NRI-NRT

చైనా తర్వాత అమెరికాకు ఎగబాకేది భారత విద్యార్థులే

Indian Students Rank No.2 After China In Immigrating To The US

అమెరికాకు విదేశీ విద్యార్థుల తాకిడి 2018-19లోనూ కొనసాగింది. అత్యధికంగా చైనా నుంచి విద్యార్థులు అగ్రారాజ్యానికి వెళుతుండగా.. భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. గత దశాబ్దకాలంగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. ‘2019 ఓపెన్‌ డోర్స్ రిపోర్ట్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ ఎక్స్ఛేంజ్‌’ నివేదిక ప్రకారం 2018-19 విద్యా సంవత్సరంలో 10లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు అమెరికాకు వెళ్లారు. వీరిలో 3.69లక్షల మంది చైనా వారు కాగా, భారతీయులు 2,02,014 మంది కావడం విశేషం. గత సంవత్సరంతో పోలిస్తే చైనా విద్యార్థుల సంఖ్య 1.7శాతం.. భారత విద్యార్థుల సంఖ్య 2.9శాతం పుంజుకున్నాయి.విదేశీ విద్యార్థుల రాకతో 2018లో అమెరికాకు 44.7 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరినట్లు అక్కడి వాణిజ్యశాఖ ప్రకటించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 5.5శాతం అదనం కావడం గమనార్హం. అయితే బంగ్లాదేశ్‌, బ్రెజిల్‌, నైజీరియా, పాకిస్థాన్ నుంచి విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. గణితం, కంప్యూటర్‌ విద్య చదువుతున్న వారి సంఖ్య 9.4శాతం పెరిగింది. తరువాతి స్థానంలో ఎంబీఏ కోర్సు చేస్తున్న వారు రెండో స్థానంలో ఉన్నారు. ఇక అగ్రరాజ్యానికి వెళుతున్న విదేశీ విద్యార్థుల్లో 21.1శాతం మంది ఇంజినీరింగ్‌ వైపు మొగ్గుచూపుతున్నారు.