ప్రపంచ కుబేరుల్లో బిల్‌గేట్స్ మరో సారి తన అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నారు.
దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి ఈ పీఠాన్ని అధిరోహించారు.
మైక్రోసాఫ్ట్‌కు 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.70,000 కోట్లు) క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్టు రావడమే ఇందుకు కారణం.
అమెజాన్‌కు కాకుండా ఈ కాంట్రాక్టును మైక్రోసాఫ్ట్‌కు ఇస్తున్నట్లు అమెరికా రక్షణశాఖ అక్టోబరు 25న ప్రకటించింది.
అప్పటి నుంచి ఇప్పటిదాకా మైక్రోసాఫ్ట్ షేర్లు 4 శాతం మేర పెరిగాయి.
దీనితో గేట్స్ సంపద 110 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.7.7 లక్షల కోట్లు) చేరుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ చెబుతోంది.
అదే సమయంలో అమెజాన్ షేరు 2% తగ్గిన నేపథ్యంలో బెజోస్ నికర సంపద 108.7 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.
ప్రతి రోజు ప్రపంచంలోని 500 మంది సంపన్నుల సంపదను సూచించే ఈ సూచీ ప్రకారం.. ఐరోపాలోనే అత్యంత సంపన్నుడైన బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొత్తం మీద మూడో స్థానంలో నిలిచారు. ఈయన సంపద 102.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ షేరు 48 శాతం మేర రాణించింది. దీనితో గేట్స్‌కున్న 1 శాతం వాటా విలువ బాగా పెరిగింది.
ఆయన మిగతా సంపద… వాటా విక్రయాలు, కుటుంబ కార్యాలయం కొన్నేళ్లుగా పెడుతున్న పెట్టుబడుల ద్వారా వచ్చింది.
అయితే బెజోస్ సంపద గేట్స్ కంటే చాలా ఎక్కువే ఉండాల్సింది. భార్య మెకెంజీకి జనవరిలో విడాకులు ఇవ్వడం వల్ల అమెజాన్‌లో నాలుగోవంతు వాటాను ఆమెకు ఇవ్వాల్సి వచ్చింది.
గేట్స్ కూడా తన దాతృత్వ కార్యకలాపాలు చేయకుండా ఉంటే ఎప్పటికీ అగ్రస్థానంలోనే ఉండేవారేమో.
ఎందుకంటే 1994 నుంచి ఇప్పటిదాకా బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు ఈయన 35 బిలియన్ డాలర్లకు పైగా దానం చేశారు.