వాట్సాప్.. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారిలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ఈ యాప్‌ను వాడుతున్నారు. కేవలం మన దేశంలోనే 40 కోట్ల మంది వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ఈ యాప్ ఇంత ఎక్కువ మందికి చేరువ కావడానికి ప్రధాన కారణం.. అందులో ఉండే ఫీచర్లు. యూజర్లను ఆకర్షించేందుకు వాట్సాప్ అదే తరహాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్లు తెస్తుంది. తాజాగా భారీ ఎత్తున కొత్త ఫీచర్లు తెచ్చేందుకు సిద్ధమైంది ఫేస్‌బుక్‌కు చెందిన మెసెంజర్ దిగ్గజం. ఈ సారి తీసుకొచ్చే ఫీచర్లపై భారీ అంచనాలున్నాయి. మరి ఆ ఫీచర్లేంటి? వాటి ఉపయోగమెంత? అనే విషయాలు మీ కోసం.
** డార్క్ మోడ్..
వాట్సాప్ ఎప్పటి నుంచో ఊరిస్తున్న కొత్త ఫీచర్డార్క్ మోడ్. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ ఇంటర్ఫేస్ సహా అన్ని ఆప్షన్లు కేవలం లేత రంగుల్లోకి మార్చుకునే సౌలభ్యం ఉండనుంది. దీని ద్వారా రాత్రి పూట వాట్సాప్ వాడేందుకు ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఫోన్ ఛార్జింగ్ ఎక్కువసేపు వస్తుంది. ప్రస్తుతం బీటా వెర్షన్ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులో ఉంది. త్వరలోనే యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
** బూమరాంగ్ ఫీచర్..
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ బూమరాంగ్. ఏదైన ఫొటోను సరదాగా స్వల్ప నిడివిగల వీడియోగా మార్చడమే ఈ ఫీచర్లో ఉన్న సౌకర్యం. ప్రస్తుతం ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్ తెగ హల్చల్ చేస్తోంది. అలాంటి ఫీచర్‌ను తమ వినియోగదారులకు అందించాలని వాట్సాప్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి వచ్చే వీలుంది.
** డిలీట్ ఆటోమేటిక్..
వాట్సాప్ యూజర్లు అవతలి వ్యక్తికి పంపే సందేశాలు కొంత సేపటి తర్వాత వాటంతటవే డిలీట్ అయ్యేలా ఓ ఫీచర్‌ను తీసుకువచ్చేందుకు వాట్సాప్ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. ఒక వాట్సాప్ యూజర్ మరో వాట్సాప్ యూజర్‌కు సందేశాలు పంపే ముందు తన మెసేజ్ అవతలి వ్యక్తికి ఎంత సేపు కనిపించాలి అనేది ముందుగానే నిర్ణయించొచ్చు. ఇలా ఈ ఫీచర్‌ను ఉపయోగించి పంపిన సందేశాలు 5 సెకన్ల నుంచి గంట వ్యవధిలో వాటంతట అవే డిలీట్ అవుతాయి. తాత్కాలిక అవసరాలకు పంపే సందేశాలకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడనుంది.ప్రస్తుతం ‘డిలీట్ బోత్’ అనే ఫీచర్ ఇంచుమించు ఇలాంటి సదుపాయాలతో అందుబాటులో ఉంది. ఈ సదుపాయం ద్వారా ఒకరికి పంపాల్సిన సందేశం వేరొకరికి పంపినప్పుడు.. లేదా ఏవైనా పొరపాట్లు ఉంటే ఆ సందేశాన్ని పూర్తిగా డిలీట్ చేయొచ్చు. గరిష్ఠంగా.. సందేశం పంపిన గంటలోపు డిలీట్ బోత్ సదుపాయాన్ని వినియోగించే అవకాశముంది. ముఖ్యంగా యూజర్ మాన్యువల్‌గా ఈ సదుపాయం వినియోగించాల్సి ఉంటుంది.
** ఇటీవలి కొత్త ఫీచర్లు ఇవే..
వాట్సాప్ ఇప్పటికే.. ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనితో పాటు అనవసర గ్రూపుల్లో.. గుర్తు తెలియని వారు మిమ్మల్ని చేర్చేందుకు వీలు లేకుండా సెక్యూరిటీ ఫీచర్‌ను తెచ్చింది. దీని ద్వారా మీరు ఎంపిక చేసుకున్న వారు మాత్రమే మిమ్మల్ని గ్రూపుల్లో చేర్చే వీలుండనుంది.