‘ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలు’ నినాదానికి కొనసాగింపుగా మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఒకే దేశం- ఒకే రేషన్ కార్డును వినియోగంలోకి తీసుకొచ్చిన కేంద్ర సర్కార్.. త్వరలో దేశవ్యాప్తంగా వేతనాల విషయంలోనూ అలాంటి చట్టమొకటి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. శ్రామికవర్గం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ‘వన్ నేషన్.. వన్ పే డే’ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ వెల్లడించారు.
‘‘దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి ప్రతి నెలా సకాలంలో ఒకే రోజు వేతనాలు అందించేందుకు సిద్ధమవుతున్నాం. ఇందుకోసం ఉద్దేశించిన చట్టాన్ని ప్రధాని మోదీ త్వరలోనే తీసుకురాబోతున్నారు. అలాగే కార్మికులకు మెరుగైన జీవితం గడిపేందుకు అన్ని రంగాల్లో ఒకే విధంగా కనీస వేతనాలు ఉండేలా చర్యలు తీసుకోబోతున్నాం’’ అని గాంగ్వర్ తెలిపారు. సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన ఈ విషయం వెల్లడించారు.
మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక కార్మిక సంస్కరణలను చేపట్టిందని గాంగ్వర్ తెలిపారు. 44 కార్మిక చట్టాలను సంస్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. త్వరలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ రూ.3వేల పెన్షన్‌తో పాటు వైద్య బీమా అందించేందుకు మోదీ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. భవిష్యత్‌లో అసంఘటిత రంగ కార్మికులు, కూలీలకు సామాజిక భద్రత కల్పించేందుకు మరిన్ని పథకాలు తీసుకురాన్నుట్లు చెప్పారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న వాటిల్లో ప్రైవేటు సెక్యూరిటీ ఇండస్ట్రీ అతిపెద్దదని, ప్రస్తుతం 90 లక్షల మంది ఇందులో పనిచేస్తున్నారని చెప్పారు. భవిష్యత్‌లో ఈ సంఖ్య 2 కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు.
సుమారు 44 కార్మిక చట్టాలను నాలుగు వర్గాలుగా విభజించి చట్టాలు చేయాలని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా 13 కార్మిక చట్టాలను ఒకే కోడ్ కిందకు తీసుకొస్తూ వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పనిచేసే పరిస్థితులకు సంబంధించి (ఓఎస్‌హెచ్) కోడ్ బిల్లును సిద్ధం చేసింది. కార్మికుల భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులకు సంబంధించిన మొత్తం 13 చట్టాలు ఇందులో ఉన్నాయి. ఓఎస్‌హెచ్ కోడ్ బిల్లును ఈ ఏడాది జులై 23న ప్రవేశపెట్టినప్పటికీ అభ్యంతరాల నేపథ్యంలో ఆమోదం పొందలేదు. ఈ ఓఎస్‌హెచ్ కోడ్‌లో ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ లెటర్ తప్పనిసరి చేయడం, ఏటా ఉచిత మెడికల్ చెకప్‌వంటివి ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే వేతనాల కోడ్ బిల్లు ఆమోదం పొందింది. దీనికి సంబంధించిన విధివిధానాలు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.