తిరువూరు నియోజకవర్గంలో నాలుగుసార్లు ఎమ్మెల్యే స్థానాన్ని పోగొట్టుకున్న తెలుగుదేశం పార్టీ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తిరువూరు మున్సిపాల్టీలో పాగా వేయడానికి పావులు కదుపుతుంది. ఇటీవల విజయవాడలో జరిగిన నియోజకవర్గ సమీక్షా సమావేశంలో చంద్రబాబునాయుడు తిరువూరు నియోజకవర్గ తెదేపా నేతలకు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. తీరు మార్చుకోకపోతే కొత్త నాయకత్వాన్ని తీసుకువస్తానని చంద్రబాబు గట్టిగా తలంటి పోశారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న తీదేపా నియోజకవర్గ ఇంచార్జి పదవిని స్థానిక సంస్థల ఎన్నికల అనంతరమే ప్రకటిస్తానని చంద్రబాబు తేల్చి చెప్పారు. మూడు సార్లు పరాజయం పాలైన స్వామిదాసుకు గానీ గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ కు గానీ నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలు ఇప్పట్లో అప్పగించడం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపిన నాయకుడికే నియోజకవర్గ ఇంచార్జి బాద్యతలు అప్పగించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. స్వామిదాస్, జవహర్ కాకుండా నూతన వ్యక్తికి పార్టీ నియోజకవర్గ కన్వీనర్ బాధ్యత అప్పగిస్తారని చంద్రబాబుతో భేటీ అనంతరం తెదేపా వర్గాలు అంటున్నాయి.
*** తిరువూరు మున్సిపాల్టీపై దృష్టి
తిరువూరు పట్టణంలో తేదేపాకు మంచి నాయకత్వంతో పాటు కష్టపడే కార్యకర్తలు కూడా ఎక్కువగా ఉన్నారు. గత ఎన్నికల అనంతరం తిరువూరు పట్టణ వైకాపా నేతల మధ్య సమన్వయం లోపించినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎమ్మెల్యే రక్షణనిధికి ఆ పార్టీ పట్టణ నాయకత్వానికి మధ్య కొంత దూరం ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు మున్సిపాల్టీలో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులను సరిదిద్దడంలో రక్షణనిధి శ్రద్ధ చూపడం లేదని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉండటంతో వేలాది మంది ప్రజలు డెంగ్యు జ్వరాల బారిన పడుతున్నారు. మంచినీటి సరఫరా వ్యవస్థ ఏమాత్రం మెరుగుపడలేదు. భారీ వర్షాలు పడుతున్ననప్పటికీ రెండు రోజులకొకసారి మంచినీరు వదులుతున్నారు. మున్సిపల్ కార్యాలయంలో గత ఐదేళ్ళలో అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం అయ్యాయి. వీటిపై విచారణ జరిపించడంలో ఎమ్మెల్యే శ్రద్ధ చూపలేదు. ఈ నేపథ్యంలో తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి తీరాలని మున్సిపాల్టీని కైవసం చేసుకోవాలని తెదేపా నాయకులు, ప్రణాళికలు వేస్తున్నారు. మొన్నటి వరకు తిరువూరులో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం ఉండేది కాదు. కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. కార్యకర్తలను బుజ్జగించి మున్సిపల్ ఎన్నికలకు వారిని సిద్ధం చేసే పనుల్లో తెదేపా నాయకత్వం ఉంది. వైకాపాలో ఇంకా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కసరత్తు ప్రారంభం కాలేదు. అధికారం వచ్చిన ఆనందంలో మున్సిపాల్టీ కూడా తేలికగా కైవసం చేసుకుంటామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూద్దాం.–కిలారు ముద్దుకృష్ణ, సినియర్ జర్నలిస్టు.