DailyDose

అయ్యయ్యో…బిన్‌లాడెన్ ఏనుగు చనిపోయింది-తాజావార్తలు-11/17

Bin Laden Elephant Dies In Assam-Telugu Breaking News Today-11/17

* కొద్దిరోజుల క్రితం అసోం అటవీశాఖ అధికారులు బంధించిన ‘బిన్‌లాడెన్‌ ఏనుగు’ ఇవాళ తెల్లవారుజామున మృతిచెందింది. నవంబర్‌ 11న పశ్చిమ అసోంలోని గోల్‌పారా జిల్లా రాంగ్‌జూలీ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఈ మదపుటేనుగుకు అటవీశాఖ అధికారులు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి బంధించారు. అటవీ ప్రాంతానికి సమీపంలో నివాసముంటున్న అయిదుగురు వ్యక్తుల ప్రాణాలు బలితీసుకోవడమే దీనిని బంధించడానికి గల ప్రధాన కారణం.

* ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బీఎన్‌ రెడ్డి నగర్‌లోని తన నివాసంలో అశ్వత్థామ స్వీయ నిర్బంధంలో ఉంటూ శనివారం నిరాహార దీక్షకు దిగారు. రెండో రోజూ దీక్ష కొనసాగిస్తున్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సెలైన్‌ ఎక్కించడానికి వైద్యులు ప్రయత్నించగా అశ్వత్థామ రెడ్డి నిరాకరించారు. ఆస్పత్రిలోనూ దీక్షను కొనసాగిస్తానన్నారు.

* తెలంగాణలో భారీగా తహసీల్దార్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాసనసభ ఎన్నికల సమయంలో బదిలీ అయిన వారిని తిరిగి పాతస్థానాలకు బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జోన్‌ 5, జోన్‌ 6 పరిధిలో ఉన్న తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది.

* తిరుమల శ్రీవారి ఆలయంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. సీఎం జగన్‌ మెప్పు కోసం తిరుమల సంప్రదాయాలను ఉల్లంఘించేలా నాని వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. తితిదే సంప్రదాయాలపై మంత్రి చులకనగా మాట్లాడితే సీఎం జగన్‌ ఎందుకు ఆయన్ను మందలించలేదని కళా ప్రశ్నించారు.

* రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాల్ని చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు పార్లమెంటు లైబ్రరీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి మొత్తం 27పార్టీలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు.

* తన ఇంట్లో నిరాహార దీక్ష చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అరెస్టు అక్రమమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అఫిడవిట్‌లో ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ వ్యాఖ్యలను హైకోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ జరపాలని కోరారు.

* శ్రీవారి లడ్డూ ప్రసాదం ధర పెంచే యోచన లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. లడ్డూ ధరను పెంచుతారనే ప్రచారం అవాస్తవమని చెప్పారు. గత కొన్ని రోజులుగా శ్రీవారి లడ్డూ ప్రసాదం ధర పెంపుపై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

* రాబోయే దశాబ్ద కాలంలో భారత్‌ చాలా వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని, అది కోట్లదిమంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తుందని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ అభిప్రాయపడ్డారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం వెచ్చిస్తున్న మొత్తం మరింత పెరిగేందుకు అవకాశం లభిస్తుందన్నారు. మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కు సంబంధించిన పనుల పర్యవేక్షణలో భాగంగా మూడు రోజుల భారత్‌ పర్యటనకు వచ్చిన ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

* నాన్న అక్కినేని నాగేశ్వరరావు కోరిక మేరకు అలనాటి తారలు శ్రీదేవి, రేఖకు ఏఎన్నార్‌ అవార్డులు ఇస్తున్నామని అగ్ర కథానాయకుడు నాగార్జున చెప్పారు. నాన్న ఉన్నప్పుడు అవార్డులు ఇవ్వలేకోయామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిరంజీవి, సుబ్బరామి రెడ్డి, బోనీ కపూర్‌ తదితరులు హాజరయ్యారు.

