* వైకాపా అధినేత జగన్ పాలనా పట్ల జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. జగన్ తాజాగా తీసుకుంటున్న నిర్ణయాల పై జాతీయ మీడియా సైతం విమర్శలు గుప్పిస్తుంది మరీ ముఖ్యంగా తాజాగా అమరావతి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై నేషనల్ మీడియా సైతం తప్పు పడుతుంది రాజధాని అమరావతిలో జగన్ సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్టును రద్దు చేయడంపై ప్రముఖ దినపత్రిక ఎకనామిక్స్ టీం ఓ ఎడిటోరియల్ రాసింది. ఈ నేపథ్యంలో జగన్ తరఫున చక్రం తిప్పడానికి రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
*పాలేరు టీఆర్ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు
పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతల మధ్య అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అసమ్మతి గళం విప్పారు. ఉపేందర్ రెడ్డి గ్రూపులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తనతోపాటు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన వారికే ప్రాధాన్యత ఇస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు కనీసం సభ్యత్వం కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పార్టీ సభ్యత్వం నమోదు వరకు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ వస్తున్నారని, పార్టీ నాయకులకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. తనకు అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్‌ను సర్వనాశనం చేస్తున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ టీఆర్ఎస్ నాయకులను పూర్తిగా పక్కకు పెట్టేశారని మండిపడుతున్నారు.
*చంద్రబాబును తిట్టించే కొత్త పథకం తెచ్చారు: ఆలపాటి
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును తిట్టించే పథకాన్ని వైసీపీ తీసుకొచ్చిందని మాజీ మంత్రి ఆలపాటి రాజా మండిపడ్డారు. గుంటూరులో ఇవాళ మీడియా మీట్ నిర్వహించిన ఆయన వైసీపీ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు విసిరారు. ‘జగన్ ప్రభుత్వం రైతులకు కనీస న్యాయం చేయలేకపోతోంది. వ్యవసాయంపై ప్రభుత్వం వింత పొకడ. అన్ని జలశయాలు నిండిన నీటి విధానం లేదు. ఎరువులు, విత్తనాలు విధానం ప్రభుత్వం వద్ద లేదు. పంటలపై ఒక్క ప్రభుత్వ సమీక్ష కూడా లేదు. రైతులు, పంటలపై ఓ స్పష్టమైన ప్రకటన లేదు.. పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించలేని దయనీయ స్దితిలో ప్రభుత్వం ఉంది.
*సీఎం కేసీఆర్ నియంతలా మారాడు: భట్టి
సీఎం కేసీఆర్‌కు అహంకారం తలకెక్కి నియంతలా మారాడని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కోర్టును కూడా గౌరవించరని తేలిందన్నారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. సమ్మె కార్మికుల చట్ట పరమైన హక్కు అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందన్నారు. రాజ్యంగ సంక్షోభం గురించి పరిశీలించాలని గవర్నర్, రాష్ట్రపతిని కోరే పరిస్థితి వస్తుందన్నారు. విపక్షాలు ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తే వాస్తవాలు బయటపెట్టాలని భట్టి డిమాండ్ చేశారు.
*దెబ్బకు దెబ్బ తీస్తాం: జీవీ ఆంజనేయులు
రాష్ట్రంలో దోపిడీ తప్ప అభివృద్ధి ఎక్కడా లేదని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. దాడులు, అక్రమ కేసులతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యం చేసే వారిని దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరించారు. యరపతినేనిపై కూడా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటాలని జీవీ ఆంజనేయలు పిలుపునిచ్చారు.
* తెలుగు పేపర్‌ని నడుపుతూ తెలుగునే చంపేస్తావా?
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద రాద్ధాంతమే చేస్తున్నాయి. తెలుగు రాష్ర్టంలో తెలుగును తీసివేయడమేంటని ప్రభుత్వాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగును రద్దుచేసి, ఇంగ్లీష్‌ను ప్రవేశపెట్టడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రశ్నించారు. తాజాగా ఆయన మరోసారి ట్విట్టర్ వేదికగా ఇదే విషయంపై ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు భాషని ఎవరూ వద్దని చెప్పటం లేదని ఆయన అన్నారు. మాతృ భాష తెలుగుని మృత భాషగా కాకుండా ఏం చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు ‘జగన్ రెడ్డి గారు’ చెప్పాలని ఆయన అన్నారు. మాతృభాషని, మాండలీకాలని సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. మాతృ భాషని, మృత భాషగా మార్చకండంటూ ఆయన కోరారు. తెలుగు రాష్ట్రానికి సీఎంగా ఉండి, రాష్ట్రాన్నిఏలుతూ మరియు తెలుగు పేపర్‌ని నడుపుతూ తెలుగుని చంపేసే ఆలోచన భస్మాసుర తత్వాన్ని సూచిస్తుందని ఆయన మండిపడ్డారు. ‘మా తెలుగు తల్లి’ అని పాడాల్సిన మీరు ‘తెలుగు భాష తల్లినే’ చంపేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
*ఉండవల్లి శ్రీదేవి పై విచారణ జరపండి
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల జారీ చేసారు. 2019 ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి ఉండవల్లి శ్రీదేవి వైకాపా తరపున పోటీ చేసి ప్రత్యర్ధి తెదేపా అభ్యర్ధి శ్రావణ్ కుమార్ పై విజయం సాధించారు. అనతంరం ఓ ఇంటర్వ్యూ లో తానూ క్రిస్టియన్ అని చెప్పిన విషయాన్నీ ప్రస్తావిస్తూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫారం తరపున సంతోష్ అనేవ్యక్తి రాష్ట్రపతికి ఫిర్యాదు చేసారు. క్రిస్తియంగా చెప్పుకుంటున్న శ్రీదేవికి ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన నియోజకవర్గం నుంచి పోటీ చేసే అర్హత లేదని అందులో పేర్కొన్నారు.
