నాకు నలభైమూడు సంవత్సరాలు. పెళ్లయిన పదమూడేళ్లకు ఓ బాబు పుట్టాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత మళ్లీ గర్భం దాల్చాలనుకుంటున్నా. ఈ వయసులో పిల్లల్ని కంటే సమస్యలు వస్తాయని కుటుంబసభ్యులు అంటున్నారు. నిజమేనా…ఏ సమస్యలూ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ వయసులో గర్భం దాల్చొచ్చు కానీ.. ముందుగానే డాక్టర్‌ని సంప్రదించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొదట హార్మోన్ల అసమతూకం ఉందేమో తెలుసుకోవాలి. వైద్యులు అండాల నాణ్యతనూ అంచనా వేస్తారు. ఏ మేరకు అండాలు విడుదల అవుతున్నాయనేదీ గమనిస్తారు. ఈ వయసులో బిడ్డలో అవకరాలు వచ్చే అవకాశాలు ఎక్కువ గనుక… గర్భం దాల్చడానికన్నా ముందే మీరు ఫోలిక్‌యాసిడ్ మాత్రల్ని తీసుకోవాల్సి ఉంటుంది. అబార్షన్లు అయ్యే అవకాశాలూ ఎక్కువని మరవకూడదు. ఆహారపరంగా మార్పులు చేసుకుంటూ, అవసరం అనుకుంటే హార్మోన్లను తీసుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. గర్భం దాల్చాక జన్యుపరమైన సమస్యలు లేకుండా ఉండేందుకు టిఫా, ఫీటల్ ఎకో వంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. నలభై దాటింది కాబట్టి అధికరక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు రావొచ్చు గనుక అప్రమత్తంగా ఉండాలి. పుట్టబోయే బిడ్డకు మాయ నుంచి రక్తసరఫరా అందడం సమస్య కావొచ్ఛు అందుకే మీరు హైరిస్క్ ప్రెగ్నెన్సీ యూనిట్‌లో చికిత్స చేయించుకోవడం మంచిది. మీలాంటివారికి సహజ కాన్పు కన్నా సిజేరియన్ అయ్యే అవకాశాలే ఎక్కువని తెలుసుకోండి. అనుక్షణం వైద్యులు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే… పండంటి బిడ్డను ఎత్తుకోవచ్ఛు