టోల్‌గేట్ల వద్ద ఛార్జీల చెల్లింపులను ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరిపేందుకు ఉద్దేశించిన ఫాస్టాగ్ వ్యవస్థ త్వరలో ప్రారంభం కాబోతోంది. డిసెంబర్ 1 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఏమిటీ ఫాస్టాగ్..? ఎందుకు వాడాలి? ఎక్కడ లభిస్తాయి? వాహనదారులు చెల్లింపులు జరిపేందుకు టోల్‌గేట్ వద్ద ఆగి మళ్లీ బయల్దేరాల్సి ఉంటుంది. దీనివల్ల టోల్‌గేట్ల వద్ద రద్దీ నెలకొనడంతో పాటు సమయం వృథా అవుతోంది. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్‌ఈటీసీ) కార్యక్రమానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2014లో పైలట్ ప్రాజెక్టుగా ఫాస్టాగ్‌ను ప్రారంభించారు.
* ఫాస్టాగ్ బ్యాంకుల నుంచి పొందొచ్చు. అందుకోసం 23 బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఫాస్టాగ్ కలిగిన వాహనం టోల్ ప్లాజా దాటి వెళ్లినప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) సాంకేతికత ఆధారంగా చెల్లింపులు జరుగుతాయి. ఆ మొత్తం లింక్ చేసిన బ్యాంకు ఖాతా నుంచి లేదా కరెంట్ ఖాతా నుంచి జరుగుతాయి. ఫాస్టాగ్ ఆర్ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ను వాహనం ముందు భాగంలో విండ్‌స్ర్కీన్ (అద్దం)పై అతికించాల్సి ఉంటుంది.
* ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ వంటి బ్యాంకుల నుంచి వీటిని కొనుగోలు చేయొచ్చు.
* అమెజాన్‌తో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఒప్పందం కుదుర్చుకుంది. పేటీఎంలోనూ ఫాస్టాగ్ లభిస్తోంది.
* ఫాస్టాగ్‌ను మీ బ్యాంకు ఖాతాతో జత చేసేందుకు ‘ంయ్ Fఆశ్టగ్’ యాప్‌ను మీ ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకుని వాహన రిజిస్ట్రేషన్ సంఖ్యను ఎంటర్ చేయడం ద్వారా సేవలను పొందచ్చు. ఈ యాప్‌ను ఉపయోగించి యూపీఐ పేమెంట్స్ ద్వారా మీ ఫాస్టాగ్‌ను రీఛార్జి చేసుకోవచ్చు.
* పాస్టాగ్‌ను వేరే వాహనానికి ఉపయోగించడానికి వీల్లేదు. ఒక వాహనానికి మాత్రమే వినియోగించేలా దీన్ని రూపొందించారు.
* ఫాస్టాగ్ వినియోగాన్ని ప్రోత్సహించేలా ఈ ఆర్థిక సంవత్సరం పొడవునా 2.5 శాతం చొప్పున ప్రభుత్వం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.
* ఫాస్టాగ్ కలిగిన వాహనం టోల్‌ప్లాజా గుండా వెళ్లినప్పుడు ట్యాగ్ ఐడీతో పాటు, వెహికల్ తరగతి, రిజిస్ట్రేషన్ నంబర్, యజమాని పేరు, ఇతర వివరాలను అక్కడుండే ఈటీసీ వ్యవస్థ సేకరించి సంబంధిత బ్యాంకుకు చేరవేస్తుంది.
* బ్యాంకు నుంచి నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్‌ఈటీసీ)కి వివరాలు వెళతాయి. అక్కడ సంబంధిత వివరాలు పోలినప్పుడు నిర్దేశించిన రుసుము మొత్తం ఎన్‌ఈటీసీకి చేరుతుంది.
* ఫాస్టాగ్ వల్ల నగదు చెల్లింపుల్లో ఇబ్బందులను అధిగమించొచ్చు. అలాగే టోల్‌గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేదు కాబట్టి అటు ఇంధనం మిగలడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది.
* కొత్తగా తయారయ్యే వాహనాలు డీఫాల్ట్‌గా ఫాస్టాగ్‌ను కలిగి ఉంటాయి.