ఇసుక అక్రమ నియంత్రణ చర్యలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష విధించేలా నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఏపీ కేబినెట్ పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలన్నింటిలోను ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అదే విధంగా మొక్కజొన్న ధరలు పడిపోతుండటంపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా వారం రోజుల క్రితం మొక్కజొన్న క్వింటాలు ధర రూ.2200 ఉండేదని.. ఇప్పుడు రూ.1500కు పడిపోయిందని వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర రూ.1750 కూడా రావడం లేదని మంత్రివర్గం వద్ద ప్రస్తావించారు. ఈ క్రమంలో రైతులు నష్టపోకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులకు నష్టం రాకుండా కొనుగోళ్లు జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సీఎం జగన్ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో బుధవారం మధ్యాహ్నమే విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి అధికారుల సన్నాహాలు మొదలుపెట్టారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
Related tags :