DailyDose

అంకుర సంస్థల్లో మారుతీ పెట్టుబడులు-వాణిజ్యం-11/22

Maruti Investing In Starups-Telugu Business News-11/22

* మారుతీ సుజుకీ.. దేశంలోనే నంబర్‌ 1 కార్ల విక్రేత. ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలు తెలుసుకొంటూ సగటు మధ్య తరగతి కలల కార్లను తయారీ చేసిన చరిత్ర ఈ కంపెనీకి ఉంది. ప్రస్తుతం వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. డ్రైవర్‌ రహిత కార్ల వైపు ప్రపంచం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సాంకేతికతను సృష్టించడం.. దానిని సమర్థవంతంగా వినియోగించుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న స్టార్టప్‌ల వాతావరణాన్ని ఉపయోగించుకోవాలని ఈ సంస్థ భావించింది. ఈ క్రమంలో మొబిలిటీ అండ్‌ ఆటోమొబైల్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌(ఎంఏఐఎల్‌) కార్యక్రమం కింద తాజాగా ఐదు స్టార్టప్‌లను ప్రోత్సహిస్తోంది. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తొలుత ఎంఏఐఎల్‌ కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లు మారుతీ ప్రకటించింది. మొబిలిటీ, ఆటోమొబైల్‌ రంగానికి ఉపయోగపడే స్టార్టప్‌లను ఒక చోటకు చేర్చి వాటితో ఒప్పందం కుదుర్చుకొని పనిచేయనున్నట్లు పేర్కొంది. దీనిపై మారుతీ సుజుకీ ఎండీ ఆయుకవా మాట్లాడుతూ ‘‘భారత ఆటోమొబైల్‌ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. చాలా అడ్డంకులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కొత్త స్టార్టప్‌లతో జట్టుకట్టడంతో మేము ఆటోమొబైల్‌ రంగంలో సరికొత్త తరంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది ’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన స్టార్టప్‌లకు మూడునెలల పాటు దేశీయ, అంతర్జాతీయ స్టార్టప్‌ల్లో అత్యుత్తమ స్థాయి నిపుణులతో శిక్షణను ఇప్పిస్తారు. మారుతీలోని నిపుణులు ఈ స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం చేస్తారు. ఈ స్టార్టప్‌లకు మారుతీ సుజుకీ పరీక్షా కేంద్రం బెడ్‌ను ఉపయోగించుకొనే అవకాశం కల్పిస్తారు. దీంతో ఆయా స్టార్టప్‌లకు ప్రస్తుతం మార్కెట్‌ అవసరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. తాజా స్టార్టప్‌లు లాజిస్టిక్స్‌, ఐవోటీ, భద్రత, పర్యవేక్షణ, ప్లగ్‌ అండ్‌ ప్లే సొల్యూషన్స్‌లో కంపెనీకి ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు. ఈ ఎంపికల్లో సెన్స్‌గిజ్‌, జెన్‌, ఐడెంటిఫైలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. వీటిల్లో సెన్స్‌గిజ్‌, జెన్‌లకు మారుతీతో నేరుగా పనిచేసే అవకాశం లభించింది. దీనికి మారుతీ నుంచి కొంత మొత్తం చెల్లిస్తారు. ఎన్మోవిల్‌, డాక్ట్రోన్‌నులకు కూడా మారుతీ సహకరించనుంది.

