గేమింగ్ మార్కెట్ కల్గిన దేశాల్లో చైనా కూడా ఒకటి. వీడియో గేమ్స్‌కు బానిసలు కావడం వల్ల దాదాపు 500 మిలియన్ల మంది చైనీయులు దృష్టిలోపంతో బాధపడుతున్నట్టు 2015లో ఓ సర్వే వెల్లడించింది. అలాగే, ఇది వ్యసనంగా మారితే మానసికంగా విపరిణామాలకు దారితీస్తుందని గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా హెచ్చరికలు జారీచేసింది.
వీడియో గేమ్స్‌పై చైనా ఆంక్షలు
Related tags :