NRI-NRT

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా గొటాబయ రాజపక్సే

Gotabaya Rajapakse Becomes New President Of SriLanka

పొరుగున ఉన్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గొటాబయ రాజపక్స ఘన విజయం సాధించారు. శనివారం అక్కడ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ జరిగింది. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి రాజపక్స దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో రాజపక్స ఘన విజయం సాధించినట్లు ఆయన అధికార ప్రతినిధి కెహేలియా రాంబూక్‌వెల్లా  మీడియాకు వెల్లడించారు. తమకు 53-54 శాతం ఓట్లు వచ్చినట్లు తెలిపారు. అయితే అధికారికంగా ఫలితాలు ఈ సాయంత్రం వెల్లడికానున్నాయి. రక్షణ శాఖ మాజీ క్యార్యదర్శి అయిన గొటాబయ.. మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స సోదరుడు. 2009లో జరిగిన గొడవల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఆయనపై ఆరోపణలున్నాయి. 15 ఏళ్లుగా శ్రీలంకలో ఆర్థికాభివృద్ధి మందగించింది. దీనికి తోడు అక్కడ ఈస్టర్ సండేరోజున జరిగిన ఆత్మాహుతి దాడితో పర్యాటక ఆదాయానికి గండిపడింది. ఇన్ని సమస్యల నడుమ శనివారం అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. 22 మిలియన్ల శ్రీలంక జనాభా భవిష్యత్తును కాపాడతానంటూ గొటాబయ హామీల వర్షం కురిపించారు. మరోవైపు ఈస్టర్‌ సండేనాడు జరిగిన ఆత్మాహుతి దాడుల వల్ల రణిల్‌ విక్రమసింఘే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ముందస్తు సమాచారం అందినప్పటికీ దాడులు జరక్కుండా చర్యలు తీసుకోవడంలో విఫలమైంది.