*మజ్లీస్ పై మమత తీవ్ర వ్యాఖ్యలు
మజ్లీస్ పార్టీపై పశ్చిమ బెంగాల్ సి ఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్ లో పోటీ చేయాలని మజ్లీస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు. కేవలం భాజపాకి అమ్ముడుపోయి మజ్లీస్ పార్టీ ఇలా చేస్తోందని ఆమె అన్నారు. ఆయా రాష్ట్రాలలో కూడా మజ్లీస్ పార్టీ పోటీ చేసి భాజాపాకి ఉపయోగపడేలా వ్యవహరిస్తోందని ఆమె చెప్పారు. బగల్ లోని ముస్లీంలు మజ్లీస్ ఇలా చేస్తోందని ఆమె ఆరోపించారు. బెంగాల్ నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేయాలని మజ్లీస్ భావిస్తున్న నేపద్యంలో టీ ఎం సి అధినేత అయిన ముఖ్యమంత్రి మమత ఈ యాఖ్యలు చేయడం విశేషం.
*పోలీసులు నాకు నోటీసులిచ్చారు..: చంద్రబాబు
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటనలో బిజిబీజీగా ఉన్నారు. పర్యటనలో భాగంగా నిన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించారు. అయితే మొత్తం మూడ్రోజులపాటు చంద్రబాబు ఈ జిల్లాలో పర్యటించనున్నారు. రెండోరోజు పర్యటనలో భాగంగా కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. వైసీపీ వేధింపులు విపరీతంగా పెరిగాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోను తన దగ్గరకి కార్యకర్తలను రానీయకుండా చేశారన్నారు. అంతేకాదు తనకు పోలీసులు నోటీసులిచ్చారు. తనను కలిస్తే కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేశారన్నారు.
*రాష్ట్రంలో విచ్చల విడిగా అవినీతి పెరిగింది: కాల్వ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దుర్మార్గుడి చేతుల్లోకి వెళ్ళిందని, ఏపీలో విచ్చల విడిగా అవినీతి పెరిగిందని టీడీపీ నేత, మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా టీడీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెడుతోందన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఐకమత్యంగా ఉంటేనే ఈ దాడులను ఎదుర్కోగలమని ఆయన అన్నారు.
*ఆర్టీసీ సమ్మెను లోక్సభలో ప్రస్తావిస్తాం-ఎంపీ బండి సంజయ్ కుమార్
ఆర్టీసీ సమ్మె వ్యవహారాన్ని లోక్సభలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. పార్లమెంట్ ఆవరణలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ వ్యవహార శైలితో 48 వేల కుటుంబాలు బజారున పడ్డాయన్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు సభాపతి అనుమతి కోరనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడం, వారి కుటుంబాలను రక్షించడమే తమ ఏకైక ఎజెండా అని ఆయన తెలిపారు. రాష్ట్ర సమస్యలను లోక్సభలో లేవనెత్తవద్దంటూ తెరాస ఎంపీలు సభాపతికి ఫిర్యాదు చేయడం ద్వారా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు వారికి వ్యతిరేకంగా ఉన్నట్లు ఒప్పుకున్నట్లయిందని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
* సోనియాతో భేటీ అనంతరం పవార్ వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ ముగిసింది. దిల్లీలోని 10 జన్పథ్లో సోనియా నివాసంలో దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితిపై చర్చించినట్టు పవార్ వెల్లడించారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సోనియా గాంధీతో భేటీ అయ్యా. ఈ భేటీలో కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కూడా పాల్గొన్నారు. మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితిపై సమగ్రంగా చర్చించాం. అక్కడి పరిస్థితి గురించి సోనియాకు వివరించాం. మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలను మేం ఓ కంట కనిపెడుతున్నాం. నిర్ణయం తీసుకొనే ముందు మా రెండు పార్టీల సీనియర్ నాయకుల అభిప్రాయాలను విశ్వాసంలోకి తీసుకుంటాం. వాటి ఆధారంగానే భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. మా పార్టీల సీనియర్ నాయకులు అక్కడి పరిస్థితులను అంచనా వేసి వారి అభిప్రాయాలను మాకు తెలియజేస్తారు’’ అని తెలిపారు.
