DailyDose

గూగుల్‌లో ఆందోళన-వాణిజ్యం-11/23

Huge Protest In Google Over Sexual Abuse-Telugu Business News Roundup-11/23-గూగుల్‌లో ఆందోళన-వాణిజ్యం-11/23

* ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌ తన ఉద్యోగులతో వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇద్దరు ఉద్యోగులను సెలవుపై పంపడంపై శాన్‌ఫ్రాన్సిస్కోలోని కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. తాజాగా పరిణామాలు ఉద్యోగులకు గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కు మధ్య నెలకొన్న వివాదాన్ని తెలియజేస్తున్నాయి. ఒకప్పుడు సంస్థ కార్పొరేట్‌ కల్చర్‌ను మెచ్చుకున్న ఉద్యోగులే ఇప్పుడు గూగుల్‌ వ్యవహరిస్తున్న తీరును తూర్పారబడుతున్నారు. ఈ విషయంపై ప్రశ్నించిన ఉద్యోగులను అణిచివేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దాదాపు 200మంది ఉద్యోగులు శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో శాన్‌ఫ్రాన్సిస్కో ఆఫీస్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ‘‘సంస్థలో జరుగుతున్న లైంగిక వేధింపులపై సరైన చర్యలు తీసుకోవాలని నేను, నా తోటి ఉద్యోగులు సంస్థను అడుగుతున్నాం. అదే సమయంలో పని పరిస్థితులను మెరుగ్గాచేయమని కోరుతున్నాం. ఇవేవీ గూగుల్‌ పట్టించుకోవడం లేదు. చర్యలు తీసుకోక పోగా, మమ్మల్నే నోర్మూసుకుని ఉండాలని సంస్థ చెబుతోంది’’ అని గూగుల్‌లో పనిచేసే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జోరాతంగ్‌ వాపోయారు. ఇద్దరు ఉద్యోగులకు ఎలాంటి హెచ్చరికలేకుండా సెలవుపై వెళ్లమని చెప్పడం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఈ నెల మొదట్లో ఇద్దరు ఉద్యోగులు కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడంతో వారిని సెలవుపై పంపినట్లు గూగుల్‌ ప్రతినిధి ఒకరు మీడియా వెల్లడించిన సంగతి తెలిసిందే.

* వొడాఫోన్‌ ఐడియా కార్యకలాపాలు స్థిరంగా సాగాలంటే, ఛార్జీ(టారిఫ్‌)లను 70% వరకు పెంచాల్సి రావచ్చని యాక్సిస్‌ క్యాపిటల్‌ అంచనా వేసింది. ప్రస్తుతం వినియోగదారులపై వచ్చే సగటు ఆదాయం (ఆర్పు) రూ.107 ఉండగా, ఇది రూ.180కి చేరితే బాలెన్స్‌షీట్‌పై ఒత్తిడి తగ్గుతుందని వివరించింది. ఇందుకోసం ఛార్జీలు గణనీయంగా పెంచాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ఛార్జీల పెంపు 12-24 నెలల వ్యవధిలో జరగొచ్చని అంచనా వేసింది. ప్రతి వినియోగదారుపై సగటు ఆదాయం పెరిగితే, నిర్వహణ లాభం ఏడాదికి రూ.21300 కోట్లకు చేరొచ్చని తెలిపింది. డిసెంబరు 1 నుంచి టారిఫ్‌లు పెంచుతామని ఇప్పటికే వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. అయితే ఎంతమేర పెంచబోతోందీ ఇంకా వెల్లడించలేదు.
నీ వినియోగదారులపై సగటు ఆదాయం 10% పెరిగితే, పరిశ్రమలోని కంపెనీలకు రాబోయే మూడేళ్లలో రూ.33,000 కోట్ల అదనపు ప్రతిఫలం లభిస్తుందన్నది టెలికాం విభాగం అంచనా.
నీ టారిఫ్‌లు 70% వరకు పెరిగితే పరిశ్రమకు రాబోయే మూడేళ్లలో రూ.2 లక్షల కోట్ల అదనపు ప్రతిఫలం లభిస్తుందని యాక్సిస్‌ క్యాపిటల్‌ వివరించింది.

* ప్రత్యేక ఆర్థిక మండళ్ల(ఎస్‌ఈజడ్‌) విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సమీక్షించడం మొదలుపెట్టంది. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు(సీబీఐసీ) సమర్పించిన నివేదిక ఇందుకు నేపథ్యమని చెప్పాలి. కొన్ని ఎస్‌ఈజడ్‌లు వివిధ బంగారం పథకాలను దుర్వినియోగం చేస్తూ.. దేశంలోని చట్టవ్యతిరేకంగా ఎలా దిగుమతి చేస్తున్నాయో తెలుపుతూ సీబీఐసీ ఒక సవివర నివేదికను ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎమ్‌ఓ)కు సమర్పించింది. దేశంలోని పలు ఎస్‌ఈజడ్‌ల ద్వారా జరిగే ఎగుమతుల్లో పలు మోసాలు జరుగుతున్నట్లు సీబీఐసీ తన నివేదికలో పేర్కొంది. అదే విధంగా ప్రస్తుత బంగారం పథకాలను స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌ దుర్వినియోగం చేస్తోందనీ తెలిపింది. ‘బంగారం తయారీ పథకాలను పసిడి ఆభరణాల ఎగుమతిని ప్రోత్సహించడానికి ఉద్దేశించారు. అయితే వాటిని స్మగ్లర్లు దుర్వినియోగం చేస్తున్నారు. ట్రేడర్లు అత్యధిక గ్రేడ్‌ ఉన్న బంగారాన్ని దిగుమతి చేసుకుని.. దానిని కల్తీ చేసి ఆభరణాలను తయారు చేస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన బంగారాన్ని పశ్చిమాసియా వంటి దేశాలకు తరలిస్తున్నార’ని స్పష్టం చేసింది. చాలా సందర్భాల్లో తాము ఎగుమతి చేస్తోంది 22 కారెట్ల ఆభరణాలని ప్రకటిస్తున్నారు. అయితే అవి బంగారం అనేదే లేకుండా తక్కువ విలువ గల లోహాలతో వాటిని తయారు చేస్తున్నట్లు తేలుతోంద’ని వివరించింది. ఇలా జరగడానికి కారణాన్ని సైతం సీబీఐసీ వివరించింది. ‘కరెంట్‌ ఖాతా లోటును నియంత్రించడానికి పసిడి సుంకాన్ని పెంచారు అయితే అది బ్లాక్‌మార్కెట్‌లో పసిడికి గిరాకీని పెంచింద’ని వెల్లడించింది. జులై 2019న ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. దీనిపై అదనంగా జీఎస్‌టీ 3 శాతాన్నీ కలిపితే మొత్తం పన్ను 15.5 శాతం అవుతుంది. ఇది స్మగ్లర్లకు ఆకర్షణీయ అంశమైంది. మరో పక్క, కొన్ని ఎస్‌ఈజడ్‌లలోని పసిడి పథకాలను విదేశీయులు సైతం దుర్వినియోగం చేస్తుండడం ఆందోళన కలిగించే అంశమని సీబీఐసీ నివేదిక అంటోంది.

* ఈ ఏడాది జులై- సెప్టెంబరు త్రైమాసికంలో ఆఫీసు స్థలం అద్దె విషయంలో ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలు ముందు స్థానంలో నిలిచాయి. సీబీఆర్‌ఈ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం ఆఫీసు అద్దె స్థలంలో 70 శాతం వాటా ఈ మూడు నగరాలదేనని పేర్కొంది. ఎటువంటి అవసరాలకైనా ఉపయోగపడే స్థలానికి (ఫ్లెక్సిబల్‌ స్పేస్‌) ముందుముందు గిరాకీ అధికంగా ఉంటుందని తాము భావిస్తున్నట్లు, ఆమేరమకు మనదేశంలో సంకేతాలు కనిపిస్తున్నాయని సీబీఆర్‌ఈ ఛైర్మన్‌ అండ్‌ సీఈఓ అన్షుమన్‌ మ్యాగజైన్‌ పేర్కొన్నారు. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలోని నగరాల్లో ఇప్పటికే ఇటువంటి ధోరణి ఉన్నట్లు, ఇదే మనదేశంలోనూ వస్తుందని అన్నారు. ప్రస్తుతం ఫ్లెక్సిబల్‌ స్పేస్‌ దేశవ్యాప్తంగా 90 లక్షల చదరపు అడుగులు ఉన్నట్లు, వచ్చే ఏడాది చివరి నాటికి ఇది కోటి చదరపు అడుగులకు చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు.

* మౌలిక రంగంలో వచ్చే ఆరేళ్లలో రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం గత బడ్జెట్‌లో లక్ష్యం నిర్దేశించుకుంది. స్వాతంత్ర దినోత్సవం ప్రసంగంలో ప్రధాని మోదీ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. తాజాగా దీనికి సంబంధించిన పెట్టుబడి ప్రణాళిక సిద్ధమైనట్లు, వచ్చే నెల మధ్యలో వెల్లడించే అవకాశం ఉందని ఆర్థిక శాఖలోని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌-మార్చి) వరకు మౌలిక రంగంలో ఏయే ప్రాజెక్టులపై ఎంత వ్యయం చేయాలని నివేదిక తయారు చేయడానికి గత సెప్టెంబరులో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి నేతృత్వంలో ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించేందుకు సాంకేతికంగా సాధ్యమయ్యే, ఆర్థికంగా లాభదాయకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గుర్తించి, 2025 మార్చి వరకు చేపట్టాల్సిన ప్రాజెక్టులతో కలిపి ఓ నివేదిక రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. మౌలిక రంగంలోని ప్రైవేటు సంస్థలు, ఇతర మౌలిక మంత్రిత్వ శాఖలతో అనేక సంప్రదింపులు జరిపిన బృందం నివేదికను సిద్ధం చేసింది.

* భారత బ్యాంకులపై మరింత భారం పడనుంది. ఇప్పటికే రూ.9 లక్షల కోట్లకుపైగా మొండి బకాయిలతో సతమతమవుతున్న బ్యాంకులకు మరో రూపంలో ఇబ్బంది ఎదురుకానుంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన రూ.35,000 కోట్ల రుణాలను రద్దు చేయాల్సి వస్తే షాడో బ్యాంక్‌ సంక్షోభం మరింత ముదిరే అవకాశం లేకపోలేదు. మొత్తం వ్యవహారానికి కేపీఎమ్‌జీ నివేదిక కీలకంగా మారనుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఓ నిర్ణయం తీసుకుంది. ఏదైనా రుణ ఖాతాలో మోసం జరిగిందని భావిస్తే.. నాలుగు త్రైమాసికాల్లోగా మొత్తం రుణాలకు కేటాయింపులు చేయాలని చెప్పింది. ఇపుడు దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్ప్‌ను మోసపూరిత ఖాతాగా ప్రకటిస్తే.. సంక్షోభం మరింత క్షోభపెట్టవచ్చు.