Politics

కృష్ణాజిల్లాపై వైకాపా కన్ను-వేడెక్కిన రాజకీయం

YSRCP Focusing On Krishna District-Krishna Politics In Full Swing

కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ వ్యవహారంపై అధిష్ఠానం సీరియస్‌ అయింది. ఆయనపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసింది. పార్టీకి రాజీనామా చేసిన ఆయన శాసనసభ సభ్యత్వానికి మాత్రం రాజీనామాను స్పీకర్‌ ఫార్మాట్‌లో సమర్పించకపోవడంతో అనర్హత వేటు వేసేందుకు తెదేపా అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు వంశీ శాసనసభకు రాజీనామా చేయకుండానే కొనసాగాలని వైకాపా ప్రభుత్వానికి సంఘీభావం కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన తెదేపాపై, నేతలపై చేసిన వ్యాఖ్యలపై పార్టీలో కలకలం రేగింది. ఆయన తీవ్ర పదజాలంతో మాట్లాడడాన్ని నేతలు తప్పు పడుతున్నారు. అయ్యప్పస్వామి దీక్షలో ఉన్న ఆయన ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తెదేపా నేతలు తప్పు పడుతున్నారు. మరోవైపు తనపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే వంశీ నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమల రావును కలిసి ఫిర్యాదు చేశారు. దీనికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ సూత్రధారిగా ఆయన ఆరోపిస్తున్నారు. కొన్ని కథనాలు తనపై రాయించారని వంశీ ఆరోపించారు. వంశీతో పాటు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ రాజీనామా చేసి వైకాపాలో చేరడం జిల్లాలో పార్టీకి తీరని నష్టంగా భావిస్తున్నారు. అవినాష్‌ కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వ్యక్తిగా భావిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు యవత అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని నియమించాల్సి ఉంది.
***కృష్ణా జిల్లాపై వైకాపా దృష్టి..!
కృష్ణా జిల్లాపై వైకాపా దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జిల్లాలో గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఫలితాలు సాధించినప్పటికి క్యాడర్‌ పరంగా మరింత బలోపేతం కావాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తెదేపాకు చెందిన ముఖ్య నాయకులను పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నారు. కృష్ణా జిల్లా రాజకీయాలకు ప్రత్యేకత ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ తెదేపాకు అనుకూలంగా ఉంటాయనే వాదన ఉంది. గత ఎన్నికల్లోనూ ఇది రుజువైంది. 2014 ఎన్నికల్లో జిల్లాలో వైకాపా గట్టి పోటీని ఇచ్చింది. మొత్తం 16 నియోజకవర్గాల్లో 5 స్థానాలను వైకాపా గెలుచుకుంది. తిరువూరు, నూజివీడు, విజయవాడ పశ్చిమ, పామర్రు, గుడివాడ స్థానాల నుంచి వైకాపా అభ్యర్థులు గెలుపొందారు. అయితే వీరిలో విజయవాడ పశ్చిమ నుంచి జలీల్‌ఖాన్‌, పామర్రు నుంచి ఉప్పులేటి కల్పన తిరిగి తెదేపా సైకిల్‌ ఎక్కారు. దీంతో వైకాపా మూడు స్థానాలకే పరిమితమైంది. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా ఆ పార్టీ 14 స్థానాల్లో విజయం సాధించి తిరుగులేని పట్టు బిగించింది. కేవలం గన్నవరం నుంచి వల్లబనేని వంశీమోహన్‌, విజయవాడ తూర్పు నుంచి గద్దెరామ్మోహన్‌లతో పాటు విజయవాడ లోక్‌సభ నుంచి కేశినేని నాని విజయం సాధించారు. సెంట్రల్‌ స్థానం 25 ఓట్లతో బొండా ఉమా చేజార్చుకున్నారు. జిల్లాలో వైకాపాకు అనూహ్య విజయం సాధించినా పార్టీని నడిపేందుకు బలమైన వ్యక్తులు కావాలని అన్వేషించారు. ఇంతవరకు పార్లమెంటు స్థానాల వారీగా మచిలీపట్నం జిల్లా అధ్యక్షుడిగా కొలుసు పార్థసారథి, విజయవాడ లోక్‌సభ జిల్లా అధ్యక్షుడిగా సామినేని ఉదయభాను వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం గన్నవరం నుంచి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పార్టీ పదవులు ఇస్తారని అంటున్నారు. జిల్లాలో పార్టీని నడిపేందుకు సామాజిక వర్గాల వారీగా ఈ బాధ్యతలు ఇస్తారనేది ప్రచారం. తెదేపాకు సానుభూతిపరులు ఎక్కువగా ఉన్న ఒక వర్గాన్ని ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నారని పార్టీ వర్గాల కథనం.
**వంశీపై పార్టీ సీరియస్‌..?
మొదట వల్లభనేని వంశీ వ్యవహారంలో పార్టీ ఉదాసీనంగా వ్యవహరించింది. ఆయన వైకాపాలో చేరుతున్నారన్న ప్రచారం ఎన్నికల ముందు నుంచే ఉంది. ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన తర్వాత ఆయనను బుజ్జగించేందుకు ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకొళ్లతో కమిటీ వేసి ప్రయత్నాలు చేశారు. పార్టీ మొత్తం మద్దతు ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. కానీ ఆయన నిర్ణయంలో మార్పు రాలేదు. ప్రస్తుతం తెదేపాపై విమర్శలు చేయడాన్ని నేతలు ఖండిస్తున్నారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌తో జరిగిన వాగ్వాదం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. అయితే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వంశీ ముందుగానే ప్రకటించి వాట్సప్‌ సందేశాన్ని అధినేతకు పంపారు. ఎమ్మెల్యే పదవి రాజీనామా కూడా అదే విధంగా పంపి తర్వాత ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. వీటిని పరిగణనలోకి తీసుకోని తెదేపా అధిష్ఠానం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. సాంకేతికంగా ఆయనను సస్పెండ్‌ చేసిన తర్వాత స్పీకర్‌కు ఫిర్యాదు చేసి శాసనసభ సభ్యత్వంపై వేటు వేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం ఈ వ్యవహారాల్లో తెదేపా రాజకీయాలు వేడెక్కాయి.