*ఎన్డీయే ఒక్క పార్టీ సొత్తేం కాదు: రౌత్
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభనకు కేవలం భాజపా అహమే కారణమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో శివసేన ఈసారి ప్రతిపక్షం వైపున కూర్చొంది. ఈ సందర్భంగా రౌత్ మీడియాతో మాట్లాడుతూ భాజపాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్డీయే కూటమి ఏ ఒక్క పార్టీ సొత్తు కాదన్నారు. అయితే, కొందరు మాత్రం తమను తాము దైవంగా భావిస్తున్నారంటూ భాజపాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
*భారత్ బచావో విజయవంతం చేయాలి-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
భారత్ బచావో ఆందోళన్లో తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పదిమంది పాల్గొని విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 30న దిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రం తరఫున బాధ్యులుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్, ప్రధాన కార్యదర్శి సీజే శ్రీనివాస్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఏఐసీసీ, పీసీసీ కార్యవర్గ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనాలని కోరారు.
*తప్పుడు కేసులకు బెదరం-తెదేపా అధినేత చంద్రబాబు
గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి స్థానిక సంస్థల పోరులో విజయబావుటా ఎగరేస్తామని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని.. ఆ తాటాకు చప్పుళ్లకు తాము భయపడబోమని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సోమవారం నిర్వహించిన తెదేపా జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. వైకాపా పాలనలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారన్నారు. ఇసుక కొరతతో రాష్ట్రంలో 32 రకాల వృత్తులు, అనుబంధ వృత్తులవారు ఉపాధి కోల్పోయారని.. 50 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నించిన ప్రతిపక్షాలు, వామపక్షాలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు.
*తెరాస కార్యకర్తలా ఆర్టీసీ ఎండీ అఫిడవిట్: రావుల
సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఆర్టీసీ ఇన్ఛార్జి ఎండీ సునీల్ శర్మ తెరాస పార్టీకి కార్యకర్తగా మారి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. ఇలాంటివి గతంలో వినలేదు.. చూడలేదు.. భవిష్యత్తులోనూ జరగకపోవచ్చని అన్నారు. పార్టీ అధికార ప్రతినిధి ఎన్.దుర్గాప్రసాద్తో కలిసి సోమవారం ఆయన ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడారు.
*ప్రభుత్వ ప్రోత్సాహంతోనే మతమార్పిళ్లు
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యథేచ్ఛగా మతమార్పిడులు జరుగుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. విజయవాడలోని బృందావనకాలనీలో భాజపా ధార్మికసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అన్ని మతాలను తాము గౌరవిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మతమార్పిళ్లను ప్రోత్సహిస్తోందని చెప్పారు. దేవాలయాలను కూలగొడుతున్నారని, విగ్రహాలను తొలగిస్తున్నారని పేర్కొన్నారు.
*రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు
సినీనటుడు కమల్హాసన్ 60వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఇళయరాజా ఆధ్వర్యంలో ఆదివారం చెన్నైలో సంగీత విభావరి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ.. ‘తమిళనాడు ముఖ్యమంత్రి అవుతానని పళనిస్వామి రెండేళ్ల క్రితం కలలో కూడా ఊహించి ఉండరు. అలాంటి ఆయన సీఎం పదవి చేపట్టారు. ప్రభుత్వం నాలుగైదు నెలల్లోనే పడిపోతుందని 99 శాతం మంది ప్రజలు అనుకున్నారు. ఆయన నిలదొక్కుకొని నేటికీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటన భవిష్యత్తులోనూ జరగొచ్చు. నేను.. కమల్ వేర్వేరు మార్గంలో వెళ్తున్నా, స్నేహం మారదు. మా కోసం అభిమానులు గొడవపడకూడదు’ అని ఆయన పేర్కొన్నారు.
*జగన్కు ధైర్యముంటే కేంద్రాన్ని ప్రశ్నించాలి-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ధైర్యం ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సోమవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధుల విషయమై ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో అయినా కేంద్రం తీరును వైకాపా ఎంపీలంతా ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.
*యనమలపై కొడాలి నాని విమర్శలు తగవు
మాజీ మంత్రి యనమలను అసభ్యపదజాలంతో మంత్రి కొడాలి నాని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జాతీయ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. యనమలను దూషించడం బీసీల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగేశ్వరయాదవ్ పేర్కొన్నారు.