Movies

శ్రీదేవి అవార్డు పుచ్చుకున్న బోనీ

ANR Awards 2019-Boney Kapoor Takes Sridevi Award-శ్రీదేవి అవార్డు పుచ్చుకున్న బోనీ

దివంగత నటుడు, ఒకప్పటి టాలీవుడ్ నెంబర్‌వన్ హీరో.. ఏఎన్‌ఆర్(అక్కినేని నాగేశ్వర్ రావు) జాతీయ పురాస్కారాల ప్రదానోత్సవం నగరంలోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అట్టహాసంగా జరుగుతోంది. 2018 ఏడాదికి గానూ దివంగత నటి శ్రీదేవికి, 2019 ఏడాదికి గానూ ప్రముఖ బాలీవుడ్ నటి రేఖకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ పురాస్కారాలను మెగాస్టార్ చిరంజీవి అందజేస్తారు. శ్రీదేవి తరఫున ఆమె భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ అవార్డును స్వీకరిస్తారు. రేఖ స్వయంగా అవార్డును స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా హీరో నాగార్జున మాట్లాడుతూ.. నాన్నగారి పేరు చిరకాలం ఉండేలా పురస్కారాన్ని అందిస్తున్నాం అని తెలిపారు. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఏఎన్‌ఆర్ మన మనసుల్లో ఉంటారని నాగార్జున ఈ సందర్భంగా అన్నారు. కళాబంధు సుబ్బిరామి రెడ్డి, నాన్న(ఏఎన్నార్)ల మధ్య మంచి అనుబంధం ఉండేదని ఆయన అన్నారు. సుబ్బిరామిరెడ్డి అందరి బంధువని నాగార్జున కితాబిచ్చారు. అవార్డు గ్రహీత శ్రీదేవితో తాను 4 సినిమాల్లో నటించానని.. తెలిపిన నాగార్జున తమ మొదటిచిత్రం ఆఖరిపోరాటం అని తెలిపారు. నాన్నగారితో ఆమె నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని ఆయన గుర్తు చేసుకున్నారు. అన్ని రకాల సినిమాలను చేసిన ఘనత రేఖ గారికి దక్కుతుందని నాగార్జున అన్నారు. అవార్డులను అందజేయడానికి విచ్చేసిన తన చిరకాల మిత్రుడు, మెగాస్టార్ చిరంజీవికి ఈ సందర్బంగా నాగార్జున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు రేఖ, బోనీకపూర్(శ్రీదేవి తరఫున), మెగాస్టార్ చిరంజీవి, కళాబంధు సుబ్బిరామిరెడ్డి, ఏఎన్నార్ కూతురు నాగసుశీల, సుమంత్ సహా ఏఎన్నార్ ఫ్యామిలీ, యంగ్ హీరో విజయ్ దేవరకొండ, లావణ్య త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.