Politics

చెన్నమనేని రమేశ్ పాస్‌పోర్ట్ రద్దు చేసిన భారత ప్రభుత్వం

TRS MLA Chennamaneni Ramesh Indian Passport Cancelled

తెరాస ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ భారత పౌరసత్వాన్ని కోల్పోయారు. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చెన్నమనేని రమేశ్‌ భారత పౌరసత్వానికి అనర్హుడని కేంద్రహోంశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేసింది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెరాస ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని రమేశ్‌ భారత పౌరుడు కాదని, ఆయన ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హుడు కాదని భాజపా నేతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పౌరసత్వంపై కేంద్ర హోంశాఖ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా దీనిపై విచారణ జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇదే అభిప్రాయం వెల్లడించింది. ఈనేపథ్యంలో విచారణ చేపట్టిన కేంద్ర హోంశాఖ అన్ని వివరాలు పరిశీలించింది. పిటిషనర్‌తో పాటు, చెన్నమనేని రమేశ్‌ నుంచి కూడా వివరాలు సేకరించిన భారత పౌరసత్వ విభాగం బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. చెన్నమనేని రమేశ్‌ భారత పౌరుడు కాదని, ఇక్కడ ఎలాంటి అధికారాలు పొందేందుకు అర్హుడు కాదని హోంశాఖ స్పష్టం చేసింది. చట్టానికి అనుగుణంగా వ్యవహరించాల్సిందేనని, రమేశ్‌ ఈ దేశంలో పర్యటించాలంటే వీసా తీసుకోవాల్సిందేనని పేర్కొంది. అమెరికా నుంచి గతంలో ఆయన వీసా పొందే సమయంలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని, భారత్‌కు వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పాటు అమెరికా వెళ్లకుండా వీసాను పునరుద్ధరించుకోకుండా వ్యవహరించారని తెలిపింది. తప్పుడు సమాచారంతో భారత ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రస్తుతం రమేశ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఎలాంటి పదవులు పొందడానికి ఆస్కారం లేకుండా హోంశాఖ ఉత్తర్వుల్లో పొందుపరిచింది.