1.మా అబ్బాయి చాలా మంచోడు: ప్రశాంత్ తండ్రి
అక్రమంగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించారనే ఆరోపణలతో ఇద్దరు భారతీయులను పాకిస్థాన్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో తెలుగు వ్యక్తి ప్రశాంత్ కూడా ఉన్నాడు. ప్రశాంత్‌ను అరెస్టు చేయడంపై ఆయన తండ్రి బాబూరావు మీడియాతో మాట్లాడారు. తమ కుమారుడు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తి కాదన్నారు.దిల్లీ వెళ్లి రాయబార కార్యాలయాన్ని సంప్రదించి తమ కుమారుడ్ని క్షేమంగా అప్పగించాలని కోరతామన్నారు. విశాఖపట్నానికి చెందిన బాబూరావు కుటుంబం గత ఐదేళ్లుగా కూకట్‌పల్లిలో నివాసం ఉంటోంది.
2. ఉండవల్లి శ్రీదేవిపై విచారణ జరపండి: ఈసీ
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారో?కాదో? తేల్చేందుకు విచారణ జరపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు. 2019 ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి ఉండవల్లి శ్రీదేవి వైకాపా తరఫున పోటీ చేసి, ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థి శ్రావణ్ కుమార్తెపై విజయం సాధించారు. అనంతరం ఓ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే శ్రీదేవి తాను క్రిస్టియన్ అని చెప్పిన విషయాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున సంతోష్ అనే వ్యక్తి ప్రస్తావిస్తూ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.
3. సిబ్బందిపై మరో ‘పెట్రో’ దాడి
హైదరాబాద్ నగర శివారులో తహసీల్దార్ విజయారెడ్డిపై జరిగిన దాడి ఘటన మరవకముందే.. అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కార్యాలయ సిబ్బందిపై కనకయ్య అనే రైతు పెట్రోలు చల్లాడు. భూమి పట్టాలు ఇవ్వడం లేదంటూ సీనియర్ అసిస్టెంట్‌తోపాటు, ఇతరసిబ్బందిపై పెట్రోలు పోశాడు. అన్నదమ్ముల మధ్య భూ వివాదం కారణంగానే పట్టాలు ఇవ్వలేదని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు.
4. పార్లమెంట్: ఆందోళనలు.. వాయిదాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండో రోజైన మంగళవారం ఉభయసభల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. లోక్‌సభ ప్రారంభం కాగానే జేఎన్‌యూ వివాదంపై విపక్ష పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. అటు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి ఎస్పీజీ భద్రత తొలగింపుపై కూడా కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం పలు అంశాలపై విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ప్రతిపక్షాల నిరసనల నడుమే లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
5. ‘భారత్‌కు శాశ్వత సభ్యత్వ హోదా ఇవ్వాల్సిందే’
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆత్మపరిశీలన చేసుకునే స్థాయి నుంచి ప్రపంచ యవనికపై బలంగా గళం వినిపించే స్థాయికి భారత్ ఎదిగిందని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబోట్ అభిప్రాయపడ్డారు. ఉపఖండ పరిధుల్ని దాటి అంతర్జాతీయంగా కీలక పాత్ర పొషించే స్థాయికి చేరుకుందని కొనియాడారు. అలాగే ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా పొందేందుకు భారత్‌కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయని తెలిపారు. సైనిక, ఆర్థిక సామర్థ్యం సహా పరిమాణం, జనాభాపరంగా చూసి ఏదైనా దేశానికి శాశ్వత సభ్యత్వ హోదా ఇవ్వాల్సి ఉంటే అది ఇండియానే అని ఆయన అభిప్రాయపడ్డారు.
