Business

ఇక జియో ఉచితాలు ఉండవు

Jio Ready To Bang Customers With Price Hikes

ఉచితాలతో సంచలనం రేపిన రిలయన్స్ జియో ఇపుడు వినియోగదారులపై భారం మోపేందుకు సిద్ధమైంది. త్వరలోనే సేవలన్నింటికీ చార్జీలు వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ప్రైవేట్ టెలికాం కంపెనీలైన వొడాఫోన్, ఎయిర్‌టెల్ కంపెనీలు చార్జీల పెంపుపై ఓ ప్రకటన చేశాయి. ఇపుడు రిలయన్స్ జియో కూడా ఆ కంపెనీలతోనే కలిసి ప్రయాణించనుంది. 

నిజానికి దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఓ సంచనమే సృష్టించింది. ‘ఉచిత’ ఆఫర్లతో అదరగొట్టింది. ఫలితంగా అతి తక్కువ కాలంలోనే కోట్లాదిమంది ఖాతాదారులను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి కంపెనీలైన వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌లు మొబైల్ చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించారు. 

దీనిపై జియో స్పందించింది. మరికొన్ని వారాల్లో తాము కూడా టారిఫ్ ధరలను పెంచబోతున్నట్టు తెలిపింది. డిసెంబరు 1 నుంచి కొత్త టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ప్రకటించి 24 గంటలు కూడా గడవకముందే జియో ఈ ప్రకటన చేయడం గమనార్హం. కాగా, జియో ఇప్పటికే నాన్-జియో కాల్స్‌కు నిమిషానికి ఆరు పైసల చొప్పున వసూలు చేస్తోంది. ఇప్పుడు మొబైల్ చార్జీలు కూడా పెంచితే ఖాతాదారుల జేబులకు చిల్లులు పడడం ఖాయం. 

ఇతర ఆపరేటర్లలానే తాము కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని జియో పేర్కొంది. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడంతోపాటు, పరిశ్రమను బలోపేతం చేసేందుకు ట్రాయ్ తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటామని ప్రకటించింది. డేటా వినియోగం, డిజిటలైజేషన్‌కు ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా మరికొన్ని వారాల్లో తాము కూడా టారిఫ్‌ను పెంచుతామని ముకేశ్ అంబానీ సంస్థ తెలిపింది.