చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ హువావేపై అమెరికా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తర్వాత ఆ ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. ఈ నేపథ్యంలో గూగుల్ యాప్స్ లేకుండానే హువావే తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ మేట్ ఎక్స్‌ను విక్రయానికి తీసుకొచ్చింది. హువావే నుంచి వస్తున్న తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం గమనార్హం. మేట్ ఎక్స్ 5.8 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లేతో రానుంది. దీని ధరను 16,999 యువాన్లు(2,422డాలర్లు)గా నిర్ణయించారు. శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్‌కు పోటీగా దీన్ని తీసుకొచ్చారు. భద్రత కారణాల దృష్ట్యా హువావేపై అమెరికాలో నిషేధం ఉండటంతో గూగుల్ యాప్స్ లేకుండా హువావే ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. దీనిలో క్వాల్కమ్‌కు బదులుగా కిరిన్ 980, బ్యాలాంగ్ 5000 చిప్‌సెట్‌లను వాడారు. ఆండ్రాయిడ్‌తో పాటు, ఈఎంయూఐ9తో పనిచేసే ఈ ఫోన్‌లో కేవలం చైనాకు చెందిన యాప్స్ మాత్రమే ఉంటాయి. గూగుల్ మ్యూజిక్ సహా ఇతర ఏ యాప్స్ ఇందులో ఉండవు. మరి వినియోగదారుల నుంచి దీనికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. అమెరికాలో హువావే ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని అధికారులు వెల్లడించినా, ఇంకా అనుమతులు లభించకపోవడంతో ఎదురు చూపులు తప్పడం లేదు. ప్రస్తుతం చైనాలో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను త్వరలోనే ఇతర దేశాల్లోనూ విక్రయించాలని హువావే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
హువావే MateX సాహసం
Related tags :