DailyDose

నేటి పది ప్రధాన వార్తలు-11/18

Top 10 Latest News Of The Day Acorss The Globe-Nov 2019-నేటి పది ప్రధాన వార్తలు-11/18

1. కాలిఫోర్నియా పార్టీలో కాల్పులు ఓ ఇంట్లో జరుగుతున్న పార్టీలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో నలుగురు మృతిచెందిన ఘటన కాలిఫోర్నియాలోని ఫ్రేస్నోలో చోటు చేసుకుంది. సౌత్‌వెస్ట్‌ ఫ్రేస్నోలో ఓ ఇంట్లో ఆదివారం సాయంత్రం ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూస్తూ కొందరు స్నేహితులు పార్టీ చేసుకుంటున్నారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల సమయంలో కాల్పులు జరిపాడు. దీంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారని, ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు ఫ్రేస్నో పోలీసులు తెలిపారు.
2. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభంపార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతి చెందిన సభ్యులకు ఉభయసభలు సంతాపం తెలిపాయి. అరుణ్‌జైట్లీ, జగన్నాథ్‌ మిశ్రా చేసిన సేవలను కొనియాడాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులతో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ప్రమాణం చేయించారు.ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులపై లోక్‌సభలో కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది. మహారాష్ట్రలో భారీ వర్షాలకు నష్టపోయిన పంటలపై శివసేన, ఫరూక్‌ అబ్దుల్లా విడుదలకు సంబంధించి టీఎంసీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
3. ప్రాంతీయ భాషలను రక్షించాలి : కేశినేని నానిప్రాంతీయ భాషల పరిరక్షణ కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించాలని లోక్‌సభలో కేంద్రాన్ని తెదేపా ప్రశ్నించింది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందని.. అలాంటి రాష్ట్రంలో మాట్లాడే తెలుగు భాషా పరిరక్షణ కోసం కేంద్రం ఏం చర్యలు తీసుకుంటోందని తెదేపా ఎంపీ కేశినేని నాని ప్రశ్నోత్తరాల సమయంలో అడిగారు. ప్రాంతీయ భాషలను రక్షించాల్సిన అవసరం ఉందని.. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ఏపీలో వైకాపా ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేసిందని వివరించారు. త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని కేశినేని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
4. అశ్వత్థామ రెడ్డికి బలవంతంగా సెలైన్స్‌ ఎక్కిస్తున్నారు
దీక్ష కొనసాగిస్తున్న ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించిందని తెజస అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. తన నివాసంలో దీక్ష చేపట్టిన అశ్వత్థామను నిన్న పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. దీంతో ఆస్పత్రిలో ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఈ ఉదయం కోదండరామ్‌ పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఆయనకు బలవంతంగా సెలైన్స్ ఎక్కిస్తున్నారు. అయితే ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు స్పష్టం చేశారు. రేపటి సడక్ బంద్ యథావిధిగా కొనసాగుతుంది’ అని కోదండరామ్‌ అన్నారు.
5. రోడ్డు ప్రమాదంలో 10మంది మృతి
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 14 మంది మృత్యువాత పడ్డారు. మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బికనేర్‌ జిల్లా శ్రీ దంగర్‌గఢ్‌ సమీపంలోని 11వ నెంబర్‌ జాతీయరహదారిపై సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా బస్సులో మంటలు అంటుకొని కొంతమంది ప్రయాణికులు అందులోనే చిక్కుకున్నారు.
6. ఇంద్రానూయికి అరుదైన గౌరవం
మహిళలు తమని తాము ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించుకోవద్దని ప్రముఖ వాణిజ్యవేత్త, పెప్పికో మాజీ సీఈఓ ఇంద్రానూయి పిలుపునిచ్చారు. నేడు స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కష్టపడి పనిచేసే వారికి పుట్టిన ప్రాంతం, వారి సంస్కృతితో సంబంధం లేకుండా అవకాశాలు వస్తాయని తెలిపారు. అమెరికాలోని ప్రముఖ ‘నేషనల్‌ పోట్రెయిట్‌ గ్యాలరీ’లో ఆమెకు స్థానం కల్పించిన సందర్భంగా నిర్వహించిన వేడుకలో ఇంద్రా నూయి ఈ వ్యాఖ్యలు చేశారు.
7. ఆగ్రా పేరు మారనుందా..?
అలహాబాద్‌, ఫజియాబాద్‌, మొఘల్‌ సరయ్‌ నగరాల జాబితాలోనే త్వరలోనే ఆగ్రా నగరం కూడా చేరబోతోంది. ఎందుకంటే త్వరలోనే ఆ నగరం పేరు మారే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆగ్రాకు కొత్త పేరు సూచించాలంటూ డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయానికి లేఖ రాసింది. ఆగ్రాను పూర్వం మహారాజ్ అగ్రసేన్‌ పేరు మీదుగా ‘అగ్రవన్‌’ అని పిలిచేవారు. అక్కడ అత్యధికంగా ఉన్న అగర్వాల్‌ సమాజం కూడా ‘ఆగ్రా’ పేరును ‘అగ్రవన్‌’గా మార్చాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరింది.
8. మేం మీలా విమానాలు కొనట్లేదు: కేజ్రీవాల్‌
దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం భాజపా నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆప్‌ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు వారికి మింగుడు పడడం లేదని దుయ్యబట్టారు. రితాలా అసెంబ్లీ పరిధిలో రహదారి నిర్మాణపనుల ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రయోజనాల కోసమే దిల్లీ ప్రభుత్వం మహిళలకు ఉచిత రవాణా కల్పించిందని భాజపా నాయకులు చేసిన విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. గుజరాత్‌ ప్రభుత్వం ముఖ్యమంత్రి కోసం రూ.191కోట్లతో విమానాన్ని కొనడాన్ని ఉద్దేశిస్తూ.. ‘మేం అలా విమానాలను కొనుగోలు చేయట్లేదు. మహిళలకు ఉచిత రవాణా కల్పించాం. అది కూడా మీకు నచ్చడం లేదు’ అని విమర్శించారు.
9. ‘లాల్‌ సింగ్‌ చద్దా’గా ఆమీర్‌ను చూశారా?
పాత్ర కోసం ఎంత కష్టమైనా భరించి, తదనుగుణంగా మారిపోయే అతి కొద్ది మంది నటుల్లో బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమీర్‌ఖాన్‌ ఒకరు. వైవిధ్య పాత్రలను ఎంచుకుంటూ యువ కథానాయకులకే కాదు, తన తోటి నటులకు సైతం పోటీగా నిలుస్తుంటారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’. సోమవారం ఇందులోని ఆమీర్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. గుబురు గెడ్డం, తలపై టర్బన్‌తో ఉన్న ఆమీర్‌ ఫొటోను అభిమానులతో పంచుకుంది.
10. విండీస్‌పై భారత్‌ విజయం
బౌలర్లు రాణించడంతో వెస్టిండీస్‌పై భారత మహిళా జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గయానాలో జరిగిన నాలుగో మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో మ్యాచ్‌ను అంపైర్లు తొమ్మిది ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్‌ భారత బౌలర్ల ధాటికి ఐదు వికెట్ల నష్టానికి 45 పరుగులే చేసింది. ఫలితంగా హర్మన్‌ప్రీత్‌ సేన 5 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది.