తమ ఫాస్ట్‌ఫుడ్ ప్రాచుర్యం కోసం రూపొందించిన ప్రచారచిత్రంలో తాజాగా వండిన ఆహారంతో పాటు కూరగాయలపై చౌకబారు వ్యాఖ్యలు చేయడంపై మెక్‌డొనాల్డ్స్‌కు ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) షోకాజ్‌ను జారీ చేసింది. గత వారంలో కొన్ని వార్తా పత్రికల్లో మెక్‌డొనాల్డ్స్ ప్రకటించిన ప్రకటనల్లో సొరకాయపై చౌకబారుగా (బాటిల్‌గార్డ్ -స్పాంజ్‌గార్డ్) వ్యాఖ్యలు చేసినట్లు సంస్థ గుర్తించింది. ఆరోగ్యకరమైన కూరగాయలతో పాటు ఇంట్లో వండిన ఆహారాన్ని అవమానించేలా ఈ ప్రకటనల్లో వ్యాఖ్యలున్నట్లు నిర్థారించింది. మంచి ఆహార అలవాట్లను దెబ్బతీసేలా ముఖ్యంగా చిన్నారులపై ప్రభావం చూపేలా ఈ ప్రకటనలు ఉంటున్నాయని ఆక్షేపించింది. సంతృప్త కొవ్వులు, ట్రాన్స్‌ఫ్యాటీ ఆమ్లాలతో కూడిన ఆహార ప్రకటనల ప్రభావం చిన్నారులపై పడకుండా చూడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆదేశించిందని గుర్తు చేసింది. ఇందుకు విరుద్ధంగా ప్రకటనలు ఇచ్చినందుకు మెక్‌డొనాల్డ్స్ ఫాస్ట్‌ఫుడ్ గొలుసుకట్టు విక్రయశాలలను నిర్వహిస్తున్న హార్డ్‌క్యాజిల్ రెస్టారెంట్స్, కన్నాట్ ప్లాజా రెస్టారెంట్స్‌కు షోకాజ్ జారీ చేసింది. దీనిపై నిర్దేశిత గడువులోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రకటనల ప్రమాణాలను అతిక్రమించినట్లు తేలితే, రూ.10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. ఈ ప్రకటన తామివ్వలేదని హార్డ్‌క్యాజిల్ రెస్టారెంట్స్ తెలిపింది. దీనిపై కన్నాట్‌ప్లాజా రెస్టారెంట్స్ స్పందించలేదు.
సొరకాయ అంత చులకనా?-McDonaldsపై FSSAI ఆగ్రహం
Related tags :