* ప్రభుత్వ రంగ సంస్థలు ఎయిర్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం విక్రయం వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కావొచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘ఎయిర్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం సంస్థల విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి కావచ్చు.’’ అని నిర్మల తెలిపారు.

* అయోధ్యలోని భూవివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) నిర్ణయించింది. ఆదివారం లఖ్‌నవూలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇది తమ హక్కు అని ఇస్లామిక్‌ సంస్థ జమైత్‌ ఉలేమా-ఎ-హింద్‌ అధ్యక్షుడు మౌలానా అర్షద్‌ మదానీ వ్యాఖ్యానించారు.

* రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తాము ఎలాంటి ఆలోచనా చేయలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సునీల్‌శర్మ.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నట్లు హైకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎవరి ప్రోద్భలంతో నిరాధార అంశంపై హైకోర్టులో అఫిడవిట్‌ వేశారని సునీల్‌శర్మను ఉత్తమ్‌ ప్రశ్నించారు.

* సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని ఆయన స్పష్టం చేశారు. దిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..గత సమావేశాల్లో 370 ఆర్టికల్‌ రద్దు, తలాక్‌ రద్దు బిల్లులను తీసుకువచ్చామని గుర్తు చేశారు.

* ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి ఆయన నివాసంలో చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఇవాళ వైద్యులు అశ్వత్థామ రెడ్డి ఇంటికి వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. దీక్షను కొససాగిస్తే అశ్వత్థామ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు మీడియాతో చెప్పారు. భుత్వం చర్చలు జరిపేంతవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్షను విరమించనని అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు.

* పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ సాహెబ్‌ ఠాక్రే ఆశయం మేరకు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శివసేన నుంచే అవుతారని ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ పునరుద్ఘాటించారు. బాల్‌ ఠాక్రే ఏడో వర్థంతి సందర్భంగా ఆయనకు సంజయ్‌ రౌత్‌ ఆదివారం నివాళులర్పించారు. ‘‘బాల్‌ ఠాక్రే కోసం మేం ఏమైనా చేస్తాం. త్వరలోనే ఆయన కోరిక మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. బాల్‌ ఠాక్రేకు ఉద్ధవ్‌ ఇచ్చిన మాట త్వరలోనే నెరవేరనుంది.’’ అని అన్నారు.

* పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపైనా చర్చ జరపాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ తెలిపారు. అఖిలపక్ష సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి చెందిన చాలా అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని పరిష్కరించాలని కేంద్రాన్ని కోరామన్నారు.

* పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టు విషయంలో విపక్షాల వైఖరిని అఖిలపక్ష సమావేశం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని విభజన చట్టంలో ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.

* పార్లమెంట్‌ ఉభయ సభల్లో శివసేన ఎంపీల సీట్లను ప్రతిపక్షం వైపు మారుస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ఆ పార్టీకి చెందిన ఎంపీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఎన్డీయే నుంచి బయటకు వెళ్లడంతో పాటు మహారాష్ట్రలో కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

* వాతావరణ మార్పు పరిణామాల గురించి పాఠ్యాంశాల్లో బోధించాలని కోరుతూ హరియాణా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్‌ చౌతాలా కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌కు రాసిలో లేఖలో వాతావరణ మార్పు, స్థిరత్వంల గురించి తెలిసేలా పాఠ్యాంశం రూపొందించాలని చౌతాలా కోరారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ మార్పు తీవ్ర సమస్యగా మారుతోందని, ఆ ముప్పు భారత్‌కు కూడా ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు.

* దక్షిణకొరియాకు చెందిన కియా మోటార్స్‌ భారత్‌లో తన మార్కెటింగ్‌, సర్వీసింగ్‌ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించనుంది. ప్రస్తుతం ఉన్న 260 టచ్‌పాయింట్ల సంఖ్యను పెంచి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరికి 300కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. విక్రయాల పరంగా కియా దేశంలో 5వ అతిపెద్ద విక్రేతగా నిలిచింది. కేవలం ఒక్కమోడల్‌ను మార్కెట్లో విడుదల చేసి కియా ఈ స్థానానికి చేరడం విశేషం.