DailyDose

మన మోడీ కారణజన్ముడు..లక్ష్మణ్-తాజావార్తలు-11/10

Telangana BJP President Laxman On Modi & Ayodhya-Telugu Breaking News Today-11/10

* మహారాష్ట్ర రాజకీయం మరో మలుపు తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని భాజపా స్పష్టంచేసింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీకి వివరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ భాజపాను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. శివసేన తమతో కలిసి రావడం లేదని, సంఖ్యా బలంలేని కారణంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ భేటీ అనంతరం ప్రకటించారు.

* మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా సుముఖత వ్యక్తంచేయని వేళ.. రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన శివసేనను గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్‌యారీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ షిండేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అక్టోబర్‌ 24న ఫలితాలు వెలువడగా.. 15 రోజులు గడిచినా ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో అతిపెద్ద పార్టీగా నిలిచిన భాజపాను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

* అయోధ్య తీర్పు తర్వాత దేశ ప్రజలు చూపిన సహనం, సంయమనం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ హర్షం వ్యక్తం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అన్ని వర్గాల ప్రజలు గౌరవిస్తున్నారని తెలిపారు. అత్యంత కఠినమైన, జటిలమైన సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ప్రధాని మోదీ కారణజన్ముడని లక్ష్మణ్‌ కొనియాడారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కరీంనగర్‌ జిల్లాకు చెందిన పలువురు భాజపాలో చేరారు.

* తెలుగు రాష్ట్రాల్లో హిందూ సనాతన ధర్మం కోసం శారదాపీఠం ప్రచారం చేస్తోందని విశాఖ శారదాపీఠం అధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. హిందూ ధర్మం కోసం శారదాపీఠం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి శ్రీస్వత్మానందేంద్ర సరస్వతి స్వామి రెండో విడత తెలంగాణలో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని గాయత్రీ హిల్స్‌లో జలవిహార్‌ ఎండీ రామరాజు ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతికి, స్వాత్మానందేంద్ర సరస్వతిలకు భక్తులు పుష్పాభిషేకం నిర్వహించారు.

* మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా నిరాకరించిన నేపథ్యంలో ఆ పార్టీ మిత్రపక్షం శివసేన స్పందించింది. సీఎం పీఠంపై కూర్చొనేది శివసేనకు చెందిన వ్యక్తేనని పునరుద్ఘాటించింది. భాజపా నిర్ణయం అనంతరం శివసేన నేత సంజయ్‌ రౌత్‌ మీడియాతో మాట్లాడుతూ ‘‘శివసేన నాయకుడే సీఎం అవుతారని ఉద్ధవ్‌జీ మా ఎమ్మెల్యేలకు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోబెట్టి తీరుతాం’’ అని స్పష్టంచేశారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన రావాలని కాంగ్రెస్‌ పార్టీ కోరుకోవడం లేదని ఆ పార్టీ నేత అశోక్‌ చవాన్‌ అన్నారు.

* పాకిస్థాన్‌ భూభాగంలో కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం సందర్భంగా తీసిన ఓ వీడియో క్లిప్‌ వైరల్‌ అవుతోంది. కార్యక్రమానికి భద్రతా సిబ్బందితో వచ్చిన ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ‘అచ్ఛా.. హమారా సిద్దూ కిదర్‌ హై’ (మా సిద్దూ ఎక్కడ ఉన్నాడు) అంటూ వెదుకుతున్న వీడియో క్లిప్‌ ఒకటి బయటికొచ్చింది. ఈ వీడియోను ట్విటర్‌లో ఇప్పుడు వేలాది మంది లైక్‌ చేస్తున్నారు. పంజాబ్‌ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూకు, ఇమ్రాన్‌కు మధ్య స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. పాక్‌ ఆహ్వానం మేరకు సిద్దూ కారిడార్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లారు.

* ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు భాజపా 52 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ విడత అభ్యర్థుల జాబితాలో 17 మంది ఎస్టీలకు, 21 మంది ఓబీసీ, ఐదుగురు మహిళలకు చోటు కల్పిస్తున్నట్లు భాజపా ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ ప్రకటించారు. ఈ నెలాఖరు నుంచి ఝార్ఖండ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో 30 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కగా, మరో 10 మందికి నిరాశే ఎదురైంది. మొత్తం 81 స్థానాలున్న ఝార్ఖండ్‌లో మిగతా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

* అయోధ్య తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిన ఐదు ఎకరాల స్థలాన్ని తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డు తెలిపింది. నవంబర్‌ 26న ఈ మేరకు సమావేశం నిర్వహించి తమ నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొంది. వివాదాస్పద స్థలాన్ని రామాలయ నిర్మాణానికి కేటాయించి.. సున్నీ వక్ఫ్‌బోర్డుకు 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని మసీదు నిర్మాణానికి ఇవ్వాలని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే.

