WorldWonders

పండ్లతోటలో జ్యూస్ పేరుతో వైన్ తయారీ

Karnataka Farmers Making Wine In The Name Of Fruit Juices

పండ్ల రసం పేరుతో ఏకంగా వైన్‌ తయారు చేసి ఆంధ్ర, కర్ణాటకలో వ్యాపారం చేస్తున్న ఘరానా మోసం ఎక్సైజ్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారుల దాడులతో బుధవారం వెలుగులోకి వచ్చింది. బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహాళ్‌లో ముమ్మర తనిఖీల్లో రూ.45.80 లక్షల వైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

వెలుగులోకి ఇలా…: ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ విజయశేఖర్‌ వివరాల మేరకు… బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహాళ్‌ మాజీ సర్పంచి మారుతీప్రసాద్‌ కొంత కాలంగా అల్లనేరేడు పండ్లతో వైన్‌ తయారు చేసి విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో నిఘా ఉంచి తయారీ స్థావరంపై ఎక్సైజ్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు, సిబ్బంది బుధవారం దాడులు చేశారు. అల్లనేరేడు తోటలో 456 క్యాన్లలో 9,160 లీటర్ల అల్లనేరేడు పళ్లతో తయారు చేసిన వైన్‌ నిల్వలను స్వాధీనం చేసుకొన్నారు.

తయారీ అలా….: తోటలో కాసిన అల్లనేరేడు పళ్లను అమ్మగా మిగిలిన పళ్లను కుళ్లబెడతారు. తర్వాత మిక్చర్‌ సాయంతో రసం తీసి, దానిని క్యాన్లలో నింపుతారు. ఇందులో చక్కెర, ఎండు ఉసిరి, కరక్కాయ కలుపుతారు. ఆపై కొద్దిరోజులు నిల్వ ఉంచి… వైన్‌గా తయారు చేస్తున్నారు. చివరిగా దానిని పండ్ల రసం అని చెప్ఫి. నేచురల్‌ జామూన్‌ ఫ్రూట్‌ జ్యూస్‌, హోమ్‌మేడ్‌ పేరిట లీటరు బాటిల్‌ను రూ.500 చొప్పున విక్రయిస్తున్నారు. లీటరు, అరలీటరు బాటిళ్లను తయారు చేసి అమ్ముతున్నారు. 180 ఎంఎల్‌ బాటిళ్లను తయారు చేసి రూ.100 చొప్పున కర్ణాటకలో విక్రయిస్తున్నారు.

ప్రజారోగ్యంతో చెలగాటం..; ఇందులో ఆల్కహాల్‌ ఉందనీ.. ఇది తాగిన వాళ్లకు నిషా ఎక్కుతుందనీ, ప్రజారోగ్యానికి హాని కలుగుతుందని అధికారులు వివరించారు. వైన్‌ నమూనాలు ఎక్సైజ్‌ ల్యాబ్‌కు, ఆహార తనిఖీ కేంద్రానికి పంపనున్నారు. నిందితుడు పరారీలో ఉండగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడుల్లో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు తనిఖీ అధికారులు నరసానాయుడు, అన్నపూర్ణ, జయనాథరెడ్డి, కణేకల్లు ఎక్సైజ్‌ సీఐ సోమశేఖర, ఆహార తనిఖీ అధికారి ఖలీముల్లా, సహాయ ఆహార తనిఖీ అధికారి శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.