WorldWonders

25 ఏళ్లు ముందుగానే నిండిన చైనా చెత్తకుప్ప

China Dumping Yard Fills 25Years Early-#TrashyChina-Jiangcungou-landfil

* 50 ఏళ్లనుకుంటే 25 ఏళ్లకే నిండిపోయిన చైనా జియాంగ్ కుంగూ డంపింగ్ యార్డ్
రోజూ 2,500 టన్నుల చెత్త వేసేలా నిర్మాణం.. వస్తున్న చెత్త 10 వేల టన్నులకు పైనే
రీసైకిల్ ప్లాంట్లు తక్కువ.. వచ్చే ఏడాది నాలుగింటిని ఏర్పాటు చేయనున్న చైనా
మనం ఇంట్లో మిగిలిపోయిన చెత్తను ఏం చేస్తం? ఇంటి ముందుకొచ్చే చెత్త బండిలో వేస్తాం. లేదంటే దగ్గర్లోని డస్ట్బిన్లో పడేస్తాం. మరి, ఆ చెత్తంతా ఎక్కడికి పోతోంది? ఆ చెత్తనంతా ఏం చేస్తున్నారు? మన హైదరాబాద్ అయితే, ఠక్కున గుర్తొచ్చేది జవహర్నగర్ డంపింగ్ యార్డ్. రోజూ కొన్ని వందల టన్నుల చెత్త అక్కడ పోగుపడుతోంది. అలా అలా కొన్నేళ్లయితే ఆ చెత్తంతా ఏమవుతుంది? రీసైకిల్ చేస్తే ఫర్వాలేదు, లేదంటే మాత్రం చెత్త కొండ పెరిగిపోతుంది. ఇప్పుడు చైనాను అదే సమస్య వేధిస్తోంది. ఆ దేశంలోనే అతిపెద్దదైన డంపింగ్ యార్డు అనుకున్న టైం కన్నా ముందే నిండిపోయింది. 50 ఏళ్ల పాటు అది పనికొస్తుందనుకుంటే మధ్యలోనే చేతులెత్తేసింది. 50 ఏళ్లలో నిండిపోవాల్సిన డంపింగ్ యార్డ్, 25 ఏళ్లకే ఫుల్ అయిపోయింది. అంతలా పోగుపడిపోతోంది అక్కడ చెత్త. ఆ డంపింగ్ యార్డ్ షాంక్సి ప్రావిన్స్లో ఉంది. దాని పేరు జియాంగ్కుంగూ. 100 ఫుట్బాల్ గ్రౌండ్ల సైజులో ఉండే ఆ డంపింగ్ యార్డ్కు కెపాసిటీకి మించి చెత్త వస్తుండడంతో అనుకున్న టైంకు ముందుగానే అది ఫుల్లుగా నిండిపోయింది.
*రోజూ 10 వేల టన్నుల చెత్త
1994లో జియాంగ్కుంగూ డంపింగ్ యార్డును ప్రారంభించారు. రోజూ 2,500 టన్నుల కెపాసిటీతో 2044 వరకు అక్కడ చెత్త వేసేలా దానికి డిజైన్ చేశారు. 7 లక్షల చదరపుటడుగుల వైశాల్యం, 150 మీటర్ల లోతుతో 3.4 కోట్ల క్యుబిక్ మీటర్ల కెపాసిటీతో దానిని కట్టారు. కానీ, అక్కడికి నాలుగు రెట్లు ఎక్కువగా, అంటే రోజూ దాదాపు 10 వేల టన్నుల చెత్త వచ్చి చేరుతోంది. దాదాపు 80 లక్షల మంది నుంచి వచ్చే వ్యర్థాలన్నీ అక్కడే పోగుపడిపోతున్నాయి. అంతమందికి అదొక్కటే డంపింగ్ యార్డు ఉండడం వల్లే ఇంత తొందరగా అది నిండిపోయిందని అధికారులు అంటున్నారు. ఈ నెల ప్రారంభంలో చెత్తను రీసైకిల్ చేసే ఓ ప్లాంట్ను అక్కడ ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది మరో నాలుగింటిని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఐదు కలిసి రోజూ 12,750 టన్నుల చెత్తను ప్రాసెస్ చేస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. చెత్తను ఒక చోట పోగు చేసే బదులు రీసైకిల్ చేసి ‘ఎకోలాజికల్ పార్క్’గా మార్చాలని భావిస్తున్నారు.
*ఎంత చెత్త?
చైనా స్టాటిస్టికల్ ఇయర్ బుక్ ప్రకారం ఒక్క 2017లోనే 21.5 టన్నుల చెత్తను ఉత్పత్తి చేసింది. అది కూడా కేవలం సిటీల్లోనే. అంతకుముందు పదేళ్లతో పోలిస్తే 15.2 కోట్ల ఎక్కువ చెత్త ఉత్పత్తి అయింది. దేశవ్యాప్తంగా 654 డంపింగ్ యార్డులుంటే, 286 రీసైకిల్/డిస్పోజల్ ప్లాంట్లున్నాయి. అయితే, 2020 చివరినాటికి 35 శాతం చెత్తను రీసైకిల్ చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ దేశ అధికారులు చెబుతున్నారు. 2015లో షెంజెన్ సిటీలో చెత్త డంప్ కూలి 73 మంది చనిపోయారు. నిజానికి 40 లక్షల క్యుబిక్ మీటర్ల కెపాసిటీతో 95 మీటర్ల ఎత్తులో దీనిని కట్టారు. కానీ, అది కూలిపోయినప్పటికి అక్కడ ఉన్న చెత్త 58 లక్షల క్యుబిక్ మీటర్లు. 160 మీటర్ల ఎత్తులో పోగు పడింది.
*వేరే దేశాల చెత్త అయితే కష్టం
నిజానికి 2017 దాకా విదేశాల చెత్తనూ చైనా రీసైకిల్ చేసేది. కానీ, తన చెత్తను తానే డీల్ చేసుకోలేకపోతున్న డ్రాగన్ కంట్రీ, విదేశాల చెత్తను తీసుకోవడం ఆపేసింది. ఒక్క 2017లోనే యూరప్, జపాన్, అమెరికా నుంచి 70 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్త, 2.7 కోట్ల వేస్ట్పేపర్ చెత్తను డంపింగ్ చేయించుకుంది. మలేసియా, టర్కీ, ఫిలిప్పీన్స్, ఇండొనేసియాలూ చెత్తను తీసుకున్నా, చైనాతో పోలిస్తే తక్కువే. అయితే, ఉంటున్న కొద్దీ చెత్త ఎక్కువైపోతుండడంతో డీల్ చేయలేక చైనా చేతులెత్తేసింది. చైనా బాటలోనే మిగతా ఆ దేశాలూ వెళ్లాయి. చెత్త దిగుమతిపై నిషేధం విధించాయి.