* ఒడిశా, పశ్చిమ బంగాల్‌లో బుల్‌బుల్‌ తుపాను ధాటికి ఇప్పటివరకూ 9 మంది మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు. తుపాను వల్ల ప్రభావిత ప్రాంతాల్లో 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. బంగాల్‌, ఒడిశాలోని దక్షిణ జిల్లాల్లో సుమారు 4 లక్షల మంది ప్రజలు తుపాను ధాటికి గురయ్యారు.పశ్చిమ బంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ రోజు మొత్తం కంట్రోల్‌ రూంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఆదివారం ఉదయం ఆమెకు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

* గోల్నాకలోని పెరల్‌ గార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌లో ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

* కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను డిసెంబరు 5న నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సంజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. ఫలితాలను అదే నెల 9న విడుదల చేయనున్నారు. ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో నియమావళి నవంబరు 11 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. నామినేషన్ల దాఖలు గడువు సోమవారం ప్రారంభమై నవంబరు 18తో ముగియనుంది.

* ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైన నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. తెలుగు మాధ్యమం ఆపేస్తుంటే అధికార భాషాసంఘం ఏం చేస్తోందని ట్విటర్‌లో ఆయన ప్రశ్నించారు. మాతృభాషను ఎలా పరిరక్షించుకోవాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి వైకాపా నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు.

* మహమ్మద్‌ ప్రవక్త జయంతి మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మతసామరస్యానికి ప్రతీకగా ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసి ఉండటం ఎంతో గర్వకారణమని హైదరాబాద్‌లోని బోరబండలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా వేదపండితులు, పాస్టర్లు, ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో అక్కడ భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు.

* మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా భాజపాను ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారి ఆహ్వానించిన నేపథ్యంలో అక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. తమ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయాల్సిందేనని శివసేన పట్టుబడుతున్న నేపథ్యంలో తాజాగా మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేను సీఎంను చేయాలంటూ ఆదివారం ఉదయం ఆయన ఇంటి సమీపంలో ఓ హోర్డింగ్‌ వెలిసింది.

* టీమిండియా, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఆదివారం జరిగే నిర్ణయాత్మక మూడో టీ20పై ఇరు జట్లు కన్నేశాయి. ఎలాగైనా ఈ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలగా కనిపిస్తున్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌.. యువ ఆటగాళ్లపై నమ్మకం ఉందన్నాడు. అలాగే తమ బౌలర్లకు అనుభవం తక్కువున్నా.. మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్నాడు.

* టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు వెంకటేష్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి ‘వెంకీమామ’ చేస్తున్నారు. దీని తర్వాత తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తమిళ హిట్‌ ‘అసురన్‌’ రీమేక్‌ను కూడా ఆయనే చేయనున్నట్లు సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధికారికంగా ప్రకటించింది. అయితే, దర్శకుడు, ఇతర సాంకేతిక బృందం వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో తెలుగులో ‘అసురన్‌’ రీమేక్‌ చేసేందుకు పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తుండగా.. ఆ జాబితాలోకి హను రాఘవపూడి వచ్చి చేరారు.

* దేశ అత్యున్నత న్యాయస్థానం శనివారం అయోధ్యపై చారిత్రక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థ దాడులకు ప్రణాళికలు వేసుకున్నట్లు భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలు కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి. భారీ దాడులకు పాల్పడే అవకాశమున్నట్లు తెలిపాయి. ఈ మేరకు ఏ సమయంలోనైనా దాడులు జరగవచ్చని ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ), రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) సంస్థలకు చెందిన అధికారులు తెలిపారు.

* టీమిండియా మహిళా జట్టు యువ సంచలనం షఫాలివర్మ పొట్టి ఫార్మాట్‌లో అరుదైన ఘనత సాధించింది. విండీస్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20లో తొలి అర్ధ శతకం బాదింది. దీంతో భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అర్ధశతకం బాదిన అతిపిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. అలాగే ప్రపంచ క్రికెట్‌లో ఈ రికార్డు సాధించిన రెండో బ్యాట్స్‌వుమన్‌గా నిలిచింది.

* జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడి తన వాహన శ్రేణిలో ఎస్‌యూవీ క్యూ8 వాహనాన్ని వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది. 2025నాటికి దేశంలో తన వాహన విక్రయాలను మరింత బలోపేతం చేసుకునే నేపథ్యంలో భాగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆర్డర్స్‌ను ఆడి ప్రారంభించింది.