DailyDose

హైదరాబాద్‌లో బంగారం 10గ్రా ధర-వాణిజ్యం-11/21

10G Gold Price In Hyderabad And India-Telugu Business News-11/21

* వివిధ మార్కెట్లలో  బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,430, విశాఖపట్నంలో రూ.39,570, ప్రొద్దుటూరులో రూ.39,000, చెన్నైలో రూ.38,250గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,610, విశాఖపట్నంలో రూ.36,400, ప్రొద్దుటూరులో రూ.36,120, చెన్నైలో రూ.36,640గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,800, విశాఖపట్నంలో రూ.46,100, ప్రొద్దుటూరులో రూ.46,200, చెన్నైలో రూ.48,600 వద్ద ముగిసింది.

* చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ షావోమి మరో ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ను భారత్‌కు తీసుకొచ్చింది. ఎంఐ బ్యాండ్‌ 3ఐ పేరిట దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎంఐ బ్యాండ్‌3కి కొనసాగింపుగా ఎంఐ బ్యాండ్‌ 4ను విడుదల చేసిన ఆ కంపెనీ 3ఐ పేరిట తక్కువ ధరకే దీన్ని విడుదల చేయడం గమనార్హం. ఇందులో 0.78 అంగుళాల మోనోక్రోమ్‌ వైట్‌ అమోలెడ్‌ టచ్‌ డిస్‌ప్లేను అమర్చారు. 110 ఎంఏహెచ్‌ లిథియం పాలిమర్‌ బ్యాటరీతో వస్తున్న ఈ బ్యాండ్‌ 20 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ వస్తుంది. 2.5 గంటల్లో దీన్ని ఫుల్‌ఛార్జ్‌ చేయొచ్చు. కాల్‌/నోటిఫికేషన్‌ అలెర్ట్స్‌, స్టెప్‌, కాలరీ ట్రాకింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్లూటూత్‌ 4.2కి సపోర్ట్‌ చేస్తుంది. ఎంఐ ఫిట్‌ యాప్‌ ద్వారా రోజువారీ యాక్టివిటీలను, స్లీప్‌ ప్రోగ్రెస్‌ను తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 4.4, ఐవోఎస్‌ 9.0 ఆపై వెర్షన్లు కలిగిన ఫోన్లతో అనుసంధానం చేయొచ్చు. రాబోయే మూడు రోజుల వాతావరణ విశేషాలను కూడా తెలుసుకోవచ్చు. వాటర్‌ప్రూఫ్‌ సదుపాయం ఉంది. కేవలం నలుపు రంగులో ఎంఐ.కామ్‌లో ఈ స్మార్ట్‌ బ్యాండ్‌ లభిస్తోంది. దీని ధరను రూ.1,299గా నిర్ణయించింది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఎంఐ బ్యాండ్‌ 3 ధరను అప్పట్లో రూ.1,999గా నిర్ణయించగా.. ప్రస్తుతం రూ.1,799కి లభిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఎంఐ బ్యాండ్‌ 4 ధర రూ.2,299గా ఉంది.

* ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ దిగ్గజం శాంసంగ్‌ వచ్చేఏడాది ఆరంభంలో కాంట్రాక్‌ తయారీ దారుల ద్వారీ భారత్‌లో ఎల్‌ఈడీ టీవీల ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించనుంది. గత ఏడాది ఈ సంస్థ టీవీల తయారీ విభాగాన్ని చెన్నై నుంచి వియత్నాంకు తరలించింది. ఇటీవల భారత్‌లో ఉత్పత్తికి సంబంధించి డిక్సాన్‌ టెక్నాలజీస్‌తో శాంసంగ్‌ ఒప్పందం చేసుకొంది. డిమాండ్‌ను చేరుకొనేందుకు మరికొంత మంది తయారీదారులతో కూడా ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది. ఇటీవల ప్రభుత్వం తయారీ కంపెనీలకు రాయితీలను ప్రకటించడం, డిస్‌ప్లే ప్యానల్స్‌పై గతంలో ఉన్న 5శాతం దిగుమతిపై సుంకాన్ని తొలగించడంతో శాంసంగ్‌కు మార్గం తేలికైంది. దీనికి తోడు వియత్నాం నుంచి సరకు వచ్చేసరికి మార్కెట్‌ పరిస్థితులు మారుతుండటంతో కూడా శాంసంగ్‌ భారత్‌లో తయారీవైపు మొగ్గు చూపింది.

* రిలయన్స్‌కు చెందిన నెట్‌వర్క్‌18లో వాటాలను కొనుగోలు చేసే అంశంపై సోనీ చర్చలు జరుపుతోంది. దీనిపై ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పలు రకాల డీల్స్‌పై సోనీ పలురకాల డీల్స్‌ను దీనికోసం పరిశీలిస్తోంది. సోనీ తన భారతీయ విభాగం వ్యాపారాన్ని కూడా దీంతో కలిపే అవకాశం ఉంది. ఈ వార్తలు బయటకు రావడంతో గురువారం నెట్‌వర్క్‌18 షేర్లు దాదాపు 15శాతం ఎగశాయి. మరోపక్క టీవీ18 బ్రాడ్‌కాస్టింగ్‌ లిమిటెడ్‌ షేర్లు కూడా 9.7శాతం పెరిగాయి. ఈ డీల్‌ ఇరుపక్షాలకు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్‌ వంటి వాటిని ఎదుర్కోవడానికి సోనీకి ఈ డీల్‌ ఎంతగానో ఉపయోగపడనుంది.. అదే సమయంలో అంతర్జాతీయ కంటెట్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి నెట్‌వర్క్‌18కు మంచి అవకాశం లభిస్తుంది. ‘‘మా కంపెనీ పలు అవకాశాలను పరిశీలిస్తోంది’’ అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రతినిధి వెల్లడించారు. మిగిలిన అంశాలపై స్పందించేందుకు నిరాకరించారు. సోనీ ప్రతినిధులు దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

* దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ ముగించాయి. సెన్సెక్స్‌ 76 పాయింట్లు నష్టపోవడంతో 40,575 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 30 పాయింట్లు క్షీణించి 11,968 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.74గా ఉంది. నిఫ్టీలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐషర్‌ మోటార్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబోరేటరీస్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, యస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌ టెల్‌ షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే లోహ, ఇంధన, ఇన్‌ఫ్రా, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్లు నష్టాలు చవిచూశాయి.