Movies

కృతీ లవ్ స్టోరీ

Kriti Karbandha Love Story

‘బోణీ’, ‘తీన్‌మార్‌’ చిత్రాల కథానాయికగా, ‘బ్రూస్‌లీ’లో రామ్‌చరణ్‌కు సోదరిగా నటించిన కృతి కర్భంద తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. టాలీవుడ్‌లో సరైన హిట్‌ ఒకటీ లేకపోవడంతో కన్నడ, తమిళ, హిందీ చిత్రాలపై దృష్టి పెట్టారు. ఇటీవల ‘హౌస్‌ఫుల్‌ 4’తో తొలి విజయం అందుకున్నారు. ప్రస్తుతం ఆమె దృష్టంతా బాలీవుడ్‌పైనే! ‘పాగల్‌ పంతీ’ సినిమాకు సైన్‌ చేశాక ఆ చిత్ర హీరో పులకిత్‌ సామ్రాట్‌తో ప్రేమలో ఉందనే వార్తలు బీటౌన్‌ చక్కర్లు కొట్టాయి. అయితే కృతీ ఆ విషయంపై ఎప్పుడూ నోరు మెదపలేదు. పులకిత్‌తో ఆమె ప్రేమ వ్యవహారాన్ని ఇటీవల బయటపెట్టారు.తాను ప్రేమలో ఉన్నాననీ, ఇందులో దాయాల్సిందేమీ లేదనీ, తన తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలుసని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘మాపై వస్తున్నవి రూమర్లు కావు. అవును నేనూ, సామ్రాట్‌ ప్రేమలో ఉన్నాం. ఒక వ్యక్తి నచ్చడానికి ఐదు ఏళ్లు పట్టొచ్చు. కానీ పులకిత్‌ నాకు ఐదు నెలల్లోనే పూర్తిగా అర్థమయ్యాడు. తన మీద ఉన్న నమ్మకంతోనే నా ప్రేమ విషయాన్ని బయటకు చెబుతున్నా. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది’’ అని కృతీ తెలిపారు.