DailyDose

GST సమస్యల పరిష్కారానికి అనుమతి-వాణిజ్యం-11/17

Nirmala Seetaraman On GST-Telugu Business News-11/17

* జీఎస్టీ రిటర్ను సమస్యల పరిష్కారానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక నిపుణులు, వ్యాపారులు, ఛార్టెడ్​ అకౌంటెంట్లతో సమావేశం నిర్వహించారు. త్వరలో దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ జరిపి.. సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారని ఆర్థికశాఖ ఉన్నతాధికారి తెలిపారు.

* రాబోయే దశాబ్ద కాలంలో భారత్‌ చాలా వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని, అది కోట్లదిమంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తుందని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ అభిప్రాయపడ్డారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం వెచ్చిస్తున్న మొత్తం మరింత పెరిగేందుకు అవకాశం లభిస్తుందన్నారు. మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కు సంబంధించిన పనుల పర్యవేక్షణలో భాగంగా మూడు రోజుల భారత్‌ పర్యటనకు వచ్చిన ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుత పరిస్థితి గురించి నాకు ఎటువంటి అవగాహనా లేదు. కాని రాబోయే దశాబ్ద కాలంలో భారత్‌ చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. కోట్లాదిమంది పేదరికం నుంచి బయటపడతారు. దాని ద్వారా ప్రభుత్వం విద్య, వైద్యం వంటి రంగాలపై ప్రభుత్వం మరింత ఖర్చు చేస్తుంది’’ అని బిల్‌గేట్స్‌ అన్నారు.

* ప్రభుత్వ రంగ సంస్థలు ఎయిర్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం విక్రయం వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కావొచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘ఎయిర్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం సంస్థల విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి కావచ్చు.’’ అని నిర్మల తెలిపారు. ఎయిర్‌ ఇండియాకు మార్చి నెలాఖరు నాటికి సుమారు రూ.58 వేల కోట్ల మేర అప్పులు ఉన్న సంగతి తెలిసిందే.

* సౌదీఅరేబియా ప్రభుత్వరంగానికి చెందిన అరాంకో విలువను 1.71ట్రిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టే అవకాశం ఉంది. 2016 సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ నిర్దేశించిన 2ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యం కంటే తక్కువ కావడం గమనార్హం. ఐపీవోలో మూడోవంతు షేర్లను సౌదీలోని పెట్టుబడిదారులకే కేటాయించనుండటం విశేషం. ఈ ఐపీవోలో కంపెనీలో దాదాపు 1.5శాతం వాటాలను విక్రయించి కనీసం 24 బిలియన్‌ డాలర్లు సేకరించాలని భావిస్తోంది. గతంలో అలీబాబా గ్రూప్‌ హోల్డింగ్స్‌ ఐపీవో 25 బిలియన్‌ డాలర్లను సేకరించి రికార్డు సృష్టించింది. అరాంకో ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. డిసెంబర్‌ ఐదోతేదీన కంపెనీ పూర్తివిలువను వెల్లడించనున్నారు. మరోపక్క బ్లూమ్‌బెర్గ్‌ సంస్థ 24 మనీమేనేజ్‌మెంట్‌ సంస్థల నుంచి సేకరించిన అభిప్రాయం ప్రకారం 1.2ట్రిలియన్‌ డాలర్ల నుంచి 1.5 ట్రిలియన్‌ డాలర్ల మధ్యలో దీనివిలువను నిర్దారించవచ్చని తెలుస్తోంది.

* దక్షిణకొరియాకు చెందిన కియా మోటార్స్‌ భారత్‌లో తన మార్కెటింగ్‌, సర్వీసింగ్‌ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించనుంది. ప్రస్తుతం ఉన్న 260 టచ్‌పాయింట్ల సంఖ్యను పెంచి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరికి 300కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. విక్రయాల పరంగా కియా దేశంలో 5వ అతిపెద్ద విక్రేతగా నిలిచింది. కేవలం ఒక్కమోడల్‌ను మార్కెట్లో విడుదల చేసి కియా ఈ స్థానానికి చేరడం విశేషం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎంపీవీ మోడల్‌ కార్నివాల్‌ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకురానుంది.