* అనుకున్నదే జరిగింది. కోహ్లీసేన కేవలం మూడు రోజుల్లోనే జయభేరీ మోగించింది. తొలిటెస్టులో బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడోరోజు, శనివారం ఆట ఆరంభానికి ముందు ఓవర్‌నైట్ స్కోరు 493/6 వద్దే టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారీ లోటుతో బ్యాటింగ్‌కు దిగిన ప్రత్యర్థిని 69.2 ఓవర్లకు 213 పరుగులకు ఆలౌట్ చేసింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో మరో 60 పాయింట్లు చేరాయి.
* ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. ప్రజా సర్వీసుల్లోని వారు సమ్మె చేస్తామని నోటీసు ఇవ్వడమే చట్ట విరుద్ధమని పేర్కొంది. సమ్మె నేపథ్యంలో హైకోర్టులో ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం సమ్మె చట్ట విరుద్ధమని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సమ్మె చట్ట విరుద్ధమని ఎవరూ ప్రకటించాల్సిన అవసరం లేదని, చట్టం ప్రకారం సమ్మె ప్రారంభించడమే చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.
* తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ, తెరాస ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.ఈ మేరకు నియామక ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యుల నియామకం జరుగుతుందని ఆయన చెప్పారు. జూన్‌లోపు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రైతు సమన్వయ సమితులను బలోపేతం చేస్తామని సీఎం అన్నారు.
* ఆరు నెలల్లో ‘మంచి’ ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న వారు, ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని ముంచుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారనడానికి పత్రికా కథనాలే నిదర్శనమంటూ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా జాతీయ మీడియా ప్రచురించిన కథనాలను చంద్రబాబు తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
* కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని అధిష్ఠానం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. నవంబర్ 30న ‘భారత్ బచావో’ పేరిట దిల్లీలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ వార్‌రూమ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
* తెలంగాణ ఆర్టీసీ కార్మికులపై దమనకాండను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ప్రశాంతంగా నిరవధిక దీక్ష చేస్తామని ప్రకటిస్తే ఆర్టీసీ జేఏసీ నాయకులను గృహ నిర్బంధం చేసి.. వారి ఇళ్లపై పోలీసులు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కార్మిక సంఘాలు బాధ్యతాయుతంగా చర్చించి విలీన డిమాండ్‌ను వాయిదా వేసుకుంటున్నామని ప్రకటించినప్పటికీ..ప్రభుత్వం చర్చలకు పిలవాల్సిందిపోయి రెచ్చగొట్టే పద్ధతిని అవలంబిస్తోందని మండిపడ్డారు.
* ఏపీలో సంచలనం సృష్టించిన చిన్నారి వర్షిత (6) హత్య కేసును చిత్తూరు జిల్లా పోలీసులు ఛేదించారు. నిందితుడు అంగళ్లు మొలకవారిపల్లెకు చెందిన లారీ క్లీనర్ రఫీ (25)గా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ నెల 7న కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ చేనేతనగర్‌లోని కల్యాణ మండపం వద్ద వర్షిత హత్యకు గురైన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.
* తెదేపా అధినేత చంద్రబాబు చేసిన ‘ఇసుక దీక్ష’కు ప్రభుత్వం భయపడిపోయిందని ఆ పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమమహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో 151 అసెంబ్లీ సీట్లు గెలిచినా ఏపీ సీఎం జగన్ అభద్రతా భావంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమపై విమర్శలు చేయడానికి 151 మంది ఎమ్మెల్యేలకు ధైర్యం సరిపోవట్లేదని వ్యాఖ్యానించారు. తెదేపాకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని వైకాపా నేతలు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.
* ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేరిన వారు ఎక్కడ తిరిగి సొంతగూటికి చేరతారోనని భాజపా భయపడుతోందని ఎన్‌సీపీ అధికార ప్రతినిధి నవాజ్ మాలిక్ అన్నారు. అందుకే ‘భాజపాయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంద’న్న ప్రకటనలు చేస్తూ వారినిపట్టి ఉంచే ప్రయత్నం చేస్తోందన్నారు. 119 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భాజపా మహారాష్ట్రశాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
* రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ శనివారం రాజీనామా చేశారు. ఆర్‌కాం భారీ నష్టాలతో ఉన్న విషయం తెలిసిందే. బకాయిలు చెల్లించలేకే ఆర్‌కాం తన మొబైల్ కార్యకలాపాలను మూసివేసింది. ఐబీసీ నేతృత్వంలోని దివాలా ప్రక్రియ ద్వారా ఆర్‌కాం ఆస్తులను కొనుగోలు చేయాలని చూస్తున్నవారిలో రిలయన్స్ జియో కూడా ఒకటిగా ఉంది.
* కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. పంబ నుంచి దీక్ష స్వీకరించిన స్వాములు దర్శనానికి బయల్దేరారు. ప్రధాన పూజారి కండారు మహేశ్ మోహనారు, ముఖ్య పూజారి ఏకే సుధీర్ నంబూద్రి ఆలయంలో శుద్ధి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గర్భగుడిని తెరిచారు. నేటి నుంచి డిసెంబర్ 27 వరకు స్వామివారికి నిత్య పూజలు జరుగుతాయి. అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా కేరళ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది.
