గన్నవరం రాజకీయ వేడి రగులుతూనే ఉంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం రెండు పార్టీల్లోనూ కలకలం సృష్టిస్తోంది. తాజాగా వైకాపాలో బుజ్జగింపులు ప్రారంభమయ్యాయి. గన్నవరం నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఆయనను మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు సీఎం దగ్గరకు తీసుకెళ్లారు. సోమవారం సాయంత్రం సీఎం నివాసంలో కలిసి చర్చించారు. యార్లగడ్డ రాజకీయ భవిష్యత్తుకు సీఎం భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. చర్చల సారాంశం వెలుగులోకి రాలేదు. అయితే ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి పని చేయాలని మాత్రమే సీఎం జగన్ సూచించినట్లు తెలిసింది. ఎలాంటి భేషజాలకు పోకుండా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పినట్లు తెలిసింది. తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైకాపాలో చేరనున్న విషయం తెలిసిందే. తన అంగీకారాన్ని సీఎం జగన్‌కు తెలియజేసిన అనంతరం పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. త్వరలో ఆయన వైకాపా కండువా కప్పుకోనున్నారు. అప్పటి వరకు ముఖ్యమంత్రి జగన్‌కు సంఘీభావం ప్రకటించారు. ఈ నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు అసంతృప్తికి గురయ్యారు. వంశీని వైకాపాలో చేర్చుకోవద్దని కొంతమంది కార్యకర్తలు యార్లగడ్డ నివాసం వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం ఆయన సీఎంను కలిసేందుకు ప్రయత్నించగా అవకాశం లభించలేదు. ఆయనకు అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఇన్‌ఛార్జిగా కొనసాగనున్నారు. ఆయనకే వైకాపా కార్యకర్తలు, నాయకులు మద్దతు ఇవ్వాలని అధినేత నుంచి సూచనలు వెళ్లాయి. దీంతో గత కొన్ని రోజులుగా వైకాపా కార్యకర్తలతో వంశీ కార్యలయం నిండింది. మరోవైపు కొంతమంది అలకబూనారు.
*** ఎన్నికల ముందు అలా…సార్వత్రిక ఎన్నికల ముందు వంశీ, యార్లగడ్డ ప్రత్యర్థులుగా ఉన్నారు. నామినేషన్ సమయంలో ఇద్దరి మధ్య వాట్సప్ సందేశాల యుద్ధం జరిగింది. పోలీసు కమిషనర్‌కు యార్లగడ్డ ఫిర్యాదు చేశారు. తనను బెదిరిస్తున్నారని వంశీపై ఆరోపణలు చేశారు. నాడు పార్టీ యార్లగడ్డకు మద్దతుగా నిలిచింది. బ్రహ్మయ్యలింగం చెరువు మట్టి వ్యవహారంలోనూ ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ పాదయాత్ర సమయంలో పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అన్నట్లుగా విజిలెన్సు విచారణకు ఆదేశించారు. కానీ చర్యలు మాత్రం లేవు. గతంలో వైకాపా కార్యకర్తలపై పలు కేసులు పెట్టించారని ఆరోపించారు. తిరిగి ఆయనను పార్టీలోకి తీసుకోవడం వల్ల తన పరిస్థితి ఏమిటని వెంకట్రావు వాపోయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు కలిసి యార్లగడ్డను సీఎం దగ్గరికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఎమ్మెల్యే వంశీని వారే సీఎం దగ్గరకు తీసుకెళ్లారు. ప్రస్తుతం యార్లగడ్డను వారే తీసుకెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. సోమవారం సీఎం వారితో కొద్దిసేపు మాట్లాడి కలిసి పనిచేయాలని అంతా సర్దుకుంటుందని చెప్పినట్లు తెలిసింది.
*** పార్టీ పటిష్ఠానికి చర్యలు…మరోవైపు తెలుగుదేశం పార్టీ పటిష్టానికి నేతలు చర్యలు తీసుకుంటున్నారు. పార్టీకి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు మండలాల వారీగా పర్యటనలు చేస్తున్నారు. సంస్థాగత ఎన్నికలను పకడ్బంధీగా నిర్వహించి పార్టీకి తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని నిర్ణయించారు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ జంపింగ్ తర్వాత నియోజకవర్గానికి అయిదుగురు సభ్యులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే. వర్లరామయ్య, గద్దె అనురాధ, బచ్చుల అర్జునుడు, ముద్రబోయిన వెంకటేశ్వరరావు, కొనకొళ్లను అధినేత చంద్రబాబునాయుడు నియమించారు. ప్రస్తుతం వీరికి మండలాల వారీగా బాధ్యతలు అప్పగించారు. బాపులపాడుకు జిల్లా అధ్యక్షుడు అర్జునుడు, విజయవాడ గ్రామీణ మండలానికి మాజీ ఎంపీ కొనకొళ్ల, ఉంగటూరుకు మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ అనురాధ, గన్నవరం మండలానికి ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు అప్పగించారు.