Kids

మీ అబ్బాయి నిరంతరం రోదిస్తుంటాడా?

Is your kid crying all day long-here are the reasons

మా బాబు వయసు ఏడాది. ఇంతకుముందు కాలనీలో ఓ ఇంట్లో ఉండేవాళ్లం. చుట్టుపక్కల పిల్లలతో బాబు బాగానే కలిసిపోయి ఆడుకునేవాడు. ఈ మధ్యే మేం అపార్ట్‌మెంట్‌కి మారిపోయాం. ఇక్కడ ఎవరి ఫ్లాట్‌లో వారుంటారు. మా వాడికి ఆడుకోవడానికి చిన్నారులెవరూ తోడు లేరు. దాంతో బాగా ఏడుస్తున్నాడు. ఇదే కొనసాగితే… భవిష్యత్తులో వాడికి ఏదైనా మానసిక సమస్య వస్తుందంటారా?

ఈ వయసున్న చిన్నారులు చాలా హుషారుగా, ఉత్సాహంగా ఉంటారు. చుట్టూ ఉండే ప్రాంతాలను నిశితంగా గమనిస్తారు. అన్నీ నేర్చుకోవాలని, తెలుసుకోవాలనే ఆత్రుత వారిలో ఎక్కువగా ఉంటుంది. పరిసరాలకు ప్రతిస్పందిస్తూనే ఉంటారు. ఇన్ని రోజులు మీ బాబు అందరి మధ్యలో ఉండటం వల్ల మానసికంగా, భావోద్వేగాలపరంగా చాలా ఆనందంగా అందరితో కలిసిపోయాడు. ఎలాంటి అభద్రతకు గురవలేదు. ఒక్కసారిగా మీరు అపార్ట్‌మెంట్‌లోకి తీసుకొచ్చేసరికి పరిస్థితులు, పరిసరాలు మారిపోయాయి. ఇరుకైన గదులు, ఎప్పుడూ ఆ ఫ్లాట్‌లోనే తలుపులు వేసి లోపలే ఉంచేయడం, బయటి పిల్లలతో ఆడుకునే పరిస్థితులు లేకపోవడం… వీటన్నింటితోనే మీ అబ్బాయి చిరాకు పడుతున్నాడు. స్వేచ్ఛపోయి ఒంటరిగా అయిపోయాననే భావన, ఉద్వేగాలను నియంత్రించుకోలేకే ఏడుస్తున్నాడు. మీ బాబు రోజూ ఆనందంగా ఉండేలా చేయండి. అపార్ట్‌మెంట్‌లో కింద పార్కులాంటిది ఉంటే తీసుకెళ్లండి. ఆరుబయట ఎక్కువసేపు ఆడించండి. కొంతకాలం పాటు, కుదిరినప్పుడల్లా పాత ఇంటికి తీసుకెళ్లండి. అక్కడి స్నేహితులు, పిల్లలతో కాసేపు గడిపేలా చూడండి. వీలైనంతవరకు తన ఒంటరితనాన్ని పోగొట్టేందుకు ప్రయత్నించండి. పాత వాతావరణాన్ని చూపుతూనే మెల్లిగా కొత్త పరిసరాలు అలవాటు చేయాలి. మీరూ మీ అబ్బాయితో ఎక్కువ సమయం గడిపేలా చూడండి. కథలు చెబుతూ… ఆడి పాడండి. జంతువులు, వస్తువుల బొమ్మలు ఉండే పుస్తకాల్ని చూపుతూ వాటిని గుర్తించమని చెప్పాలి. చుట్టుపక్కల పిల్లలుంటే వారితో కలిసిపోయేలా చూడండి. క్రమంగా మీ వాడిలో మార్పు వస్తుంది. అదేపనిగా ఏడవకుండా కొత్త ఆట వస్తువులను కొనిపెట్టడం, కథల పుస్తకాలు కొని వాటిని చెప్పడం మంచిది. వీటన్నింటితో ఒంటరితనం పోయి, మార్పు వస్తుంది.