సెన్స్‌గిజ్‌
ఈ స్టార్టప్‌ను 2013లో అభిషేక్‌ లత్తే, అపూర్వా షెట్టీ ప్రారంభించారు. ఈ సంస్థ వ్యాపార, పారిశ్రామిక రంగానికి అవసరమైన సెన్సర్ల ఆధారంగా పనిచేసే పర్యవేక్షక పరికరాలు, భద్రత, రియల్‌ టైమ్‌ ట్రాకింగ్‌ అప్లికేషన్లు, క్లౌడ్‌, అనలటిక్స్‌ వంటి ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ పరికరాల తయారీ, సేవలను అందజేస్తుంది.
జెన్‌
ఈ స్టార్టప్‌ను 2017లో ఆయూష్‌ జైన్‌ ప్రారంభించారు. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఛాట్‌బోట్‌ను తయారు చేస్తుంది. కృత్రిమేధ ఆధారంగా పనిచేసే ఇంజిన్ల అనుభవాన్ని మెరుగుపర్చేందుకు దీనిని వాడతారు. దీంతోపాటు వినియోగదారుల అనుభవాన్ని విశ్లేషించి మెరుగైన సేవలు అందించడానికి ఇవి ఉపయోగపడనున్నాయి.
ఐడెంటిఫై
2016లో ఆ స్టార్టప్‌ను ప్రారంభించారు. దుష్యంత్‌ దేచిరాజు, కృష్ణకార్తిక్‌ జాస్తి, అనిరుధ్‌ ఇంజేటీ, వినీత పెనుమత్స, రాజశ్రీ జాస్తి కలిసి దీనిని ఏర్పాటు చేశారు. కంప్యూటర్‌ విజన్‌ ఉపయోగించి చౌకగా ఇంటర్నెట్‌ఆఫ్‌ థింగ్స్‌ సాయంతో డ్రైవర్‌, ప్యాసెంజర్ల భద్రతను మెరుగుపర్చే అవకాశం ఉంది.
ఎన్మోవిల్‌
2015లో నంద కిషోర్‌, రవి బలుసు కలిసి దీనిని ప్రారంభించారు. అనలటిక్స్‌కు సంబంధించిన సేవలను ఇది అందజేస్తుంది. దీనిలో భాగంగా కంపెనీ బ్యాక్‌ఎండ్‌ నెట్‌వర్క్‌లకు సంబంధించి ఈఆర్‌పీ, సీఆర్‌ఎం సేవలను అందించనుంది.
డాక్ట్రోన్
దీనిని 2017లో అజేయ్‌ కబాడి ప్రారంభించారు. ప్లగ్‌ అండ్‌ ప్లే ఆధారంగా తర్వాతి తరం కృత్రిమ మేధ సేవలను అభివృద్ధి చేసేలా ఈ సంస్థ కృషి చేస్తోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ నిర్వహణ, శిక్షణ విధివిధానాలు అభివృద్ధి చేసింది.

* దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఐటీ షేర్ల అమ్మకాల ఒత్తిడికి తోడు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. అయితే, లోహ, ఇంధన షేర్లు రాణించడంతో నిఫ్టీ 11,900 పైన స్థిరపడింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 215 పాయింట్లు నష్టపోయి 40,359 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 54 పాయింట్లు నష్టపోయి 11,914 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.78గా ఉంది. నిఫ్టీలో ఐషర్‌ మోటార్స్‌, టాటా స్టీల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎన్టీపీసీ షేర్లు లాభాలు చవిచూశాయి. భారతీ ఇన్‌ఫ్రా టెల్‌, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, యూపీఎల్‌ షేర్లు నష్టాలు చూశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోగా.. లోహ, ఇంధన, ఆటో షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది.

* వాహన రంగంలో నెలకొన్న మందగమనం తాత్కాలికమైనదేనని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు. అయితే ఆ రంగానికి ప్రోత్సాహకంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. అందులో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల నిధులు అందజేయనున్నామన్నారు. తద్వారా ఈ నిధుల్ని బ్యాంకులు వాహనరంగ సంస్థలకు రుణాల రూపంలో అందజేస్తాయన్నారు. అలాగే ఇటీవల కార్పొరేట్‌ పన్ను తగ్గింపు కూడా చర్యల్లో భాగమేనన్నారు. అలాగే పాత వాహనాల తుక్కు విధానం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. వాహన రంగ మందగమనం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై లోక్‌సభలో సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు ఆయన రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కొత్త వాహనాల డిమాండ్‌ తగ్గడానికి అనేక కారణాలున్నాయన్నారు. వాణిజ్య వాహనాల లోడ్‌ కెపాసిటీ పెంచడంతో వాహనాల పరిమాణం పెరిగిందని తద్వారా ధరలు పెరిగి డిమాండ్‌ తగ్గిందన్నారు. అలాగే డీలర్ల కొల్లేటరల్‌ ఫీజు 25 శాతం నుంచి 60 శాతానికి పెంచడం కూడా ఓ కారణమన్నారు. బీఎస్‌-6కి మారుతున్న తరుణంలో బీఎస్‌-4 వాహనాలపై రాయితీలు ఇచ్చే అవకాశం ఉందన్న ఆలోచనతో వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారన్నారు. పండగ సీజన్‌ సందర్భంగా ప్యాసెంజర్‌ వాహన విక్రయాలు ఇటీవల 0.28శాతం పెరగడాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.