Sports

వన్డే జట్టులోకి మయాంక్

Mayank Agarwal Joins Indian One Day Team

మయాంక్‌‌ అగర్వాల్‌‌.. టీమిండియా టెస్ట్‌‌ ఓపెనర్‌‌.. పట్టుమని పది టెస్ట్‌‌లు ఆడిందిలేదు. ఎనిమిది మ్యాచ్‌‌ల చిన్న కెరీర్‌‌లో 12 ఇన్నింగ్స్‌‌ల్లోనే బ్యాటింగ్‌‌ చేశాడు. కానీ ఎవరూ ఊహించని విధంగా అప్పుడే రెండు డబుల్‌‌ సెంచరీలు బాదేసి క్రికెట్‌‌ వరల్డ్‌‌పై తన ముద్ర వేశాడు. ఇక, ఇండోర్‌‌లో బంగ్లాదేశ్‌‌పై ఆడిన ఇన్నింగ్స్‌‌తో తనలోని అటాకింగ్‌‌ ప్లేయర్‌‌ను ప్రపంచానికి చూపెట్టాడు. అలవోకగా భారీ సిక్సర్లు బాది సత్తా చాటిన మయాంక్‌‌.. టీమిండియా లిమిటెడ్‌‌ ఓవర్‌‌ ఫార్మాట్‌‌ జట్ల తలుపు తడుతున్నాడు. కాలం కలిసొస్తే డిసెంబర్‌‌లో వెస్టిండీస్‌‌తో జరిగే సిరీస్‌‌లో అతను వన్డే అరంగేట్రం చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌‌లు ఆడేందుకు వచ్చే ఏడాది జనవరిలో టీమిండియా.. న్యూజిలాండ్‌‌ వెళ్లనుంది. ఇటీవల టెస్ట్‌‌ ఓపెనర్‌‌గా మారిన రోహిత్‌‌శర్మ ఇప్పుడు మూడు ఫార్మాట్‌‌ల్లోను టీమ్‌‌కు కీలకంగా మారాడు. దీంతో కివీస్‌‌ టూర్‌‌ నేపథ్యంలో విండీస్‌‌ సిరీస్‌‌కు అతనికి విశ్రాంతినిచ్చే చాన్సుందని సమాచారం. అప్పుడు మయాంక్‌‌ రేస్‌‌లోకి వస్తాడు. ఎందుకంటే 13 సెంచరీలు, 50 ప్లస్‌‌ యావరేజ్‌‌, 100 ప్లస్‌‌ స్ట్రయిక్‌‌ రేట్‌‌తో లిస్ట్‌‌-–ఎ క్రికెట్‌‌లో మయాంక్‌‌కు ఉన్న మెరుగైన రికార్డు సెలెక్టర్లను కచ్చితంగా ఆకర్షిస్తుంది. పైగా వరల్డ్‌‌కప్‌‌ అప్పుడు విజయ్‌‌శంకర్‌‌కు రిప్లేస్‌‌మెంట్‌‌గా అంబటి రాయుడిని కాదని సెలెక్టర్లు మయాంక్‌‌ను ఇంగ్లండ్‌‌కు పంపారు. దీనిని బట్టి వన్డే ఫార్మాట్‌‌లో సెలెక్టర్లు, మేనేజ్‌‌మెంట్‌‌ ప్లానింగ్‌‌లో మయాంక్‌‌ ఉన్నాడని అర్థమవుతోంది. పైగా ధవన్‌‌ కూడా ఇటీవల వరుసగా విఫలమవుతున్నాడు. దీంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మయాంక్‌‌ను లిమిటెడ్‌‌ ఓవర్‌‌ ఫార్మాట్‌‌ల్లో ఆడించాలని పలువురు సీనియర్లు కూడా అభిప్రాయపడుతున్నారు.