* ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన మ్యాప్‌లో రాజధానిని గుర్తించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. అమరావతిని గుర్తిస్తూ కొత్తమ్యాప్‌ను విడుదల చేయాలంటూ ఆయన కోరారు.
* చనిపోయేదాకా కాంగ్రెస్ పార్టీని వీడనని, పార్టీకి విధేయుడిగానే ఉంటానని సీనియర్ నేత వి.హనుమంతరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘‘ఇందిరాగాంధీ 1972లో బలహీనవర్గాలకు న్యాయం అనే నినాదం తీసుకున్నారు. భూములు పంచడం, బ్యాంకులను జాతీయం చేయడం.. రుణాలివ్వడం జరిగింది. బలహీనవర్గాల అనుకూల నినాదాలతో కాంగ్రెస్ ఇప్పటి వరకు బతికింది’ అని చెప్పారు.
* పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోదీ గుర్తు పట్టి పలకరిస్తేనే ఆయన దగ్గరకు వెళ్లానని.. ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. భాజపా ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన అనంతరం రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. వైకాపా ఎంపీలు ఎవరూ భాజపాతో టచ్‌లో లేరని వెల్లడించారు. నియోజకవర్గ సమస్యలపై ఎంపీలు.. కేంద్రమంత్రులను కలుస్తుంటారని.. దీనిలో రాజకీయ కోణం ఏమీ ఉండదన్నారు.
* తెలంగాణలో రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలోని 5100 రూట్లకు ప్రైవేటు పర్మిట్లు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గత కొన్ని రోజులుగా సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ తుది తీర్పు వెల్లడించింది.
* కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ నిర్దేశకులని, వాళ్ల అభీష్టం మేరకే పదవులు ఇస్తామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తన నివాసంలో పార్టీ నాయకులతో భేటీ అయిన చంద్రబాబు.. పార్టీ సంస్థాగత ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. డిసెంబరు 18 నుంచి తెదేపా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. పార్టీ ఎన్నికల పురోగతిని సమీక్షించిన చంద్రబాబు.. గ్రామ, మండల పార్టీ కమిటీల ఎన్నికలు వెంటనే పూర్తి చేయాలన్నారు.
* మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ముంబయిలోని నెహ్రూ సెంటర్‌లో జరుగుతున్న సమావేశం ముగిసింది. ఈ చర్చలు ఫలవంతంగా ముగిసినట్లు సమావేశం అనంతరం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. అయితే, ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించేలా అంగీకారం కుదిరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన శనివారం వెలువడనుంది. ఉద్ధవ్ ఠాక్రే కూటమికి నేతృత్వం వహించేలా, ఐదేళ్లపాటు సీఎం పదవిలో కొనసాగేలా ఈ కీలక సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు.
* భారతీయ రైల్వేను ప్రైవేటీకరించడం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రయాణికులకు నాణ్యమైన సేవలందించడానికి కేవలం కమర్షియల్, ఆన్‌బోర్డ్ సేవలను మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాజ్యసభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
* భారత్‌కు చెందిన భద్రతా సిబ్బంది లక్ష్యంగా పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ తమ సిబ్బందికి కీలక సూచనలు చేసింది. సత్వరమే తమ ఫోన్‌లో వాట్సప్ సెట్టింగ్స్‌ను మార్చుకోవాలని సూచించింది. భారత్‌కు చెందిన ఓ ఆర్మీ జవానును పాక్ చెందిన ఓ అనుమానిత ఫోన్ నంబర్ ద్వారా వాట్సప్ గ్రూప్‌లో చేర్చినట్లు ఆర్మీ పేర్కొంది. అయితే, వెంటనే సదరు ఆర్మీ జవాను అప్రమత్తమై ఆ గ్రూప్ నుంచి వైదొలిగి ఆ గ్రూప్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను తీసుకున్నట్లు పేర్కొంది.
