అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం ఇంకా ముగియలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. చైనా ఉత్పత్తులపై సుంకాలు ఎత్తివేసే దిశగా తమ దేశంతో ఎలాంటి ఒప్పందం కుదరలేదని శుక్రవారం రాత్రి ట్రంప్ కుండబద్దలు కొట్టారు. వైట్‌హౌస్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ సుంకాల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చైనా కోరినట్లు తెలిసింది. దీనికి సంబంధించి వారు నాతో ఎలాంటి చర్చలు జరపలేదు, ఎందుకంటే నేను దానికి ఒపుకోనని వారికి తెలుసు. అందుకే సుంకాల ఎత్తివేతను తాను ఖండిస్తున్నా’ అంటూ మీడియాకు తెలిపారు. అయినా ఇది ఎప్పటికి జరగని పని అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం చైనా ఆర్ధికంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటుందని.. అందుకే ఇటువంటి ఒప్పందాల కొరకు పాకులాడుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత వారం ఇరు దేశాల మధ్య సుంకాలను దశలవారిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి గావో ఫెంగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్దానికి తెరపడినట్లేనని అంతా భావించారు. కానీ, తాజాగా ట్రంప్ చేసిన ప్రకటనతో మళ్లీ ఆందోళన మొదలైంది. గతవారం చైనా చేసిన ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా పుంజుకున్న విషయం తెలిసిందే. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మార్కెట్లు ఎలా స్పందిస్తాయో చూడాలని పలువురు ఆర్థిక నిపుణులు అనుకుంటున్నారు.
చైనాతో ఇంకా యుద్ధం ముగియలేదు
Related tags :