పంట నష్టాలు, ఏటేటా పెట్టుబడులు పెరగడం..గిట్టుబాటు ధరలు లేకపోవడం, అప్పులు, ఇలా కారణాలు ఏమైనా అన్నదాత బలవన్మరణాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ దేశంలో నాలుగో స్థానంలో ఉండగా, తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.
2016లో ప్రమాద మరణాలు-ఆత్మహత్యలకు సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
2016 గణాంకాల ప్రకారం..
* దేశవ్యాప్తంగా బలవన్మరణాలకు పాల్పడ్డ రైతులు, వ్యవసాయ కూలీలు: 11,379
* ఏపీకి చెందిన వారు: 7.06 శాతం
* తెలంగాణకు చెందిన వారు: 5.66 శాతం
* ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో సొంత భూమి కలిగిన రైతులు, కౌలు రైతులు ఎక్కువ మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.
* ఏపీలో ఆత్మహత్యకు పాల్పడిన వారిలో 730 మంది పురుషులు, 74 మంది మహిళలు ఉండగా.. తెలంగాణలో ఆ సంఖ్య 572, 73 మందిగా ఉంది.
రాష్ట్రానికి తొమ్మిదో స్థానం
దేశవ్యాప్తంగా అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.
2016 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1,31,008 మంది ఆత్మహత్య చేసుకోగా వారిలో 4.6 శాతం మంది ఏపీకి, 6.9 శాతం మంది తెలంగాణకు చెందినవారు ఉన్నారు.
మృతుల్లో కూలీలు, గృహిణులే ఎక్కువగా ఉన్నారు.