Politics

గాంధీ కుటుంబానికి SPG భద్రత ఎందుకు తొలగించారు?

Why did Modi govt revoke SPG seurity to Sonia family?

గాంధీ ఫ్యామిలీకి ఎస్పీజీ భ‌ద్ర‌త‌ను ఎత్తివేయ‌డాన్ని ఇవాళ‌ లోక్‌స‌భలో ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రీ ప్ర‌శ్నించారు. గాంధీ కుటుంబీకులు సాధార‌ణ వ్య‌క్తులేమీ కాద‌న్నారు. ఎందుకు అక‌స్మాత్తుగా గాంధీ ఫ్యామిలీకి ఎస్పీజీ భ‌ద్ర‌త‌ను తొల‌గించార‌ని అధిర్ అడిగారు. భ‌ద్ర‌త‌ను ఉప‌సంహ‌రించాల్సిన అవ‌స‌రం ఏమివ‌చ్చింద‌న్నారు. లోక్‌స‌భ‌లో ఇవాళ ప్ర‌శ్నోత్‌ రాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో.. కాంగ్రెస్ స‌భ్యులు నినాదాల‌తో హోరెత్తించారు. అంత‌క‌ముందు ఉద‌యం కాంగ్రెస్ పార్టీ.. ఇదే అంశాన్ని చ‌ర్చించాల‌ని వాయిదా తీర్మానం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ.. ఇవాళ ఒంట‌రిగానే పార్ల‌మెంట్‌కు వ‌చ్చారు. ఆమెతో పాటు కారులో వ‌చ్చిన సీఆర్‌పీఎఫ్ జ‌వానును ఒక‌టో నెంబ‌ర్ గేటు వ‌ద్దే ఆపేశారు. సోనియా, ప్రియాంకా, రాహుల్ గాంధీల‌కు ఎస్పీజీ భ‌ద్ర‌త తొల‌గించిన త‌ర్వాత సీఆర్‌పీఎఫ్ ద‌ళాలు వారికి సెక్యూర్టీని క‌ల్పిస్తున్నాయి. గాంధీ ఫ్యామిలీకి మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయి .. స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ గ్రూపు ద్వారా భ‌ద్ర‌త క‌ల్పించార‌ని అధిర్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. 1991 నుంచి 2019 వ‌ర‌కు రెండుసార్లు ఎన్‌డీఏ అధికారంలోకి వ‌చ్చింద‌ని, కానీ ఆ స‌మ‌యంలో ఎప్పుడూ ఎస్పీజీ భ‌ద్ర‌త‌ను తొల‌గించ‌లేద‌న్నారు. మ‌రిప్పుడెందుకు తొల‌గించార‌ని ఆయ‌న అడిగారు. ఎస్పీజీ భ‌ద్ర‌త తొల‌గింపుపై ప్ర‌ధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వివ‌ర‌ణ ఇవ్వాల‌న్నారు. ప్ర‌భుత్వ స్పందించ‌క‌పోవ‌డంతో.. సుమారు 20 మంది కాంగ్రెస్‌, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పార్టీ నేత‌లు మొద‌ట వెల్‌లోకి దూసుకువెళ్లారు. ఆ త‌ర్వాత స‌భ నుంచి వాకౌట్ చేశారు.