టెస్టు క్రికెట్లో నాణ్యమైన పేసర్ల కొరత ఏర్పడిందని దిగ్గజ క్రికెట్ సచిన్ తెందుల్కర్ అన్నారు. మైదానంలో ఆటగాళ్ల మధ్య వైరం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 1970, 80ల్లో మాదిరిగా సునిల్ గావస్కర్ × ఆండీ రాబర్ట్స్, డెన్నిస్ లిల్లీ, ఇమ్రాన్; సచిన్ × మెక్‌గ్రాత్, వసీమ్ అక్రమ్‌ల మధ్య పోటాపోటీతత్వం కనిపించడం లేదన్నారు.
‘అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైరాలు ఇప్పుడు లేవు. ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం నాణ్యమైన పేసర్లు లేకపోవడమే ఇందుకు కారణం. క్రికెట్ ప్రమాణాలు పడిపోవడం టెస్టు క్రికెట్‌కు మంచిది కాదు. ప్రమాణాలు నిర్దిష్టంగా, అత్యున్నతంగా ఉండాలి. అద్భుతమైన పిచ్‌లు లేకపోవడమే ఇందుకు కారణమని నేను చెప్పగలను. పేసర్లు, స్పిన్నర్లకు సహకరించే వికెట్లు రూపొందించినప్పుడు బ్యాటు, బంతి మధ్య సమతూకం తిరిగొస్తుంది. ఈ సారి యాషెస్ పిచ్‌లు చాలా బాగున్నాయి. పోటాపోటీగా మ్యాచ్‌లు జరిగాయి’ అని సచిన్ అన్నారు.
‘ఐపీఎల్‌లో బాగా ఆడితే టీమిండియా తరఫున టీ20లు ఆడేందుకు కచ్చితంగా అర్హులే. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా వన్డే, టెస్టులకు మాత్రం ఎంపిక చేయొద్దు. జస్ప్రీత్ బుమ్రాలా టీ20ల్లో రాణించి, వన్డేల్లో అదరగొడితే టెస్టుల్లో ఎంపిక చేయడంలో తప్పులేదు. 1998 ఆస్ట్రేలియా సిరీస్ సచిన్×వార్న్ పోటీగా ముద్రపడింది. సహజంగా నేను పోలికలు ఇష్టపడను. 1991లో పెర్త్‌లో చేసిన టెస్టు శతకం మాత్రం నా ఫేవరెట్. అంతర్జాతీయ క్రికెట్లో అది నా ఆగమనాన్ని చాటింది’ అని సచిన్ పేర్కొన్నారు.
‘టీమిండియా డ్రస్సింగ్‌రూమ్‌ను చాలా మిస్సవుతున్నాను. ఐదు తరాల క్రికెటర్లతో ఆడిన ఒకే ఒక్క ఆటగాడిని నేనే కావొచ్చు. ముందు కపిల్‌దేవ్, రవిశాస్త్రి, క్రిష్ శ్రీకాంత్, వెంగ్‌సర్కార్, అజారుద్దీన్‌తో ఆడాను. తర్వాత గంగూలీ, ద్రవిడ్‌తో కలిసి ఆడాను. ఆ తర్వాత యువరాజ్, హర్భజన్, జహీర్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, ఆశీష్ నెహ్రా తరంతో డ్రస్సింగ్ రూం పంచుకున్నా. ఆ తర్వాత సురేశ్ రైనా తరం, వెంటనే కోహ్లీ, రోహిత్, రహానె తరాన్ని ప్రత్యక్షంగా చూశాను. ఆ నవ్వులు, ఆ తీవ్రత, ఆ వేడుకలు నేను మిస్సవుతున్నా. డ్రస్సింగ్ రూమ్ అంటే ఒక దేవాలయం’ అని తెందుల్కర్ ఆనాటి సంగతులు గుర్తుచేసుకున్నారు.