6. సినిమాను తలపిస్తున్న హాంకాంగ్ నిరసనలు
సంపూర్ణ ప్రజాస్వామ్యమే లక్ష్యంగా గత కొన్ని వారాలుగా జరుగుతున్న నిరసనలతో హాంకాంగ్ అట్టుడుకిపోతోంది. హాంకాంగ్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయం వద్ద ఆందోళనకారులు పెద్ద ఎత్తున హింసాత్మక అల్లర్లకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. యూనివర్శిటీని తమ అధీనంలోకి తీసుకుని ఆందోళనకారులను నిర్బంధించారు. అయితే పోలీసుల నిర్బంధం నుంచి నిరసనకారులు తప్పించుకున్న తీరు సినిమాను తలపిస్తోంది. నల్ల ముసుగులు ధరించిన పదుల సంఖ్యలో ఆందోళనకారులు తాళ్ల సాయంతో యూనివర్శిటీ భవనంపై నుంచి కిందకు దిగి అప్పటికే అక్కడ ఉంచిన బైక్‌లపై పారిపోయారు.
7. కోల్‌కతా తప్పుడు నిర్ణయం తీసుకుంది
ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ క్రిస్‌లిన్‌ను వదులుకోవడం తప్పుడు నిర్ణయమని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ఈ విషయంపై ఆ జట్టు సహ యజమాని షారుఖ్ ఖాన్‌కు మెసేజ్ చేస్తానని తెలిపాడు. అబుదాబి టీ10లీగ్‌లో భాగంగా మరాఠా అరేబియన్స్ తరఫున ఆడుతున్న లిన్.. టీమ్ అబుదాబిపై సోమవారం (91; 31 బంతుల్లో 9×4, 7×6) సంచలన బ్యాటింగ్ చేశాడు. దీంతో ఈ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్ క్రికెటర్ ఆలెక్స్ హేల్స్(87; 32 బంతుల్లో) గత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
8. వరుసగా ఆరో రోజు పెరిగిన పెట్రోలు ధర
పెట్రోల్ ధరలు వరుసగా ఆరో రోజు పెరిగాయి. మరోవైపు గత ఆరు రోజులుగా స్థిరంగా ఉన్న డీజిల్ ధర నేడు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడిచమురు ధరల కారణంగా దేశంలో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. సవరించిన అనంతరం దిల్లీ, ముంబయి, కోల్‌కతా నగరాలలో పెట్రోల్ ధరలో పెరుగుదల లీటరుకు 15 పైసలు కాగా, చెన్నైలో ఇది 16 పైసలుగా ఉంది. ఇక ఈ నాలుగు ప్రధాన నగరాలలో డీజిల్ దర లీటరుకు 5 పైసలు పెరిగింది.
9.తాగుబోతు వీరంగం.. పోలీసుల పరుగులు
మద్యం మత్తులో గుర్రం సాయి అనే ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. విశాఖపట్నం మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ సురేశ్, హోంగార్డు కుమార్‌పై హత్యాయత్నం చేశాడు. కత్తి పట్టుకొని వెంబడించగా.. భయంతో వారు పరుగులు తీశారు. ఓ అపార్టుమెంట్ ఎదుట దారికి అడ్డంగా నిలిపిన గుర్రం బండిని పక్కకు జరపాలని సెక్యూరిటీగార్డు చెప్పడంతో వివాదం చెలరేగింది. సెక్యూరిటీ, కమ్యూనిటీగార్డులను గుర్రం సాయి గాయపర్చడంతో అక్కడివారు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
10.వివాదంలో చిక్కుకున్న తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి
తాడికొండ వైసీపీ ఎమ్యెల్యే శ్రీదేవి వివాదంలో చిక్కుకున్నారు. తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. అదే సామాజిక వర్గ కోటాలో పోటీ చేసి గెలుపొందిన తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఎస్సీ కాదంటూ రాష్ట్రపతికి లీగల్ రైట్స్ ఫోరం ఫిర్యాదు చేసింది. నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించింది. 26న విచారణకు హాజరుకావాలని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి గుంటూరు జిల్లా జేసీ ఆదేశాలు పంపారు. ఎస్సీ అని నిరూపించేందుకు అవసరమైన పత్రాలు, ఆధారాలతో విచారణకు రావాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఎమ్మెల్యేకు సూచించారు.
నేటి పది ప్రధాన వార్తలు-11/19
Related tags :