* తన కార్యాలయంపై ఎటువంటి ఐటీ దాడులు జరగలేదని అగ్ర కథానాయకుడు నాగార్జున స్పష్టం చేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరిపారా? అంటూ తనకు ఫోన్లు చేస్తున్నారని ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ‘ఐటీ దాడులు జరిగాయా? అంటూ నా స్నేహితుల్లో కొందరు ఫోన్లు చేశారు. ఇప్పుడు ఇది నాకు వార్త (ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ). నాపై, నా కార్యాలయంపై అలాంటి దాడులు ఏమీ జరగలేదు’ అని పేర్కొన్నారు.
* సామాన్యులపై భారం మోపకుండా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం ఎలా పెంచుకోవచ్చో ఆలోచించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకోవాలని, ఇందుకు దిల్లీలోని అధికారుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం రూ.40 వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని, ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంపై కొన్ని నెలలుగా దృష్టి పెట్టామని చెప్పారు. వచ్చే జనవరి లేదా ఫిబ్రవరి నుంచి రచ్చబండ కార్యక్రమం మొదలవుతుందని సీఎం స్పష్టం చేశారు.
* తెరాసకు చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. కేంద్రం ప్రభుత్వ ఉత్తర్వులను 4 వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేసింది.
* మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవిని ఉద్ధవ్ ఠాక్రే చేపట్టాల్సిందిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కోరినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అయితే, ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకొని చెప్తానని ఉద్ధవ్ సమాధానం ఇచ్చినట్లు సేన నాయకులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి ఠాక్రే, పవార్ మధ్య జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిందని అన్నారు. ప్రభుత్వంలో ఆదిత్య ఠాక్రే పాత్ర ఏంటనే అంశమూ ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది.
* మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు జట్టు కట్టడాన్ని అవకాశవాద కూటమిగా కేంద్రమంత్రి, భాజపా సీనియర్ నేత గడ్కరీ అభివర్ణించారు. ఒకవేళ వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆరు నెలలు లేదా మహా అయితే 8 నెలలకు మించి ఉండబోదని జోస్యం చెప్పారు. ఝార్ఖండ్ ఎన్నికల సన్నాహాకాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన పీటీఐ వార్తా సంస్థకు శుక్రవారం ఇంటర్వ్యూ ఇచ్చారు.
* ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీలు శుక్రవారం పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం వాటిని తోసిపుచ్చిందని వార్తలు రావడంతో ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చకు తెరలేపింది.
* ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదల తేదీ మారింది. తొలుత అనుకున్నరోజు కంటే ఒక్కరోజు ముందుగా.. అనగా జనవరి 11న ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలుగు చిత్ర నిర్మాతల సంఘం తెలిపింది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించుకుంది.
* ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘బుల్లెట్ రైలు’ ప్రాజెక్టుకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ, శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ ప్రాజెక్టుని పక్కనబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు పక్షాలు కలిసి సిద్ధం చేసిన కనీస ఉమ్మడి ప్రణాళికలో దీన్ని చేర్చలేదని పేరుచెప్పడానికి ఇష్టపడని కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన మొత్తాన్ని రైతుల సంక్షేమానికి కేటాయించాలని ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇటీవల సాగిన చర్చల్లో నిర్ణయించినట్లు తెలిపారు.
* దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఐటీ షేర్ల అమ్మకాల ఒత్తిడికి తోడు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. అయితే, లోహ, ఇంధన షేర్లు రాణించడంతో నిఫ్టీ 11,900 పైన స్థిరపడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 215 పాయింట్లు నష్టపోయి 40,359 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 54 పాయింట్లు నష్టపోయి 11,914 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.78గా ఉంది.
* నగరంలోని బాలాపూర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏఎస్సై నరసింహ ఆత్మహత్యకు యత్నించారు. సమీపంలోని నీటి ట్యాంకు పైకి ఎక్కి ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఏఎస్సైను సహచరులు అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. ఇటీవల బాలాపూర్ నుంచి మంచాల పీఎస్‌కు నరసింహను బదిలీ చేశారు. ఈ బదిలీకి సీఐ సైదులే కారణమంటూ ఏఎస్సై నరసింహ ఆరోపిస్తున్నారు.