* ప్రముఖ ద్విచక్ర తయారీ సంస్థ ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) బీఎస్-6 ప్రమాణాలు కలిగిన రెండు కొత్త బైకులను విడుదల చేసింది. తన విజయవంతమైన ఎఫ్‌జడ్ సిరీస్‌లో కొనసాగింపుగా ఎఫ్‌జడ్-ఎఫ్‌ఐ, ఎఫ్‌జడ్‌ఎస్- ఎఫ్‌ఐ పేరిట వీటిని తీసుకొచ్చింది. వీటి ధరలను రూ.99,200, రూ.1.02 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా పేర్కొంది. త్వరలో బీఎస్-6 ప్రమాణాలు కలిగిన మరిన్ని బైకులను తీసుకురానున్నట్లు యమహా ఓ ప్రకటనలో తెలిపింది. ఎఫ్‌జడ్-ఎఫ్‌ఐ, ఎఫ్‌జడ్‌ఎస్-ఎఫ్‌ఐ వాహనాలు రెండూ 150 సీసీతో వస్తున్నాయి. ఇందులో ఎఫ్‌జడ్‌ఎస్-ఎఫ్‌ఐ బైక్ అదనంగా డార్క్‌నైట్, మెటాలిక్ రెడ్ రంగుల్లో వస్తోంది. రెండిట్లోనూ ముందువైపు సింగిల్ ఛానెల్ ఏబీఎస్ ఉంటుంది. ముందూ వెనుక డిస్క్‌బ్రేక్ అమర్చారు. ఈ నెల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యమహా షోరూముల్లో వీటి విక్రయాలు చేపట్టనున్నట్లు యమహా మోటార్ ఇండియా ఛైర్మన్ మోటోఫుమి షితారా తెలిపారు.
* ‘మూడీస్ ఇన్వెస్టర్స్ సర్సీస్’ భారత్ రేటింగ్ అవుట్‌లుక్‌ను తగ్గించింది. ఇప్పటి వరకు ‘స్టేబుల్’గా ఉన్న ఆర్థిక వ్యవస్థని ప్రస్తుతం ‘నెగటివ్’కి చేర్చింది. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి మరింత క్షీణించే ప్రమాదం ఉందని తెలిపింది. ఆర్థిక, సంస్థాగత బలహీనతల్ని పరిష్కరించడంలో మూడీస్ అంచనా వేసిన దానికంటే ప్రభుత్వం నెమ్మదిగా స్పందిస్తోందని సంస్థ అభిప్రాయపడింది. ఇదిలాగే కొనసాగితే ఇప్పటికే తీవ్ర స్థాయికి చేరుకున్న అప్పుల భారం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం తీసుకునే చర్యలు వృద్ధి రేటు మందగమన సమస్యను పరిష్కరించేలా ఉండాలని స్పష్టం చేసింది. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఒడుదొడుకులను, మందగించిన ఉద్యోగ కల్పన, బ్యాంకింగేతర రంగాల్లో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించేలా ప్రభుత్వ చర్యలు ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది. వాణిజ్య పెట్టుబడులు పెంచే, వృద్ధిని మరింత వేగంగా పరుగులు పెట్టించే సంస్కరణల అవకాశాలు తగ్గిపోయాయని మూడీస్ అభిప్రాయపడింది.
* నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) ద్వారా జరిపే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఇకపై ఉండబోవు. ఈ మేరకు ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. 2020 జనవరి నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని సూచించింది. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.