* కోర్టులు చీవాట్లు పెట్టినా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం వైఖరిలో ఏమాత్రం మార్పు లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమ్మెపై హైకోర్టులో ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ అదనపు అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు ఆర్టీసీ గురించి సునీల్ శర్మకు ఏం తెలుసని ప్రశ్నించారు. ఆయన ఎండీగా బాధ్యతలు చేపట్టి కేవలం 17 నెలలు మాత్రమే అయ్యిందన్నారు. కనీసం ఏడు సార్లు కూడా కార్యాలయానికి రాలేదన్నారు.
* రాజీనామా చేయకుండా ఎవరు పార్టీ మారినా చర్యలు తప్పవని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ స్పష్టం చేశారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పీకర్ ఈమేరకు సమాధానమిచ్చారు. సభానాయకుడిగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఇదే విషయం చెప్పారని, దానికే కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. డిసెంబరు 2 నుంచి సుమారు 15 రోజుల పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగే అవకాశముందని చెప్పారు.
* ట్రాఫిక్ చలాన్ల తరహాలో జీహెచ్ఎంసీ చలాన్లను త్వరలో పూర్తిస్థాయిలో అమలు చేస్తామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. రోడ్లపై చెత్త వేసినా, ఫ్లెక్సీలు పెట్టినా, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేసినా, వాల్ పోస్టర్లు అంటించినా వాటిని ఫోటోలు తీసి జరిమానాలు విధిస్తామన్నారు. ఈ తరహాలో ఒక్క నెలలోనే ఇప్పటి వరకు 1085 నోటీసులు పంపి రూ.1.50 కోట్ల మేర జరిమానాలు విధించినట్లు తెలిపారు. చలాన్ వేసిన 24 గంటల్లోగా చెత్తను తీసివేయకుంటే జరిమానా మరింత పెరుగుతుందన్నారు.
* తెదేపా నేతలు తనపై చేస్తున్న ఆరోపణలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తిప్పికొట్టారు. ‘‘చంద్రబాబు నాకు కోట్ల రూపాయలు ఇచ్చారని రాజేంద్రప్రసాద్ చెబుతున్నారు. నా వ్యక్తిగత అవసరాల కోసం డబ్బులు ఇచ్చారా? ఏ పార్టీ అయినా ఎన్నికల కోసం ఇవ్వడం సహజం. ఓ ఛానల్‌లో డిబేట్‌లో పాల్గొన్నప్పుడు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తొలుత నన్ను తిట్టారు. వంశీ డబ్బులు తీసుకున్నారనే సరికి కోపం వచ్చి అలా మాట్లాడాను. నేను అయ్యప్పమాల ధరించి ఉన్నా కాబట్టి రాజేంద్రప్రసాద్‌కు క్షమాపణ చెబుతున్నా’’ అని మీడియాతో వంశీ అన్నారు.
* వైకాపా అక్రమ కేసులన్నీ ధైర్యంగా ఎదుర్కోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి సూచించారు. జైలు నుంచి విడుదలైన చింతమనేనితో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపులో భాగంగానే అనేక కేసులు పెట్టారని, ఈ 5 నెలల్లోనే పనిగట్టుకుని ప్రభాకర్పై 11 కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. తెదేపా అన్ని విధాలా అండగా ఉంటుందని చింతమనేనికి చంద్రబాబు ధైర్యం చెప్పారు.
* ముఖ్యమంత్రి జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై మతపరమైన ఆరోపణలు చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఏపీ దేవాదాయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమని వెల్లంపల్లి ప్రకటించారు. సీఎం జగన్‌పై మతపరమైన ఆరోపణలు చేసి .. చంద్రబాబు భాజపాకు మళ్లీ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
* రాష్ట్ర ప్రభుత్వం ఇసుక వారోత్సవాల నిర్వహణ కాకుండా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సాయం, చనిపోయిన కుటుంబాలకు పరిహారం అందించే వారోత్సవాలు నిర్వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. పలువురు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
* కార్మికుల భవిష్యనిధి బకాయిలు చెల్లించేందుకు గడువు కావాలని ఆర్టీసీ యాజమాన్యం కోరింది. రూ.760 కోట్లకు పైగా పీఎఫ్ బకాయిలు జమచేయకపోవడంపై భవిష్యనిధి సంస్థ ప్రాంతీయ మేనేజర్ … తెలంగాణ ఆర్టీసీ ఎండీకి నోటీసులు పంపారు. పూర్తి సమాచారంతో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆర్టీసీ ఎండీ తరఫున సంస్థ ఆర్థిక సలహాదారు రమేష్ నిన్న పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ ముందు హాజరయ్యారు. ప్రస్తుతం ఆర్టీసీలో సమ్మె కొనసాగుతుందని, ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు.
* చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ హువావేపై అమెరికా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తర్వాత ఆ ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. ఈ నేపథ్యంలో గూగుల్ యాప్స్ లేకుండానే హువావే తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ మేట్ ఎక్స్‌ను విక్రయానికి తీసుకొచ్చింది. హువావే నుంచి వస్తున్న తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం గమనార్హం.